Sep 07,2023 07:07

ఇప్పుడు నూతన సాంకేతికత వల్ల ఆదా అవుతున్న సమయం, సదుపాయాలు అందరికీ దక్కడం లేదంటే ప్రస్తుత పెట్టుబడిదారీ ఉత్పత్తి  సంబంధాలే అందుకు కారణం. ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం గల కొద్ది మంది దాన్ని అనుభవించగలుగుతున్నారు. మిగిలిన వారు పనులు కోల్పోతున్నారు. సాంకేతికత వారి పని సమయం తగ్గించకపోగా పనులు పోగొట్టి బజారులోకి నెడుతున్నది. పనుల్లో వున్నవారు కూడా ఎక్కువ గంటలు ఎక్కువ శ్రమ చేస్తూ భద్రత కోల్పోతున్నారు. ఎందుకంటే పెట్టుబడిదారులు సహజంగానే కొత్త పరికరాల కోసం వ్యయించిన మొత్తం వెనువెంటనే తిరిగి రాబట్టుకోవాలని ఆరాటపడతారు. కనుక పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాల కారణంగానే నూతన సాంకేతికత ఉద్యోగాల పెంపుదలకు దారితీయడం జరగదు.

          నూతన సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తి ప్రపంచవ్యాపితంగా ఉద్యోగాలు ఊడిపోతాయనే ఆందోళనను పెంచింది. అభివృద్ధి చెందిన దేశాలు...ఒకే తరహాలో చేసే మధ్యంతర పనులన్నిటికీ కృత్రిమ మేధస్సు (ఎ.ఐ) సహాయంతో తెలివిగా ఆలోచించగల యంత్రాలను నింపేస్తున్నాయి. ఇంటర్‌నెట్‌ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌-ఐ.ఓ.టి) కూడా ఇందుకు కారణమవుతున్నది. ఎ.ఐ, ఐ.ఓ.టి, బిగ్‌ డేటా, బ్లాక్‌ చైన్‌, 5జి, 3డి ముద్రణ, రోబోటిక్స్‌, డ్రోన్లు, జన్యు ఎడిటింగ్‌, నానో టెక్నాలజీ, సౌర పరిజ్ఞానం వంటి వాటితో నూతన విప్లవం వచ్చేస్తున్నది. ఆయా దేశాల సాంకేతిక పునాది, అన్వయించుకునే సామర్థ్యంపై ఆధారపడి వివిధ దేశాలలో ఇవి వివిధ దశల్లో వున్నాయి.
        సాంకేతిక ప్రక్రియలు ప్రకృతి క్రమాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. సాధారణంగా ఉన్న ఉత్పత్తి క్రమాన్ని తీవ్రంగా మార్పుకు లోను చేస్తాయి. తద్వారా ధరలనూ ప్రభావితం చేస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం మానవ శ్రమను తగ్గించి వేయడం ద్వారా శ్రామికులకు పని లేకుండా చేయడానికి సహజంగా ఉపయోగిస్తుంటారు. అయితే అదే సమయంలో అందుకోసం కొత్త యంత్రాలను, విడి భాగాలనూ తయారు చేయాలి. మానవులు ఆ నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. కనుక సాంకేతిక పరిజ్ఞానంపై కీలక ప్రశ్న ఒక్కటే. నికరంగా ఉపాధిపై ఎలాంటి ప్రభావం పడుతుంది? కొత్త తరం సాంకేతికత గనక సాధారణ ప్రయోజనం గలదే అయితే (ఉత్పత్తి వివిధ దశలపై ప్రభావం చూపేదే అయితే) దాని ప్రభావం మరింత విచ్ఛిన్నకరమవుతుంది. ఆ ప్రభావం పెరుగుతూ పోతుంది. నేటి సమాజంలో కొద్ది మంది సూపర్‌ ధనవంతులు మినహా ప్రతివారూ తమ శ్రమశక్తిని అమ్ముకోవడంపైనే ఆధారపడి బతికే వారు అయినప్పుడు ఈ ప్రభావం మరింత భయానకంగా తయారవుతుంది. వారు నిపుణత గలవారైనా కాకపోయినా ఉద్యోగాలు పోతాయనేది ఒకే విధంగా భయపెడుతుంది.
          మానవ శ్రమను తగ్గించడమంటే అది నిరుద్యోగానికి పర్యాయపదంగా మారుతుంది. జనాభాలో పెద్ద భాగానికి ఆదాయం లేకుండా పోతుంది. పనిలో ఉన్నవారికి కూడా తమ నిపుణతలు కొత్తగా మార్చుకోవలసి వస్తుంది. ఆ విధంగా వారు అవసరం లేని సజ్జుగా మార్చివేస్తుంది. మానవులకూ వారు సృష్టించిన వాటికీ (నిర్జీవ సజీవ శ్రమల) మధ్య ఘర్షణ మరోసారి ప్రజ్వరిల్లుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానం వెల్లువలా వచ్చేస్తున్న నేటి నేపథ్యంలో ఇది మరోసారి విజృంభిస్తున్నది.
 

