వ్యాధిని గుర్తిస్తే దానికి ఏ మందు వేయాలో తెలుస్తుంది. గుర్తించడానికే నిరాకరిస్తే ప్రాణం మీదకు వస్తుంది. రాష్ట్రంలో కరువు పరిస్థితి అదేవిధంగా తయారైంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వ తీరు అన్నదాతకు ప్రాణ సంకటంగా మారింది.
ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వానలు సక్రమంగా పడలేదు. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా పడే ప్రమాదముందని భారత వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఆగస్టులో వర్షాలు పడితేనే ఖరీఫ్‌లో పంటలు బాగా పండుతాయి. ఈ నెలలో వర్షాలు ముఖం చాటేశాయి. 20 రోజులు అంతకంటే ఎక్కువ చినుకుపడకుండా ఉంటే దాన్ని డ్రై స్పెల్ అంటారు. ఖరీఫ్‌కు కీలకమైన ఆగస్టు నెలలో 26 జిల్లాలకు గాను 16 జిలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని 679 మండలాలకు గాను 611 గ్రామీణ మండలాలున్నాయి. 400 మండలాల్లో డ్రై స్పెల్ ఏర్పడింది. సీజన్ ముగిసే సమయానికి 300 మండలాలకుపైగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో 86 లక్షల ఎకరాలకు గానూ దాదాపు 60 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా, వేసిన పంటలకు నష్టం జరిగింది. వర్షాలు లేక గిడసబారిపోవడమో, మాడిపోవడమో జరిగింది. కర్నూలు జిల్లాలో పత్తి, అనంతపురం జిల్లాలో వేరుశనగ బాగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల మొక్కజొన్న రెండోసారి వేయాల్సి వచ్చింది. తాగునీటికిసైతం కటకట ఏర్పడింది. సాగర్ నుంచి నీరు రాకపోడంతో మూడేళ్ల నుంచి పట్టించుకోని పట్టిసీమ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు నీరివ్వాల్సి వచ్చింది. నీరు పూర్తిస్థాయిలో అందక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ కోతలతో బోర్ల కింద పంటలూ ఎండిపోతున్నాయి. ఉత్తరాంధ్ర ఎక్కువగా వర్షాధారంపై ఆధారపడింది. సకాలంలో వర్షాలు కురవకపోతే పంటలు దెబ్బతినిపోతాయి. పెట్టిన పెట్టుబడులు అంతా వృథా అయి రైతు దివాళా తీసే పరిస్థితి. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు మెట్ట ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడం, ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు అడుగంటిపోవడం వల్ల 30 లక్షల ఎకరాలు బీడుపడ్డాయి. వరి, పత్తి సాగు బాగా తగ్గింది. వేరుశనగ పంటలు దెబ్బతినిపోతున్నాయి.
సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఏడాది వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తాయి. ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను సమాయత్తం చేస్తాయి. ఈ ఏడాది ఆగస్టు తరువాత ఉలవలు, అలసందలు, మినుములు, పెసలు, కందులు, కొర్రల విత్తనాలు రైతులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏడు జిల్లాల్లో 60 వేల క్వింటాళ్లు సేకరించాలని నిర్ణయించగా, సేకరించింది 20 వేల క్వింటాళ్లు. పంపిణీ చేసింది నాలుగు వేల క్వింటాళ్లు. ఇదీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికల తీరు.
పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ తదితర ప్రయోజనాలు రైతులకు అందాలంటే ఇ-క్రాప్‌లో నమోదు తప్పనిసరి. టెక్నికల్ సమస్యల పేరుతో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ ఏడాది కరువు ప్రాంతాల్లో 20 శాతం మాత్రమే ఇ-క్రాప్ నమోదైంది. ఇదే పద్ధతి కొనసాగితే రైతు తీవ్రంగా నష్టపోతాడు. డ్రైస్పెల్‌ను కాకుండా కేవలం ఒకటి రెండు రోజులు కురిసిన భారీ వర్షపాతాన్ని చూపి కరువును గుర్తించ నిరాకరించడం తగని పని. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై వెంటనే సమీక్షించి, కరువు మండలాలను ప్రకటించాలి. కరువును ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. వ్యవసాయ పంట రుణాలను రీషెడ్యూల్ చేసి వడ్డీలు మాఫీ చేయడం, కరువు నివారణ చర్యలు చేపట్టడం, కరువు సహాయం కోసం కేంద్రప్రభుత్వం పైనా ఒత్తిడి తీసుకురావాలి. కేంద్రప్రభుత్వం కరువు పరిశీలనా బృందాలను పంపి రైతులను ఆదుకునేందుకు తోడ్పాటునందించాలి. కానీ, కేంద్రం ఆ పని చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చొంది. ఈ రెండు ప్రభుత్వాలు అన్నదాత సహనాన్ని పరీక్షిస్తున్నాయి. రైతన్న కన్నెర్రజేస్తే ప్రభుత్వాలే తలకిందులవుతాయి. తస్మాత్ జాగ్రత్త.