
ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పి.ఎం-జెఎవై) వంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కుంభకోణాలు ఎలా శాశ్వతమయ్యాయో కాగ్ మరింతగా బట్టబయలు చేసింది. వైద్య రికార్డుల ప్రకారం మరణించినట్లుగా కనుగొనబడిన 3,446 మంది రోగుల చికిత్స కోసం రూ.6.97 కోట్లు పంపిణీ చేసినట్లు కాగ్ కనుగొంది. పి.ఎం-జెఎవై కింద నమోదైన దాదాపు 7.5 లక్షల మంది లబ్ధిదారులు ఒకే మొబైల్ నెంబరుతో అనుసంధానమై వున్నారు. పైగా, పి.ఎం-జెఎవై అనేది కాగిత రహిత, నగదు రహిత సర్వీస్. అయినప్పటికీ ఈ పథకం కింద అనేక రాష్ట్రాల్లో, పలువురు రోగులు నగదును చెల్లిస్తున్నారు.
గత కాంగ్రెస్, యుపిఎ ప్రభుత్వాల అవినీతి పాలనకు వ్యతిరేకంగా రోజు విడిచి రోజు ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజమెత్తుతునే వుంటారు. బిజెపికి వ్యతిరేకంగా పని చేసే, పాలక ప్రాంతీయ పార్టీలకు చెందినవారి అవినీతిని లక్ష్యంగా చేసుకుంటారు.
బిజెపి ప్రభుత్వం, తాను అవినీతి రహితులమని చెప్పుకోవడానికి, అలాగే ఏ రకమైన అవినీతిని సహించబోమని (నేను తినను, నిన్ను తిననివ్వను అని) చెప్పడానికి మోడీ ప్రారంభం నుండీ ప్రయత్నిస్తూనే వున్నారు. వివిధ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంలో వున్నప్పటి రికార్డుకు ఇది పూర్తి విరుద్ధంగా వుంది.
గత తొమ్మిదేళ్ళుగా ఉన్నత స్థాయిలో జరిగిన అవినీతి కేసుల్లో ఏ అధికార దర్యాప్తు సంస్థ కూడా వాస్తవమైన దర్యాప్తు నిర్వహించకుండా చూడడం వల్లనే ఈ అవినీతి రహిత అనే అభివర్ణన కొనసాగుతోంది. ప్రతిపక్ష రాజకీయ నేతలపై, బిజెపి యేతర రాష్ట్ర ప్రభుత్వాల్లోని మంత్రులపై ఎన్‌ఫోర్స్‌్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి), సిబిఐ వంటి సంస్థలు అనేక దర్యాప్తులను ప్రారంభించాయి. ముఖ్యంగా సంజరు మిశ్రా నేతృత్వంలోని ఇ.డి, బిజెపి యేతర రాజకీయ వర్గాల్లోని వారి అవినీతిని మాత్రమే గుర్తిస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలను పరిశీలించేందుకు ఏర్పడిన వ్యవస్థ లోక్‌పాల్ ఎలాంటి అధికారాలు లేని, నిష్క్రియాపరమైన సంస్థగా మారిపోవడంతో అవినీతికి సంబంధించినంత వరకు, మోడీ ప్రభుత్వ రికార్డు కూడా పరిశుద్ధంగానే వుంచబడింది. పవిత్రమై పోయింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించడంతో 2013లో యుపిఎ ప్రభుత్వం లోక్‌పాల్, లోకాయుక్త చట్టాన్ని ఆమోదించింది. కానీ లోక్‌పాల్ సభ్యులు-ఐదుగురు జ్యుడీషియల్, నలుగురు జ్యుడీషియల్ యేతర సభ్యులను నియమించడానికి మోడీ ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టింది. 2019లో వారిని నియమించారు. అప్పటి నుండి మూడేళ్ళుగా లోక్‌పాల్ విచారిస్తున్న ఎలాంటి గణనీయమైన కేసు లేదా ఫిర్యాదుకు సంబంధించిన నివేదికే లేదు. వాస్తవానికి, లోక్‌పాల్ ఏం చేస్తోందన్నది పెద్ద మిస్టరీగానే వుంది.
ఇకపోతే, ప్రభుత్వ వ్యయంపై నిశిత పరిశీలన జరిపే రాజ్యాంగ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్‌కు సంబంధించి నంత వరకు చూసినట్లైతే, ప్రభుత్వ నిధుల్లో పెద్దఎత్తున ఏ దుర్వినియోగాన్ని వెలికి తీయకుండా కేంద్ర ప్రభుత్వంతో చక్కని సహకార స్ఫూర్తితో వ్యవహరిస్తోంది. రాఫెల్ ఒప్పందం కేసులో, కాగ్ ఒక నివేదికను ఇచ్చింది. ఫ్రెంచి కంపెనీ నుండి ఈ యుద్ధ విమానాల కొనుగోలులో నిధుల దుర్వినియోగం జరగలేదంటూ క్లీన్ చిట్‌ని ఇస్తూ నివేదిక రూపొందించింది.
