Oct 09,2023 13:20

ఇజ్రాయెల్‌ : ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధం మధ్య పిల్లలలో మీజిల్స్‌ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నదని ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. గత కొన్నాళ్లుగా రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతోంది. ప్రపంచంలో ఈ యుద్ధం తర్వాత.. ఇప్పుడు ఇజ్రాయెల్‌- పాలస్తీనాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో ... మరోసారి దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దారుణంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. వీటి పర్యవసానాలను దేశంలోని సామాన్య ప్రజలు భరించవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

                                                                   పిల్లలకు ప్రాణాంతక వ్యాధి....

టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం ... ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ నగరంలో రెండేళ్ల వయసున్న నలుగురు పిల్లలు తీవ్రమైన తట్టు (మీజిల్స్‌) వ్యాధి బారినపడ్డారు. చిన్నపిల్లలకు వస్తున్న ఈ ప్రాణాంతక వ్యాధి విషయంలో నివారణ చర్యలు చేపట్టాలని, పిల్లలకు టీకాలు వేయాల్సిన అవసరం ఉందని ఇజ్రాయెల్‌ పీడియాట్రిక్‌ అసోసియేషన్‌ ప్రభుత్వానికి తెలిపింది. దేశంలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు వెంటనే టీకాలు వేయించాలని వైద్యాధికారులు సూచనలు చేశారు. తట్టు అనేది వాస్తవానికి రుబియోలా అనే వైరస్‌ వల్ల కలిగే ఇన్ఫెక్షన్‌. ఇది ఎక్కువగా పిల్లలపై దాడి చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్‌ చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇది పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ వైరస్‌ సోకాక 10 నుండి 14 రోజుల వ్యవధిలో ఈ ఇన్ఫెక్షన్‌ లక్షణాలు బయపటతాయి.

తట్టు లక్షణాలు : జ్వరం, పొడి దగ్గు, జలుబు, గొంతు మంట, కళ్లు ఉబ్బడం, చర్మంపై దద్దుర్లు, చర్మంపై చిన్న మచ్చలు

                                                                       గాలిలో వైరస్‌ వ్యాప్తి...

వాస్తవానికి మీజిల్స్‌ (తట్టు) లక్షణాలు సాధారణంగా రోగి ముక్కు, గొంతులో కనిపిస్తాయి. బాధితుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఈ వైరస్‌ గాలిలో కలుస్తుంది. ఫలితంగా వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఈ ప్రమాదకరమైన వ్యాధికి టీకా అందుబాటులో ఉంది. రెండు మోతాదుల టీకా ఈ వ్యాధిని నివారించడంలో, ప్రాణాలను రక్షించడంలో 97 శాతం ప్రభావవంతంగా ఉంటుందని స్పష్టమయ్యింది.