ప్రపంచవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకూ ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఆస్తమా (ఉబ్బసం) వ్యాధి ఒకటి. ఇది శ్వాస సంబంధ వ్యాధి ఇది. దీనివల్ల ఊపిరితిత్తుల్లో వాపు వల్ల వాయు మార్గాలు కుంచించుకు పోతాయి. శ్వాసకు అడ్డంకులు ఏర్పడి రోగి సరిగ్గా గాలి తీసుకోలేక ఇబ్బందిపడతాడు. ఈ వ్యాధిగ్రస్తులను ఆయాసం, దగ్గు బాగా ఇబ్బంది పెడతాయి. వర్షాకాలం, శీతాకాలంలో అస్తమా రోగులకు సమస్యలు మరింతగా పెరుగుతాయి. ఈ రెండు కాలాల్లో సూర్యరశ్మి తక్కువగా ఉండటంతో విటమిన్-డి తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తి మరింత పడిపోయి ఆస్తమా తీవ్రరూపం దాల్చుతుంది. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 30-35 సంవత్సరాల పెద్దవారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల్లో పుట్టినప్పటి నుంచి ఈ వ్యాధి ఉంటే దానిని 'చైల్డ్‌హుడ్ ఆన్సెట్ ఆస్తమా' అంటారు. 20 సంవత్సరాల పైబడి ఉన్న వారిలో వస్తే దానిని 'అడల్ట్ ఆన్సెట్' ఆస్తమా అంటారు.
వంశ పారంపర్యం, వాతావరణ కాలుష్యం, దీర్ఘకాలిక జలుబు, సైనస్ ఇన్‌ఫెక్షన్స్, దుమ్ము, ధూళి, బూజు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, ఆహార పదార్థాల్లోని రసాయనాల వంటి వల్ల ఆస్తమా వస్తుంది. చర్మ వ్యాధులు ఉన్న చిన్నారులకు వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లిదండ్రులు ఆస్తమా బాధితులైతే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. జలుబు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లతో కూడా రావచ్చు. వాయు కాలుష్యం, సిగరెట్ పొగ, సెంటు వాసనలు, దుమ్ము, ధూళితో కూడా సంభవిస్తుంది. యాస్పిరిన్ వంటి నొప్పి తగ్గించే ఔషధాలు, బీపీ నియంత్రణకు వాడే కొన్ని మందులతో కూడా వచ్చే అవకాశం ఉంది. అజీర్తి, గ్యాస్ ట్రబుల్, మానసిక ఒత్తిళ్లు తదితర వాటితో వచ్చే ప్రమాదం ఉంది.
వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన ఆహారాలు
పాలకూర : మెగ్నీషియానికి పాలకూర మంచి ఆధారం. ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో ఇది బాగా సహకరిస్తుంది.
రెడ్ క్యాప్సికం : దీనిలో 'సి' విటమిన్ (ఎస్కార్బిక్ యాసిడ్) ఎక్కువగా ఉంటుంది. ఎర్ర మిరపకాయలోని ఎస్కార్బిక్ యాసిడ్ 'ఫాస్ఫోడిల్ స్టెరేజ్' అనే ఎంజైమ్ ఉత్పత్తిని అడ్డుకొని ఆస్తమాను నివారించడంలో ఉపయోగపడుతుంది.
ఉల్లి : వీటిలో కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ అస్త్మాటిక్ ప్రభావాలున్నాయి.
ఆరెంజ్ : కమలా, నారింజ, నిమ్మలలో ఉండే విటమిన్ 'సి' ఆస్తమా లక్షణాలు తగ్గిస్తుంది.
యాపిల్ : యాపిల్‌లో ఉండే 'ఫైటోకెమికల్స్', యాపిల్ తొక్కలో ఉండే 'లైకోఫిన్' వంటివి అస్తమాతో ఇబ్బంది పడే వారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.
నివారణా పద్ధతులు
ఇన్‌హెలేషన్ థెరపీ : ఇన్‌హెలేషన్ థెరపీ అనేది ఆస్తమా వ్యాధికి ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం పొందిన అత్యుత్తమ చికిత్సా విధానం. దీనివల్ల నేరుగా మందు వాయు మార్గం నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి తక్షణం పనిచేస్తుంది. ఇందులో 'రిలీవర్స్' తాత్కాలిక ఉపశమనం కలిగించేవి. 'ప్రివెంటర్స్' దీర్ఘకాలం వ్యాధిని అదుపులో ఉంచేవి. ఇతర ఔషధాలతో పోల్చితే ఈ ఇన్ హేలర్ల ద్వారా ఇచ్చే ఔషధాలు చాలా తక్కువ డోసేజీని కలిగి ఉంటాయి. నిరభ్యంతరంగా ఈ విధానాన్ని ఎంచుకోవచ్చుని వైద్య నిపుణులు చెబుతుంటారు.