అయితే, కాగ్ ఇటీవల ఇచ్చిన నివేదికలో హైవే ప్రాజెక్ట్ అయిన ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే మీద పెట్టిన ప్రభుత్వ వ్యయంలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని వెల్లడించింది. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ ఆమోదించిన వ్యయం కన్నా ఏకంగా 14 రెట్లు ఈ ప్రాజెక్టు నిర్మాణం పెరిగిందని కాగ్ వెల్లడించింది. మొదట, ఆమోదించిన వ్యయం కిలోమీటరుకు రూ.18.20 కోట్లు, కానీ అది పెరిగి, పెరిగీ దిగ్భ్రాంతి కలిగించే రీతిలో కిలోమీటరుకు ఏకంగా రూ.250.77 కోట్లకు పెరిగింది. సవివరమైన ప్రాజెక్టు నివేదిక లేదని నివేదిక ఎత్తి చూపింది. అలాగే ఇతర ప్రశ్నార్ధకమైన నిర్ణయాలను కూడా ఆ నివేదికలో వివరించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో చేపట్టిన ఇటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టే సంబంధిత కొన్ని పక్షాలకు విపరీతంగా లాభాలు చేకూర్చినట్లైతే, ఇతర హైవే ప్రాజెక్టుల్లో, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో అవినీతి ఏ స్థాయిలో నెలకొని వుంటుందో ఊహిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే.
ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పి.ఎం-జెఎవై) వంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కుంభకోణాలు ఎలా శాశ్వతమయ్యాయో కాగ్ మరింతగా బట్టబయలు చేసింది. వైద్య రికార్డుల ప్రకారం మరణించినట్లుగా కనుగొన బడిన 3,446 మంది రోగుల చికిత్స కోసం రూ.6.97 కోట్లు పంపిణీ చేసినట్లు కాగ్ కనుగొంది. పి.ఎం-జెఎవై కింద నమోదైన దాదాపు 7.5 లక్షల మంది లబ్ధిదారులు ఒకే మొబైల్ నెంబరుతో అనుసంధానమై వున్నారు. పైగా, పి.ఎం-జెఎవై అనేది కాగిత రహిత, నగదు రహిత సర్వీస్. అయినప్పటికీ ఈ పథకం కింద అనేక రాష్ట్రాల్లో, పలువురు రోగులు నగదును చెల్లిస్తున్నారు. ఆ మొత్తాలు వివిధ రకాలుగా వుంటున్నాయి. డేటా బేస్‌లో, ధృవీకరణలో వివిధ లోపాలు, లొసుగులను కూడా గుర్తించారు.
సంక్షేమ పథకాలకు చెల్లింపులను డిజిటలైజ్ చేయడం ద్వారా మధ్య దళారీలను, అవినీతిని నిర్మూలించామన్నది మోడీ ప్రభుత్వం చెబుతున్న, చేస్తున్న బడా ఆర్భాట ప్రచారాల్లో ఒకటి. అయితే, ఇటువంటి అన్ని డిజిటలైజ్ చేయబడిన పథకాలు పెద్ద ఎత్తున అవకతవకలకు వీలున్నవని పి.ఎం-జెఎవై లోని కుంభకోణాలు రుజువు చేస్తున్నాయి.
మైనారిటీ స్కాలర్‌షిప్‌ల చెల్లింపుల్లో పెద్ద కుంభకోణం జరిగిందని బయటకు వచ్చిన మరో అంశం ఈ భయాందోళనలను ధృవీకరించింది. మైనారిటీ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కింద చురుకుగా వున్నాయంటున్న దాదాపు 53 శాతం సంస్థలు బూటకమైనవని సిబిఐ దర్యాప్తులో వెల్లడైంది. 832 సంస్థల్లో అవినీతి నెలకొని, ఐదేళ్ళలో రూ.144 కోట్ల మొత్తం దుర్వినియోగం కావడానికి దారి తీసిందని పేర్కొంది. రాష్ట్రాల్లో వున్న మోసగాళ్ళే ఇటువంటి కుంభకోణాలకు, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మోడీ ప్రభుత్వం చెప్పుకోవచ్చు, అంతేకానీ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఎక్కడా ఎలాంటి అవినీతి లేదని చెప్పవచ్చు. అయితే, అవినీతిని అణచివేసే బాధ్యతలను చేపట్టాల్సిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ కర్తవ్యాన్ని చేపట్టడానికి సుముఖంగా లేవన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే తీవ్రంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం వుంది.
ఏదేమైనా, కేంద్ర స్థాయిలో అవినీతి చొరబడకుండా చుట్టూ కట్టిన రక్షణ గోడ, కాగ్ తాజా నివేదిక వల్ల స్వల్పంగా బీటలు వారింది.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)