Oct 17,2023 07:10

             కార్పొరేట్‌ దిగ్గజం అదానీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయల్పడుతున్నాయి. భారీ మొత్తంలో పన్నుల ఎగవేత, అక్రమ పద్ధతుల్లో కంపెనీ షేర్‌ విలువ పెంపు ఇత్యాది ఆర్థిక కుంభకోణాలకు అదానీ గ్రూపు పాల్పడిందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రకంపనలు ఉండగానే అదానీ బొగ్గు బాగోతాన్ని లండన్‌ నుంచి వెలువడుతున్న ప్రముఖ పత్రిక 'ఫైనాన్షియల్‌ టైమ్స్‌' బయట పెట్టింది. మార్కెట్‌ ధరల కంటే రెట్టింపు ధరలకు బొగ్గును దిగుమతి చేసుకున్నట్లు తప్పుడు బిల్లులు చూపించి బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారన్నది ఆ పత్రిక కథనం సారాంశం. అదానీ చేతివాటం కేవలం బొగ్గు వినియోగదారులకే పరిమితం కాలేదు. బొగ్గు ధరలు పెంచడం మూలంగా థర్మల్‌ విద్యుదుత్పత్తి వ్యయం అమాంతం పెరిగేందుకు చక్రం తిప్పారు. ఫలితంగా ఈ కాలంలో ప్రజలకు కరెంట్‌ ఛార్జీల భారం తడిసి మోపెడైంది. చిన్న పరిశ్రమలకు, వ్యాపారులకు విద్యుత్‌ ఛార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అంతేనా, డిమాండ్‌ కనగుణంగా విద్యుదుత్పత్తి జరగనీకుండా, ఉత్పత్తిలో ఎగుడు దిగుడులు, ఒడుదుడుకులకు, కృత్రిమ కొరత ఏర్పడటానికి, తద్వారా మరింతగా విద్యుత్‌ అమ్మకపు ధరలు పెరగడానికి కారణమయ్యారు. ఉత్తరోత్తరా దేశీయ విద్యుత్‌ రంగాన్ని అదానీ తన గుప్పెట్లో పెట్టుకొని శాసిస్తున్నారని అర్థమవుతుంది.
           వాస్తవానికి 'ఫైనాన్ఫియల్‌ టైమ్స్‌' కొత్తగా ఏమీ చెప్పలేదు. హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలను తన సునిసిత పరిశీలనలతో అదానీ వైట్‌ కాలర్‌ నేరాన్ని మరింత బలోపేతం కావించింది. 2019-21 మధ్య 32 మాసాలలో 30 సార్లు జరిపిన బొగ్గు దిగుమతులకు సంబంధించి కస్టమ్స్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డిఆర్‌ఐ) రిపోర్టుల్లో పేర్కొన్నట్లు గతంలో హిండెన్‌బర్గ్‌ వెల్లడించిన నివేదికలోని విషయాలు నిజమేనని 'ఫైనాన్షియల్‌ టైమ్స్‌' కథనం నిర్ధారించింది. మధ్యవర్తులను ఉపయోగించి అధిక ధరలపై బొగ్గును దిగుమతి చేసుకున్నామని చెప్పి, భారతీయ విద్యుత్‌ కంపెనీలకు అంతకంటే రెట్టింపు ధరలకు అదానీ అంటగట్టారు. కాగా ఎగుమతుల వద్ద ధరకు, దిగుమతి వద్ద ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. వాస్తవ ధర కంటే నకిలీ ఇన్వాయిస్‌లతో ధరలను పెంచేశారు. గత రెండేళ్లుగా తైవాన్‌, దుబాయి, సింగపూర్‌ దేశాలలో బ్రోకర్ల ద్వారా రూ.40 వేల కోట్ల విలువైన బొగ్గు దిగుమతికాగా, కృత్రిమంగా ధరలు పెంచినట్లు డిఆర్‌ఐ పరిశోధనలో వెల్లడించింది. బొగ్గు ధరల పెంపు స్కాంపై 2016 లోనే డిఆర్‌ఐ పలువురికి నోటీసులివ్వగా, వారిలో అదానీ గ్రూపు వారే అత్యధికంగా ఉన్నారు. ఇన్నేళ్లకు కూడా అదానీ ఆర్థిక అరాచకాలు ఆగకుంగా అప్రతిహతంగా సాగిపోతున్నాయంటే మతలబు ఎక్కడుంది ?
             దేశ ఆర్థిక వ్యవస్థను తొలిచేస్తున్న అదానీ ఉదంతాన్ని హిండెన్‌బర్గ్‌ బయటపెట్టాక కూడా, సదరు అక్రమాల నిరోధానికి కానీ, జరిగిన దోపిడీపై విచారణకు కానీ మోడీ ప్రభుత్వం ఇసుమంతైనా స్పందించపోవడాన్ని బట్టి అదానీ, మోడీ సర్కారుకు మధ్య బంధం ఎలాంటిదో అర్థమవుతుంది. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) విచారణ డిమాండ్‌ను మోడీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రత్యేక ప్యానల్‌ ఏర్పాటు చేశాక కూడా కేంద్ర ప్రభుత్వంలో చలనం రాలేదు. అదానీపై తాము చేపట్టిన దర్యాప్తును ఎందుకు మధ్యలో నిలిపివేయాల్సి వచ్చిందో కోర్టుకు సెబి నివేదిక ఇస్తేకానీ నిజం బయటకురాదు. ఇంత జరిగినా అదానీ ఆర్థిక సామ్రాజ్యానికి మోడీ ప్రభుత్వం కాపాలా కాయడం ఆపలేదు సరికదా దేశ, విదేశాల్లో, రాష్ట్రాల్లో కొత్తగా అదానీకి ప్రాజెక్టులు, కాంట్రాక్టులు దక్కేలా మోడీ సర్కారు చేయని ప్రయత్నం లేదు. మన రాష్ట్రం విషయానికే వస్తే పోర్టులు, విలువైన భూములు, కొండలు, బీచ్‌శాండ్‌, పంప్డ్‌ స్టోరేజి, సోలార్‌, సహా పలు పవర్‌ ప్రాజెక్టులు, చివరికి థర్మల్‌ కేంద్రాల్లో వెలువడే బూడిద (ఫ్లయాష్‌).. సమస్తం అదానీకే కట్టబెట్టడం వెనుక కేంద్రం ఒత్తిడి తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అదానీ, అటువంటి వారి దోపిడీ ఆగాలంటే వారికి కొమ్ముకాసే పాలన పోవాలి.