మందుల వాడకం ద్వారా : మాత్రల ద్వారా గనుక మందులను తీసుకుంటే అవి మొదట రక్తంలోకి వెళ్లి తరువాత ఊపిరితిత్తులను చేరుకుని పనిచేస్తాయి. అందుకు కొంత ఎక్కువ సమయం పడుతుంది.
ఇంజక్షన్ ద్వారా వైద్యం : సిరప్‌లు, ఇంజక్షన్లు ద్వారా తీసుకునే మందు మొదట రక్తంలో కలిసి చివరగా లంగ్స్‌పై ప్రభావాన్ని చూపుతాయి. ఈ మందులు రక్తంలో కలవడం వల్ల శరీరంలోని ఇతర భాగాలకు చేరిపోయి దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది.
రోగ నిరోధక శక్తితో నియంత్రణ
ఆస్తమా అనేది అలెర్జిక్ వ్యాధి. ఇది ఊపిరితిత్తులలో అలర్జీగా భావించొచ్చు. ఏదైనా అలర్జెట్ (దుమ్మూ, ధూళి, చల్లగాలి, శరీరానికి సరిపడని తినుబండారాలు, ఒత్తిడి) కారణం కావొచ్చు. దగ్గు, ఆయాసం, పిల్లికూతలు వంటివి ఆస్తమా వ్యాధి లక్షణాలు. ఆస్తమా నిర్ధారణకు పిఇఎఫ్‌ఆర్ రీడింగులు, పిఎఫ్‌టి (ఊపిరితిత్తుల బలపరీక్ష) చేస్తారు. ముఖ్యంగా ఇన్‌హీలర్స్ ద్వారా ఆస్తమా నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇన్‌హేలర్లు డైరెక్ట్‌గా ఊపిరితిత్తులపై త్వరగా ప్రభావాన్ని చూపుతాయి. తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయి. ఆస్తమాను మనం ఇన్‌హేలర్ల సహాయంతో పూర్తిగా నియంత్రించుకోవచ్చు. అలర్జీని గుర్తించి ఒత్తిడులకు దూరంగా ఉంచటం ద్వారా శరీరానికి ఇన్‌హేలర్లు అలవాటు చేయటం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 18 శాతం మందికి ఉబ్బసం (ఆస్తమా) ఉన్నట్టు అంచనా. అయితే ఉబ్బసం వ్యాధి వస్తే తగ్గదనే భయం ఒకరిదైతే.. పిల్లలు పెద్దవాళ్లయితే అదే తగ్గుతుందిలే అన్న నిర్లక్ష్యం మరొకరిది. ఇలాంటి అపోహలు అనేకం ఉన్నాయి. ఇది ఇన్‌ఫెక్షన్ కాదు. రోగనిరోధక వ్యవస్థలోని గందరగోళ పరిస్థితి వల్ల వచ్చే అలర్జీ. అయితే దీనికి జన్యుపరమైన కారణాలున్నాయి. సాధారణంగా 95 శాతం సందర్భాల్లో 'ఫ్యామిలీ హిస్టరీ' ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరిలో ఒకరికే ఆస్తమా ఉంటే, పిల్లలకు వచ్చే ఆస్కారం 25 శాతం. ఇద్దరికీ ఉంటే మాత్రం 50 శాతం మేర ప్రమాదం పొంచి ఉన్నట్టే. తొలి దశలోనే నిపుణుల్ని సంప్రదిస్తే మంచిది.
వ్యాధి లక్షణాలు ఇవే...
- ఛాతీ బిగుసుకుపోయినట్లు ఉండడం-శ్వాసలో ఇబ్బంది రావడం
- ఆయాసం రావడం
- విపరీతమైన దగ్గుతో బాధపడడం
- ఉదయం, రాత్రి వేళల్లో దగ్గు తీవ్రత పెరగడం
- విపరీతంగా గురక పెట్టడం
- ఊబకాయంతో ఇబ్బంది పడడం
- గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం రావడం

ఊపిరితిత్తులు, సుగర్‌వ్యాధి నిపుణులు
పార్వతీపురం, విజయనగరం జిల్లా,
ఫోన్ : 77999 46111










