- వైదొలిగిన మరో ఇద్దరు ఉన్నతాధికారులు
బెంగళూరు : కరోనా కాలంలో ఒక వెలుగు వెలిగిన ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంస్థకు వరుసగా ఒక్కొక్క ఉన్నతోద్యోగి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (సిబిఒ) ప్రత్యూష అగర్వాల్ సహా మరో ఇద్దరు సీనియర్ ఉద్యోగులు వైదొలిగారు. ప్రత్యూష 2022 ఫిబ్రవరిలో బైజూస్‌లో చేరారు. అంతకుముందు ఆమె జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేశారు. మరో ఇద్దరు ఉన్నతోద్యోగులు హిమాన్షు బజాజ్, ముకుట్ దీపక్‌లు సంస్థకు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను అమలు చేస్తోన్నట్లు బైజూస్ పేర్కొంది. అందులో భాగంగా నాలుగు బిజినెస్ విభాగాలను కె-10, ఎగ్జామ్ ప్రెప్ అనే రెండు భాగాలుగా మార్చినట్లు తెలిపింది. బైజూస్ ఇప్పటికే ఆర్థిక కష్టాలతో పాటు అనేక న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరోవైపు అకౌంట్స్ విషయంలోనూ అనేక అవకతవకలకు పాల్పడినట్లు పలు రిపోర్ట్‌లు వస్తోన్నాయి. కష్టాలు తీవ్రతరం కావడంతో అనేక మంది ఉద్యోగులను తొలగించింది. అదే విధంగా 2025 వరకు కొనసాగాల్సిన ఆడిట్ సంస్థ డెలాయిట్ సైతం మధ్యలోనే గుడ్‌బై చెప్పింది. మరోవైపు విదేశీ నిధులు ఉల్లంఘనలకు పాల్పడిందనే ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణ జరుపుతోంది. బైజూస్ వ్యవస్థాపకులు రవీంద్రన్, ఆయన కంపెనీ థింక్ అండ్ లెర్న్ కార్యాలయాల్లో ఫెమా చట్టం కింద గత నెలలో అధికారులు సోదాలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ స్టార్టప్ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కేసు నమోదు చేసి ఇడి దర్యాప్తు చేస్తోంది. బైజూస్ 2011 నుంచి 2023 మధ్య దాదాపు రూ.28 వేల కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులు అందుకుందని తమ తనిఖీల్లో తేలిందని ఇడి వర్గాలు పేర్కొన్నాయి. అంతర్గతంగా పాలనాపరమైన లోపాలను అధిగమించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త మోహన్‌దాస్ పారు, ఎస్‌బిఐ మాజీ ఛైర్మన్ రజినీష్ కుమార్‌తో కంపెనీ ఓ సలహా మండలిని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ సంస్థ పునర్‌వైభవం పొందడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.










