Sep 28,2023 22:20

హాంగ్జౌ: షూటింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతకం లభించింది. గురువారం జరిగిన 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ పురుషుల విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్‌, శివ నర్వాల్‌, అర్జున్‌ సింగ్‌ చీమాతో కూడిన జట్టు బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. భారత షూటర్ల త్రయం 1734.50 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. చైనా జట్టు 1733.62 పాయింట్లతో రజత పతకం సాధించింది. కాగా, ఇదే విభాగంలో సరబ్‌జ్యోత్‌ సింగ్‌, అర్జున్‌ సింగ్‌ టాప్‌-8కు అర్హత సాధించారు. సరబ్‌జ్యోత్‌ 5వ స్థానంలో, అర్జున్‌ 8వ స్థానంలో నిలిచారు.
ఈక్వెస్ట్రియన్‌లో అనుష్‌ నయా చరిత్ర
ఈక్వెస్ట్రియన్‌లో వ్యక్తిగత విభాగంలో అనూష్‌ గార్వాలా నయా చరిత్రను లిఖించాడు. వ్యక్తిగత డ్రెస్సేజ్‌ విభాగంలో అనుష్‌ గార్వాలా 73.030శాతం పాయింట్లతో కాంస్య పతకంతో సాధించి ఈ రికార్డును నెలకొల్పారు. ఆసియా క్రీడల వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ఓ పతకం దక్కడం ఇదే తొలిసారి. ఈక్వెస్ట్రియన్‌ గ్రూప్‌ విభాగంలో భారత్‌కు బంగారు పతకం లభించిన సంగతి తెలిసిందే. సుదీప్తి హజెలా, హృదరు విపుల్‌, అనూష్‌ గార్వాలా, దివ్య కృతి సింగ్‌లతో కూడిన భారత బృందం ఈక్వస్ట్రియన్‌లో డ్రస్సేజ్‌ ఈవెంట్‌ తొలి పసిడి పతకాన్ని సాధించి 41 ఏళ్ల తర్వాత మరోసారి భారత్‌కు పతకాన్ని ఖాయం చేశారు. దీంతో భారత్‌ ఆరు స్వర్ణ, 8 రజత, 10 కాంస్య పతకాలతో సహా మొత్తం 24 పతకాలతో పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.
వుషూలో రోషిబినాకు రజితం..
వుషూ 60 కేజీల విభాగంలో రోషిబినా రజత పతకం సాధించింది. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో రోషిబినా కాంస్య పతకాన్ని తొలిసారి సాధించగా.. ఈసారి అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చి రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
ఫైనల్స్‌కు సాకేత్‌ జోడి..
టెన్నిస్‌లో పురుషుల డబుల్స్‌లో భారత జోడీ సాకేత్‌ మైనేని-రామ్‌కుమార్‌ రామనాథన్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన సెమీఫైనల్లో 6-1, 6-7, 10-0 తేడాతో కొరియా జోడి సోనోన్‌వూ క్వాన్‌, సియోంచన్‌పై విజయం సాధించారు. ఇక టేబుల్‌ టెన్నిస్‌, స్క్వాష్‌లలో భారత్‌కు నిరాశ తప్పలేదు.
లీగ్‌లోనే ఛెత్రీ సేన నిష్క్రమణ..
భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. గురువారం సౌదీ అరేబియాతో జరిగిన ప్రి క్వార్టర్స్‌ పోటీలో భారత్‌ 0ా2గోల్స్‌ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలి అర్ధభాగంలో ఇరుజట్లు గోల్‌ చేయడంలో విఫలమయ్యాయి. రెండో అర్ధభాగం మర్రన్‌ 51వ ని. 57వ ని.లో రెండు గోల్స్‌ చేసి సౌదీని గెలిపించాడు.
హాకీలో గెలుపు..
హాకీలో జైత్రయాత్ర
పురుషుల హాకీజట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గురువారం జరిగిన గ్రూప్‌ాఏ మూడో మ్యాచ్‌లో భారత్‌ 4ా2గోల్స్‌ తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జపాన్‌ను చిత్తుచేసింది. తొలి అర్ధభాగం ముగిసే సరికే భారత్‌ 2ా0గోల్స్‌ ఆధిక్యతలో నిలిచింది. దీంతో గ్రూప్‌ాఏలో భారత్‌ వరుసగా మూడు విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్‌ాఎ, బిలలో టాప్‌ా2లో నిలిచిన జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు రజత పతకాన్ని సాధించింది