Oct 11,2023 09:12
  • రిజ్వాన్‌, షఫీక్‌ సెంచరీలు
  • శ్రీలంకపై భారీ లక్ష్యాన్ని ఛేదించిన మాజీ ఛాంపియన్‌
  • మెండీస్‌, సమరవిక్రమ శతకాలు వృథా

హైదరాబాద్‌ : ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 344పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. లంక జట్టు 30 ఓవర్ల కేవలం 2 వికెట్ల నష్టానికి 229పరుగులు చేసి 400కు పైగా పరుగులు చేసేలా కనిపించినా ఆ తర్వాత పాక్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం, లంక జట్టు వరుసగా వికెట్లను కోల్పోవడంతో 344పరుగులకే పరిమితమైంది. కుశాల్‌ మెండీస్‌(122), సమరవిక్రమ(108) సెంచరీలకి తోడు నిస్సంక(61) అర్ధసెంచరీతో మెరిసాడు. హసన్‌ అలీకి నాలుగు, రవూఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో పాకిస్తాన్‌ ఇమామ్‌, కెప్టెన్‌ బాబర్‌ వికెట్లను త్వరగా కోల్పోయింది. ఆ తర్వాత షఫీక్‌(113), రిజ్వాన్‌(131నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో పాక్‌ జట్టు 48.2ఓవర్లలో 345పరుగులు చేసి గెలిచింది. మధుశంకకు రెండు, తీక్షణ, పథీరణకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రిజ్వాన్‌కు దక్కింది.
 

                                                ఇంగ్లండ్‌ బోణీ - బంగ్లాపై 137పరుగుల తేడాతో గెలుపు

ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ జట్టు బోణీకొట్టింది. మంగళవారం జరిగిన రెండో లీగ్‌లో ఇంగ్లండ్‌ 137పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీస్కోర్‌ను నమో దు చేసింది. మలన్‌(140) సెంచరీకి తోడు రూట్‌ (82), బెయిర్‌స్టో(52) అర్ధసెంచరీలతో మెరిసారు. ఛేదనలో బంగ్లాదేశ్‌ 48.2ఓవర్లలో 227పరుగుల కు ఆలౌటైంది. కెప్టెన్‌ లిటన్‌ దాస్‌(76), ముష్ఫికర్‌ రహీమ్‌(51) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు.
 

                                                              వన్డే ప్రపంచకప్‌లో నేడు..

భారత్‌ × ఆఫ్ఘనిస్తాన్‌
(వేదిక: ఢిల్లీ; మ.2.00గం||లకు)

22