
విద్యార్థియై వచ్చి
వినమ్రంగా విద్య నేర్పమని వేడుకుంటే
నిషాదుడవు..
విప్రులెల్లనేర్చిన విద్య నీకు నేర్పకూడదని
ముఖతః ఉమ్మివేసి తిరిగి పంపించావు !
పట్టుదలనే పెట్టుబడిగా
విలువిద్యతో లోకాన్ని అబ్బురపరిచిన
ఏకలవ్యుడి బొటన వేలిని కొసరి
గురుశిష్యుల బంధాన్ని
కపటోపాయపు తాళ్లను విసరి
కొనఊపిరితో మిగిల్చావు
పాండవ మధ్యముని కోరిక
తీర్చిన కసాయి ద్రోణుడా
నువ్వింకా మా మధ్యలోనే
ఆచార్య అవార్డుతో
మా ప్రతిభల్ని గేలి చేస్తూనే
మా వేళ్ళను తుంచమని
సనాతనపు బాణాలు విసురుతున్నావు!
వేద వేదాంగ పండితుడు
మానవోత్తముడు
ఋషీశ్వరుడై తపస్సులో
తమస్సులు నిండిన
మనస్సీమల్ని వెలుగులతో
ప్రజ్వరిల్లింప చేస్తుంటే
లోకం ధర్మం తప్పిందని
శూద్రుడు వేదం చదవటం నేరమని
యజ్ఞ యాగాలు చేయటం ఘోరమని
శ్రీరాముణ్ణి వేడుకున్న పిలక జంధ్యాలు
సనాతనపు కత్తిని చేతికందించి
తలను నరకమని చెప్పిన
సద్బ్రాహ్మణ పరమ హంసలు
ఇంకా ఈ నేల మీద విద్వేషపు
ప్రకటనలు చేస్తూనే
శంభూకుల్ని చెరబడుతూ
తలలకు వెలలు ఒసుగుతున్నారు!
నీ బొడ్రాయి పండుగలో
నేను పాలు పొంగించకూడదు
నీ శివాలయం తలుపులు దాటి
గన్నేరు పూవునై అర్చన కాకూడదు
పూరీలో రథ చక్రాన్ని లాగడానికి
నా భుజాన్ని మీ భుజాలకు సాయం కూడదు
దేవుడి ముందు నన్నో అంటరాని వాణ్ని చేసి
నవ్వుకున్న మీ ధర్మం
నాకు మూతికి ముంతనిచ్చి
ముడ్డికి తాటాకు కట్టి
మెడలో గంట వేలాడదీసి.. హీన పరిచిన మీ ధర్మం
చెరువులో నీళ్లలో తెల్ల తామరై విరిసినమా మాదిగ అక్కను
చెర్నాకోలతో గొడ్డును కొట్టినట్టు కొట్టి
మా గూడేల్ని భస్మం చేసిన
కారంచేడు మీ కుల ధర్మం
చుండూరుని ఎముకల గుట్టను చేసి
మూట గట్టిన మీ కుల న్యాయమే
సనాతన ధర్మం అయితే
మీ ధర్మాన్ని ప్రశ్నించే ఉదయనిధి కంఠాలై
సింహనాదం చేస్తూనే ఉంటాం...
మీ సనాతనపు గడ్డి కొండకు
అగ్గిపుల్లను గీసి చలి కాచుకుంటాం!
- నేలపూరి రత్నాజీ
89199 98753