                                                                         నిరంతర ప్రక్రియే ఇది

శ్రామిక శక్తితో పోలిస్తే ఉత్పాదకత నిరంతరాయంగానూ వేగంగానూ పెరగడం పెట్టుబడిదారీ వ్యవస్థలో స్వత:సిద్ధమైన ధోరణి. మరో విధంగా చెప్పాలంటే నిరుద్యోగం పెంచడం దాని లక్షణం. పనులు కోల్పోయిన ఈ నిరుద్యోగులే వేతనాలు పెరగకుండా ఒక రిజర్వు ఆర్మీగా అందుబాటులో వుంటారు. శ్రామిక ప్రక్రియకు అడ్డుకట్ట వేసే ఒక క్రమశిక్షణా శక్తిగా నిరుద్యోగం పనిచేస్తుంది. అయితే పరిశోధన, సాంకేతికత ద్వారా ఉత్పాదకత పెరుగుదల ఏ మేరకు వాస్తవ రూపం దాలుస్తుందనేది పెట్టుబడిదారీ విధానంలో ఎప్పుడూ ఒక క్రమపద్ధతిలో వుండదు. వాస్తవానికి అదొక ఆకస్మికమైనదిగా ఉన్నఫళాన జరిగిపోతుంటుంది. ప్రతి పెట్టుబడిదారుడూ కొత్త యంత్రాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టాలని చూస్తుంటాడు. ఆ నిర్ణీత పారిశ్రామిక రంగంలో సగటు లాభం రేటు కన్నా అధికంగా ప్రీమియం గడించాలనేదే తన ఆలోచనగా వుంటుంది. అదే ససాంకేతిక కౌలు. క్రమంగా ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం సగటు స్థాయికి చేరేసరికి ఉత్పత్తిదారునికి వస్తున్న అదనపు ప్రయోజనం వినిమయదారునికి బదలాయించబడుతుంది. దిగువ విభాగాల్లో సగటు రేటు తగ్గుతుంది. ఇది మళ్లీ ఒక కొత్త రకం అన్వేషణకు కారణం అవుతుంది.
           అయితే సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఉత్పాదకతలో పెరుగుదల ప్రతిసారీ నిరుద్యోగం పెరుగుదలకు దారితీస్తుందని చెప్పడానికి లేదు. కొన్ని కొత్త యంత్రాలు ఉన్న కార్మికుల తొలగింపునకు కారణం కావచ్చు. కానీ యంత్రాల ఉత్పత్తి, వాటి విడిభాగాలు మౌలిక వసతుల తయారీ, వాటి రవాణా వ్యవస్థ నూతన అవకాశాలు కూడా కల్పించవచ్చు. కనుక యంత్రాల వినియోగం వల్ల కలిగే మొత్తం ఫలితం ఎలా వుంటుందనేది ఒక రంగంలో ఉత్పాదకత పెరుగుదల, దాని గొలుసుకట్టు ప్రభావాలు కొత్త సరుకులు, సర్వీసుల కోసం అది సృష్టించే గిరాకీపై ఆధారపడి వుంటుంది. ఉత్పాదకత పెరిగే కొద్ది అన్ని స్థాయిల్లోనూ ఉత్పత్తిపై ప్రభావం పడి ధరలు తగ్గుతాయనీ నిజమైన ఆదాయాలు పెరుగుతాయనీ మామూలుగా అనుకుంటుంటారు. ఆ కారణంగా ప్రజలు ఆ వస్తువులే మరిన్ని కావాలని కోరుకుంటారనీ లేదా కొత్త తరహాలో వస్తున్న సరుకుల కోసం ఇష్టపడతారనీ వీటన్నిటివల్ల ఉద్యోగాలు పెరుగుతాయనీ అనుకుంటారు. అయితే ఈ వాదనలో కీలకమైన కొన్ని లింకులుంటాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం తగినంత స్థాయిలో అందుబాటులోకి రావాలి. దీనివల్ల కలిగే ఉత్పాదకత పెంపు నూతన సరుకుల కోసం గిరాకీ పెంచేదై వుండాలి. తద్వారా కొత్త పెట్టుబడుల రాకకు దారితీయాలి. అందువల్ల అర్థం చేసుకోవలసిందేమంటే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదకత పెరుగుదలకు దారితీసినప్పటికీ ఆ ప్రయోజనాలు కొంతమందికే లాభాలుగా ఆగిపోయేట్టయితే అప్పుడు పరిస్థితి వేరుగా వుంటుంది. అదనపు వేతనాలు జీతాల రూపంలో పంపిణీ కాకపోతే మరిన్ని సరుకులు, కొత్త సరుకుల కోసం గిరాకీ పెరగకపోవచ్చు. ఈ కొత్త యంత్రాల వల్ల ఉనికి కోల్పోయిన శ్రామిక శక్తిని ఇముడ్చుకోగలిగిన స్థాయిలో గిరాకీ పెరగకపోతే ప్రయోజనం వుండదు. శ్రమ ఉత్పాదకతకూ నిజమైన వేతనాల పెరుగుదలకు మధ్యన అంతరం పెరిగేట్టయితే అప్పుడు కొత్తగా పెరిగే విలువలో వేతనాల వాటా పడిపోవడానికి కారణమవుతుంది. ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్నదదే. దీనివల్ల గిరాకీ పెరుగుదల అవకాశం, తద్వారా ఉద్యోగాలు తగ్గిపోతాయి.
 

