డెర్నా : లిబియా జల ప్రళయంలో 11వేల మందికి పైగా మరణించిన, వేలాదిమంది ఆచూకీ గల్లంతు కావడానికి దారి తీసిన రెండు డ్యామ్‌లు కుప్పకూలిన ఘటనపై లిబియా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మధ్యధరా సముద్రంలో డేనియల్ తుపానుతో భారీ వర్షాలు కురిశాయి. ఇవి గత వారాంతంలో ఆకస్మిక వరదలకు దారి తీశాయి. ఈ వరదల్లో రెండు డ్యామ్‌లు కొట్టుకుపోయాయి. దాంతో ఒక్కసారిగా విరుచుకుపడిన నీటి ప్రవాహంతో ప్రజలు సముద్రంలోకి కొట్టుకుపోయారు. 1970ల్లో ఈ రెండు డ్యామ్‌లు కట్టారు. డ్యామ్‌ల నిర్వహణకు కేటాయించిన నిధులు, వాటిని ఖర్చు పెట్టిన తీరుపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా ఇంకా సముద్రం నుండి మృతదేహాలు కొట్టుకురావడం దురదృష్టకరమని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్‌కి చెందిన అత్యవసర విభాగం అధిపతి క్లేయిర్ నికొలెట్ వ్యాఖ్యానించారు. తమ కుటుంబాలను పోగొట్టుకున్న వారికి మానసిక మద్దతు అవసరమని, పెద్ద ఎత్తున సహాయక చర్యలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. మృతదేహాలను ఖననం చేయడం పెద్ద సవాలుగా మారిందని అన్నారు. ఈ దశలో చెలరేగే అంటువ్యాధుల పట్ల అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొట్టుకుపోయిన రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి పేలుడు పదార్ధాల పట్ల కూడా సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.