టెల్ అవీవ్ : గాజాపై ఇజ్రాయిల్ దాడికి మద్దతుగా అమెరికా తన భారీ యుద్ధ నౌకలను ఇప్పటికే మధ్యధరా సముద్ర తూర్పు తీరానికి పంపింది. ఇటువంటి చర్యలు పరిస్థితిని మరింత దిగజార్చుతాయని అరబ్ నేతలు హెచ్చరించినట్లు తెలిసింది. అమెరికానే ఈ కథంతా నడిపిస్తోందని ఇరాన్, సిరియా, లెబనాన్ మండిపడుతున్నాయి. గాజాపై ఇజ్రాయిల్ దాడులు ఆపకపోతే అంతకు రెట్టించిన పరిహారాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. దాడులను ఆపి, చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి కృషి చేయాలని ఇరాన్ కోరింది. పాలస్తీనీయుల స్వతంత్ర దేశం ఏర్పాటు ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని ప్రపంచ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఘర్షణలను మరింత రెచ్చగొట్టే చర్యలను ఆపాలని, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను గౌరవించాలని బ్లింకెన్‌కు సౌదీ అరేబియా రాజు తేల్చి చెప్పారు.
సామూహిక వలసలపై బాంబు దాడి : 70 మంది మృతి
ఆదివారం మధ్యాహ్నానికల్లా గాజాను ఖాళీ చేయాలని, లేని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఒక వైపు హుకుం జారీ చేస్తూ, మరో వైపు సామూహిక వలసలుపోతున్న గాజా వాసులపై ఇజ్రాయిల్ వైమానిక దాడులకు దిగింది. వాహనాల్లో దక్షిణ ప్రాంతానికి వెళ్తున్న వారిపై ఇజ్రాయిల్ జరిపిన బాంబు దాడిలో మహిళలు, పిల్లలతో సహా 70 మంది చనిపోయినట్లు ఎపి వార్తా సంస్థ తెలిపింది. దక్షిణ గాజాపై వైమానిక దాడులతో, ఇళ్లు ఖాళీ చేసి ఈజిప్టుకు వలసపోతున్నవారు రఫా సరిహద్దులో విశ్రాంతి తీసుకుంటుంటే వారిపైనా దాడులు జరిగాయి.
గాజాకు సాయం అందజేసేందుకు ముందుకొచ్చిన చైనా
గాజాకు అత్యవసర సాయం అందజేస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తెలిపారు. అత్యవసర మానవతా సాయాన్ని ఐక్యరాజ్య సమితి ద్వారా గాజాకు అందిస్తామని వాంగ్ యీ తెలిపారు. పాలస్తీనా సమస్య శాంతి, న్యాయం, అంతర్జాతీయ చట్టం, మనస్సాక్షితో ముడిపడి ఉందని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి ముందుకు రావాలని ఆయన కోరారు. రెస్క్యూ కమిటీ అత్యవసర సంప్రదింపులలో వాంగ్ యీ చురుకుగా పాల్గొంటున్నారు. ఇదిలావుండగా ఇజ్రాయిల్, హమాస్ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నిస్తామని రష్యా ప్రకటించింది. పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ ఊచకోత కోసే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సిస్కా అల్బనీస్ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు.
హమాస్‌ను తుడిచిపెట్టేస్తా : అత్యవసర కేబినెట్ సమావేశంలో నెతన్యాహు
గాజాను నుంచి హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తానని యూదు దురహంకారి, బెంజిమిన్ నెతన్యాహు హూంకరించారు. ఆదివారం టెల్ అవీవ్‌లో మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఆయన నిర్వహించారు. గాజాలో హమాస్‌ను తుడిచిపెట్టేస్తామని ఆయన అన్నారు. భద్రత విషయంలో దేశమంతా ఒక్కటిగా ఉందనే సందేశాన్ని దేశీయంగా, వెలుపలా చాటాల్సిన అవసరం ఉందని ఇజ్రాయిలీయులను కోరారు. గాజా వాసులు తమ నివాసాలను ఖాళీ చేసి వెళ్లిపోవడానికి అదనంగా ఇచ్చిన మూడు గంటల గడువు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటతో ముగిసింది. కేబినెట్ సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ హమాస్‌ను ఇజ్రాయిల్ నామరూపాల్లేకుండా చేస్తుందని డాంబికాలు పలికారు. మనల్ని కూలదోయాలని హమాస్ భావించింది. కానీ, దానికి భిన్నంగా మనమే హమాస్‌ను నాశనం చేయబోతున్నామంటూ జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టే యత్నం చేశారు.
రెండు విమానాల్లో 471 మంది భారతీయుల రాక
ఆపరేషన్ అజరులో భాగంగా ఇజ్రాయిల్ నుంచి 471 మంది భారతీయులు రెండు విమానాల్లో ఆదివారం న్యూఢిల్లీలోని విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి విజయ కుమార్ సింగ్ స్వాగతం పలికారు. 197 మంది ప్రయాణికులతో మూడో విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం దిగినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. 274 మంది ప్రయాణికులతో నాలుగవ విమానం ఢిల్లీ చేరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్ర, శనివారాల్లో రెండు చార్టర్డ్ విమానాల్లో 435 మంది భారతీయులు ఇజ్రాయిల్, గాజా ప్రాంతాల నుంచి వచ్చారు.