
న్యూఢిల్లీ : ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా అనంత్ నాథ్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన 'ది కార్‌వాన్' పత్రిక సంపాదకులుగా పనిచేస్తున్నారు. శనివారం జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో అధ్యక్ష పదవికి ఎన్నికలను నిర్వహించారు. ఎడిటర్స్ గిల్డ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనంత్ నాథ్.. సీమా ముస్తఫా స్థానంలో అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అలాగే శనివారం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా రుబెన్ బెనర్జీ (అవుట్ లుక్ పత్రిక మాజీ ప్రధాన సంపాదకులు), కోశాధికారిగా కెవి ప్రసాద్ ( ది ట్రిబ్యూన్ పత్రిక మాజీ సీనియర్ అసోసియేట్ ఎడిటర్)ను ఎన్నుకున్నారు. శ్రీరామ్ పవార్ (సకల్ మీడియా గ్రూప్ ఎడిటర్) స్థానంలో ప్రసాద్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. రాజ్‌దీప్ సర్‌దేశాయి, విజరు నాయక్, కుంకుమ్ చధలతో కూడిన ముగ్గురి సభ్యుల ఎలక్షన్ కమిటీ ఈ ఎన్నికల వివరాలను ప్రకటించింది.