                                                                         ఉత్పాదకత పెరిగినా...

ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏ విభాగాల్లో ఉపయోగించబడుతున్నదనేే దానిపై కూడా ఆ ప్రభావం ఆధారపడి వుంటుంది. ఉత్పాదకత పెరుగుదల, తత్ఫలితంగా ధరల తగ్గుదల అనేది ఎల్లప్పుడూ గిరాకీలో అంతే పెరుగుదలకు దారితీయకపోవచ్చు. ఉదాహరణకు ఆహార విభాగంలో ఉత్పాదకత పెరిగి ధరలు పడిపోతే అదే నిష్పత్తిలో ఆహారానికి గిరాకీ పెరగదు. ఇతర వస్తువుల విషయం వేరే వుంటుంది. అలాగే జనాభాలో పెద్ద సంఖ్య పేదలు వుంటే ధరలు పడిపోయినా అది తప్పక గిరాకీ పెరుగుదలకు కారణం కాజాలదు. అదే విధంగా ఏ సరుకుల విషయంలోనైతే కావలసినంత అందుబాటు వుండి దాదాపు ఇక చాలనే స్థితి వచ్చిందో ఆ రంగాలలో కూడా ధరల తగ్గుదల ప్రభావం వుండదు.
అందువల్ల సాంకేతికత అభివృద్ధి గిరాకీని తద్వారా ఉద్యోగావకాశాలను ఏ మేరకు పెంచుతుందనేది వినియోగం, ప్రభావం అనే అంశాల పొందికపై ఆధారపడి వుంటుంది. శ్రామికుల వినియోగం, ఖర్చు ఎక్కువగా వుండేచోట వారి అవసరం తగ్గించే సాంకేతికత ఎక్కువ ప్రయోజనకరం. సాధారణంగా వేతనాలు ఎక్కువగా వుండే విభాగాలలో కూడా ఇది లాభదాయకం. ఎందుకంటే దానివల్ల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. కానీ ఇప్పటికే వేతనాల ఖర్చులు తక్కువగా వుండే చోట సాంకేతికతతో వ్యయం తగ్గుదల ఎప్పుడూ జరగకపోవచ్చు. కాకుంటే శ్రామికులను నియంత్రణలో వుంచుకోవడానికి మాత్రం ఉపయోగపడొచ్చు. అసలు ఉత్పత్తిదారులు కూడా ఏదో శాస్త్రీయంగా సమర్థవంతమైందనే ఒకే కారణంతో నూతన సాంకేతికతను తెచ్చిపెట్టుకోరు. పాత సాంకేతికతను మార్చి కొత్తది స్థాపించుకోవడానికి పెట్టే ఖర్చుపై వచ్చే ఆదాయం (కౌలు) చాలా చాలా ఎక్కువగా వుండేట్టయితేనే వారు కొత్త సాంకేతికతకు సిద్ధపడతారు. కనుక నూతన సాంకేతికత ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందనే దాన్నిబట్టి ఉద్యోగాలపై ప్రభావం ఆధారపడి వుంటుంది.
 

