
- 60 వేల ఎకరాల అసైన్డ్ భూమి గుర్తింపు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ యోగ్యమైన అసైన్డ్ భూములను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దీపావళి నాటికి కొంతమందికైనా భూములను పంపిణీ చేయాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన క్షేత్రస్ధాయి నివేదికలను జిల్లాల కలెక్టర్లు ఇటీవలే ప్రభుత్వానికి సమర్పించారు. భూపంపిణీ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సైతం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో భూపంపిణీ ఏ తేదీల్లో చేపట్టాలనేది ఇంకా ఖరారు చేయాల్సివుంది. దీపావళి పండగ సందర్భంగా ప్రతి జిల్లాలో కొందరికైనా భూములు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 62 వేల మంది లబ్దిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. శ్రీసత్యసాయి జిల్లాలో 5276 మందికి 7476 ఎకరాలు, కృష్ణ జిల్లాలో 7336 మందికి 4800 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 3425 మందికి 4116 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 3110 మందికి 3589 ఎకరాలు, వైఎస్‌ఆర్ కడప జిల్లాలో 2343 మందికి 3500 ఎకరాలు, కాకినాడ జిల్లాలో 3627 మందికి 3 వేల ఎకరాలు, నంద్యాల జిల్లాలో 2012 మందికి 3800 ఎకరాల భూములను రెవెన్యూ యంత్రాంగం పంపిణీ చేయడానికి గుర్తించింది. భూముల లభ్యతను బట్టి అర ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు భూమిని పంపిణీ చేసేవీలుంది. అయితే విశాఖపట్టణం జిల్లాలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేనట్లు అధికార యంత్రాంగం గుర్తించినట్లు తెలిసింది. కాగా వ్యవసాయ భూమికి సంబంధించి ఇప్పటి వరకు గుర్తించిన లబ్ధిదారులు 44 వేల మందిని ఉండగా.. 48,250 ఎకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేయనున్నారు. లంక భూములకు సంబంధించి మూడు కేటగిరీలుగా ప్రభుత్వం విభజించింది. ఎ, బి కేటగిరీ భూములను 3,600 మంది లబ్ధిదారులకు 1325 ఎకరాలు, అలాగే సి కేటగిరి కింద 15,500 మంది లబ్ధిదారులకు 767.89 ఎకరాల భూములను పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరి సారిగా 2013లో పేదలకు భూముల పంపిణీ చేపట్టారు. ఆ తర్వాత భూపంపిణీ చేపట్టిన దాఖలాల్లేవు.