Oct 14,2023 10:07

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : అహ్మదాబాద్‌లోని క్రికెట్‌ స్టేడియాన్ని తలదన్నేలా రూ.300 కోట్లతో విశాఖపట్నంలో మరో క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మించ నున్నట్టు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు స్టేడియాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో టెస్టుల్లో వికెట్‌ కీపర్‌గా, బ్యాటర్‌గా ఇండియా తరుఫున రాణిస్తున్న విశాఖకు చెందిన కోన శ్రీకర్‌ భరత్‌ను శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో సన్మానించారు.
         ముఖ్య అతిథిగా హాజరైన అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. బిసిసిఐ నుంచి స్డేడియానికి అనుమతి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. క్రీడలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 15 వేల సచివాలయాల పరిధిలో 'ఆడుదాం-ఆంధ్ర' పేరుతో క్రీడల పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా ఐదు లక్షల క్రికెట్‌ కిట్లను క్రీడాకారులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైసిపి ఉత్తరాంధ్ర జిల్లాల కో - ఆర్డినేటర్‌ వైవి.సుబ్బారెడ్డి, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌ఆర్‌.గోపీనాథ్‌ రెడ్డి, డాక్టర్‌ ఎస్‌.ఆదినారాయణ, గ్రే హౌండ్స్‌ ఎస్‌పి విద్యాసాగర్‌ నాయుడు పాల్గొన్నారు.