Oct 15,2023 08:16
  • ముంచుకొస్తున్న ఊచకోత ముప్పు
  • నెతన్యాహు ప్రభుత్వ విధ్వంసకర దాడులపై ఐరాస ఆందోళన
  • పాలస్తీనాకు సంఘీభావంగా ప్రపంచ వ్యాపితంగా ప్రదర్శనలు

న్యూయార్క్‌ : ఇజ్రాయిల్‌ భీకర దాడులతో గాజా పరిసర ప్రాంతాల్లో ఊచకోత (మూకుమ్మడి మారణహోమం)ముప్పు పొంచివుందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. 'పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి.. తక్షణమే అంతర్జాతీయ సమాజం మేల్కొవాలి' అని పాలస్తీనా ప్రాంతాల్లో మానవ హక్కుల పరిస్థితులను అధ్యయనం చేసే ఐక్యరాజ్య సమితి ప్రత్యేక రాయబారి ఫ్రాన్సెసా అల్బనీస్‌ హెచ్చరించారు. 1950వ దశకం నాటి పరిస్థితులను తలపిస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1947-49 మధ్య కాలంలో ఏడున్నర లక్షల మందికి పైగా పాలస్తీనియన్లను తమ ఇళ్ళనుండి, భూభాగాల నుండి బలవంతంగా వెళ్లగొట్టిన నక్బా సంఘటన పునరావృతమవుతోందని ఇజ్రాయిల్‌ అధికారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఆ సమయంలోనే 1948లో ఇజ్రాయిల్‌ ఏర్పడింది. నక్సా సమయంలో మూడున్నర లక్షల మందికిపైగా పాలస్తీనియన్లు నిర్వాసితులయ్యారు. 1967లో వెస్ట్‌ బ్యాంక్‌, గాజాలను ఇజ్రాయిల్‌ ఆక్రమించడానికి ఈ సంఘటన దారి తీసింది. ఇజ్రాయిల్‌ ఇప్పటికే యుద్ధం ముసుగులో పాలస్తీనియన్ల జాతి ప్రక్షాళన చేపట్టిందని ఆమె విమర్శించారు. పూర్తిగా కాల్పుల విరమణ జరగకుండా మానవతా కారిడార్‌ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని దోహా ఇనిస్టిట్యూట్‌కి చెందిన విశ్లేషకుడు తమీర్‌ కార్‌మంట్‌ వ్యాఖ్యానించారు.
- గాజాపై శుక్రవారం, శనివారం కూడా దాడులు యథేశ్చగా కొనసాగాయి. గడచిన 24 గంటల వ్యవధిలోనే 320 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయిల్‌ దాడులకు బలైపోయినట్లు గాజా సిటీ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
            వీరిలో అత్యధికులు మహిళలు, చిన్నారులే కావడం ఆందోళనకరం. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 2500 మంది పైచిలుకు పౌరులు గాజాలో చనిపోగా, లక్షలాది మంది తమ ఇళ్లను వదిలి ఐరాస సహాయక శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. వేలాది మంది ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. గాజాలో ఏ వైపు చూసినా రక్తమోడుతున్న శరీరాలు, శిథిలమవుతున్న భవనాలే దర్శనమిస్తున్నాయి.
- ఇజ్రాయిల్‌ తక్షణమే యుద్ద నేరాలకు స్వస్తి పలకాలని, లేదంటే ఆత్మరక్షణ 'పెను భూకంపాన్ని' చవిచూడాల్సివుంటుందని ఇరాన్‌ హెచ్చరించింది.
- గాజా వీడి పాలస్తీనా వెళ్లే ప్రసక్తే లేదని హమస్‌ ఛీఫ్‌ ఇస్మాయిల్‌ హనియేహ్ ప్రకటించారు. టెలివిజన్‌లో ఆయన మాట్లాడుతూ 'మన శత్రువు అమెరికా యంత్రాంగం, మరికొన్ని యూరోపియన్‌ దేశాలతో కలిసి ఈ దాడులకు పాల్పడుతోంది. గాజా ప్రజలు తమ మాతృభూమి ఒడిలోనే ఉంటారు. ఎక్కడికీ వెళ్లబోరు. గాజా వీడే ప్రసక్తే లేదు. ఈజిప్టు కూడా వెళ్లబోం' అని స్పష్టం చేశారు.
 