                                                                         ఉద్యోగాల పెంపు ఒట్టిదే

సాంకేతిక పరివర్తన ప్రస్తుత దశలో ఉద్యోగాల పెరుగుదలపై సానుకూల ప్రభావం పడుతుందని అంటే పెరుగుదల వుంటుందని ఆశించడం దుస్సాధ్యం. ఇందుకు కారణం కేవలం ఆ సాంకేతికత స్వభావం ఒక్కటే కాదు. అది అమలులోకి వస్తున్న సామాజిక సందర్భమే అందుకు ప్రధానంగా కారణమవుతుంది. ఉత్పాదకత పెంపు వల్ల కలిగే లాభాలు విస్త్రుతంగా పంపిణీ అయ్యే అవకాశాలు తక్కువగా వున్నాయి. నయా ఉదార విధానాల వల్ల ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగాయి. ప్రస్తుత పాలనా వ్యవస్థ యథాతథంగా కొనసాగేట్టయితే ఆ పోకడలు మారే అవకాశాలు దాదాపు శూన్యం. ప్రపంచ వ్యాపితంగా జిడిపి పెరుగుదలలో కార్మికుల వాటా వరుసగా తగ్గిపోతున్న పరిస్థితి ప్రతిబింబిస్తున్న వాస్తవం అది. ఇరవయ్యవ శతాబ్దంలో పెట్టుబడిదారీ విధానం సోషల్‌ డెమోక్రటిక్‌ సంక్షేమ పాలన తీసుకురావడం ద్వారా ఆర్థిక అసమానతలతో రాజీ పడింది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు వేతనాలు లాభాల వాటా స్థిరంగా కొనసాగింది. అంటే ఉత్పాదకతలో వచ్చిన లాభాలు కొంతవరకైనా దామాషా పద్ధతిలోనైనా పంపిణీ అయ్యాయి. కానీ నయా ఉదారవాద విధానాలు ఈ పరిస్థితిని పూర్తిగా కిందామీదు చేశాయి. రెండో విషయమేమంటే ప్రస్తుతం సాంకేతిక పరివర్తనలో వైజ్ఞానిక వనరుల వాటా పెద్దదిగా వుంటోంది.వాటిని సంప్రదాయికంగా గానీ సహజంగాగానీ పొందడం సాధ్యం కాదు. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాల సమయంలో వ్యవసాయ పనులు చేసే వారిని కొద్దిపాటి శిక్షణతో కర్మాగారాల్లో కార్మికులుగా మార్చుకోవడం సంభవించింది. అదే ఇప్పుడు చూస్తే సాంకేతికత సరిహద్దులు మహా వేగంగా మారిపోతున్నాయి. ఈ నూతన సాంకేతికపై పనిచేయాలంటే అవసరమైన పని చేసేవారు అవసరమైన విద్య నైపుణ్యాలతో మాత్రమే సాధ్యమవుతుంది. అంటే వారు సంప్రదాయ పద్ధతులలో ఈ పని చేయడం సాధ్యపడదు. ఉదాహరణకు మీ పొలం దున్నాలన్నా, విత్తనాలు నాటాలన్నా కూడా కొంత నైపుణ్యం కావలసే వుంటుంది. అయితే ఆ నైపుణ్యాలు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే తరతరాలుగా సంక్రమిస్తున్నవే. కానీ ఐసిటి, ఎ.ఐ వంటి వాటి విషయం వేరు. బాగా ఖర్చు పెట్టకుండా ఆ యంత్ర పరికరాలనూ ప్రక్రియలనూ నిర్వహించడం కుదిరే పని కాదు. విద్య, శిక్షణ అనేవి ప్రైవేటీకరణతో అంతకంతకూ సరుకులుగా మార్చివేయబడుతున్నాయంటే దానివల్ల భవిష్యత్తులో శ్రామికశక్తిగా వుండాల్సిన జనాభాలో పెద్దభాగం వాటికి దూరమవుతారు. అంతిమంగా చెప్పాలంటే సాంకేతిక పరిజ్ఞానం ప్రక్రియలు ప్రస్తుతం జరుగుతున్న పనిలో మానవ శ్రమను తగ్గించి వారికి మిగులు సమయాన్ని లేదా స్వేచ్ఛగా గడపగల సమయాన్ని పెంచేవిగా వుండాలి. కానీ ఇప్పుడు నూతన సాంకేతికత వల్ల ఆదా అవుతున్న సమయం, సదుపాయాలు అందరికీ దక్కడం లేదంటే ప్రస్తుత పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలే అందుకు కారణం. ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం గల కొద్ది మంది దాన్ని అనుభవించగలుగుతున్నారు. మిగిలిన వారు పనులు కోల్పోతున్నారు. సాంకేతికత వారి పని సమయం తగ్గించకపోగా పనులు పోగొట్టి బజారులోకి నెడుతున్నది. పనుల్లో వున్నవారు కూడా ఎక్కువ గంటలు ఎక్కువ శ్రమ చేస్తూ భద్రత కోల్పోతున్నారు. ఎందుకంటే పెట్టుబడిదారులు సహజంగానే కొత్త పరికరాల కోసం వ్యయించిన మొత్తం వెనువెంటనే తిరిగి రాబట్టుకోవాలని ఆరాటపడతారు. కనుక పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాల కారణంగానే నూతన సాంకేతికత ఉద్యోగాల పెంపుదలకు దారితీయడం జరగదు. మానవ మేథ సష్టి అయిన సాంకేతికత ఆ మానవాళి శ్రేయస్సుకే నష్టదాయకమవడం ఇక్కడ వైపరీత్యం!

సంజయ్ రాయ్