                                                      మానవత్వం మంట కలుస్తోంది : ఐరాస రిలీఫ్‌ ఛీఫ్‌

ఇజ్రాయిల్‌ దాడులతో గాజాలో మానవత్వం మంట గలుస్తోందని ఐక్యరాజ్యసమితి రిలీఫ్‌ ఛీఫ్‌ మార్టిన్‌ గ్రిఫ్ఫీత్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకంటే భయానక పరిస్థితులు ఎదురౌతాయని ఆయన హెచ్చరించారు. 'నీరు లేదు, విద్యుత్‌ లేదు. ఇంధనం లేదు. ఆహార సరఫరా చాలా నెమ్మదిగా జరుగుతోంది. ఆసుపత్రుల్లో మందులు అయిపోతున్నాయి.' అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలో మానవత్వం ఇప్పటికే తీవ్ర సంక్లిష్టంగా మారిందని, ఊహించనిరీతిలో మరింతగా దిగజారిపోతోందని ఆయన హెచ్చరించారు. అటు వెస్ట్‌బ్యాంక్‌లోనూ హింస పెరిగిపోతోందని, ఇజ్రాయిల్‌, లెబనాన్‌ మధ్య కూడా ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
 

                                                           పాలస్తీనాకు సంఘీభావంగా పలు చోట్ల ప్రదర్శనలు

అమెరికా ఇతర పశ్చిమ దేశాల అండతో ఇజ్రాయిల్‌ చేస్తున్న ఊచకోత బెదిరింపులకు వ్యతిరేకంగా, చారిత్రికంగా అన్యాయానికి గురవుతూ వస్తున్న పాలస్తీనీయులకు సంఘీభావంగా ప్రపంచవ్యాపితంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎటువైపు ఉన్నా ప్రజలు మాత్రం పాలస్తీనీయుల వైపే ఉన్నారనడానికి ఈ ప్రదర్శనలు ఒక నిదర్శనం. జోర్డాన్‌లో వేలాది మంది పాలస్తీనా సరిహద్దు వద్ద సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. ఇజ్రాయిల్‌తో పూర్తి స్థాయి సాధారణ సంబంధాలను కలిగివున్న అరబ్బు దేశాల్లో జోర్డాన్‌ ఒకటి. 1949లో శాంతి ఒప్పందంపై ఇజ్రాయిల్‌తో జోర్డాన్‌ సంతకం చేసింది. ఇరాక్‌లోన తహ్రీర్‌ స్క్వేర్‌ వద్ద పాలస్తీనాకు సంఘీభావం పెద్దయెత్తున ప్రదర్శన జరిగింది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌, యెమెన్‌లోని సాదా నగరంలో వేలాది మందీ వీధుల్లోకి వచ్చి ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా నినదించారు. అరబ్బు దేశాల్లోనే కాదు అమెరికా, యూరప్‌, తదితర దేశాల్లో శాంతికాముకులైన ప్రజలు పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించారు. మానవతా సాయం కూడా పాలస్తీనాకు భారీగా తరలివస్తోంది. కానీ ఇజ్రాయిల్‌ దాడులు కొనసాగిస్తుండటంతో ఆ సాయం బాధితులకు చేరే మార్గం కనిపించడం లేదు. టర్కీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి రెండు సహాయక విమానాలు ప్రస్తుతం ఈజిప్టులోని అల్‌ అరిష్‌ విమానశ్రయంలో ఆగిపోయాయి. ఇది గాజా సరిహద్దుకు సమీపంలోనే ఉంది. ఇలాంటి విమానాలు ఇప్పటికే ఐదు వరకూ వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయాయి.
 

                                            చావనైనా చస్తాం కానీ, తలొగ్గేది లేదు: పాలస్తీనీయుల స్పష్టీకరణ

గాజాలో 10 లక్షల మందిని ఖాళీ చేయాలంటే ఇజ్రాయిల్‌ ప్రభుత్వం జారి చేస్తున్న హుకుంను పాలస్తీనా ప్రజలు ధిక్కరిస్తూ , చావనైనా చస్తాం, కానీ జాత్యహంకారుల ముందు తలొగ్గే ప్రశ్నే లేదని నినదించారు. గాజాలో శనివారం వేలాది మంది పాలస్తీనీయులు ప్రదర్శన నిర్వహించారు.