Sep 25,2023 07:55

             టిఎస్‌ఏ కృష్ణమూర్తి గారి తాజా నవల 'భయం లేని బతుకు' కోవిడ్‌ కాలపు భయాన్ని, బతుకుని, ఆనాటి బతుకు సూత్రాలను వివరిస్తూ సాగింది. ఈ నవలంతా ఆనాటి భయానకపు రోజులను గుర్తు చేసుకుంటూనే, కరోనా వేరియంట్ల రాక్షస మూక మళ్ళీ బలం పుంజుకుంటేనో?.. అన్న బెదురు కంటిమీద కునుకు రానీయదు, ముఖ్యంగా మరణం అంచుల వరకు ప్రయాణించి భూమ్మీద ఇంకా నూకలు మిగిల్చుకున్న వారికి.
           ఎంత చీకటి రాత్రి అయినా తెల్లవారక తప్పదు అన్నట్లు, శతాబ్దాలుగా ఎన్నో సాంక్రమిక వ్యాధులు లక్షలాది ప్రజల ప్రాణాలను కాల ప్రవాహంలో కలుపుకొని, కొట్టుకుపోయినా, వాటన్నిటిలో అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా హడలెత్తించి, ఆ వ్యాధికి, నిరోధక టీకా కనిపెట్టే వరకు రెప్ప వాల్చనీయలేదు, ఊపిరి పీల్చుకోనీయలేదు. కోవిడ్‌ 19, వారు వీరు అన్న తేడా లేక అందరినీ భయపెట్టింది.
           ఈ నవల మొత్తంలో సగం కరోనాకు సంబంధించిన పూర్తి వివరాలతో నిండి ఉంది. అప్పట్లో మాధ్యమాల్లోనూ వ్యక్తిగతంగాను అనుభవంలోకి వచ్చిన అనేక సాంకేతిక, గణాంక, రోగ సంబంధ సరికొత్త పదజాలంతో, మళ్లీ ఒకసారి గప్పున ఎగిరే ఈగలు దోమల సమూహంలా, ఆనాటి విషాదకర, భయభ్రాంతులకు గురిచేసిన ఎన్నెన్నో సంఘటనలను పూసగుచ్చినట్లు కథనం చేసి నవలీకరించారు కృష్ణమూర్తి.
          శానిటరీ సూపర్వైజర్‌గా వృత్తి విరమణ చేసినందువల్లనేమో, ఒక రచయితగా, మానవీయ విలువలు, స్నేహం, కుటుంబ సంబంధాలు - వీటి సమగ్ర మూర్తిమత్వాన్ని తన వ్యక్తిత్వంగా చేసుకొని సార్థక జీవితం గడుపుతున్న సీమ తెలుగు రచయితల్లో సీనియర్‌ మోస్ట్‌ సమర్థ రచయిత వీరు.
        సంఘటనల పరిణామక్రమం, తన బంధువులు స్నేహితులు, తెలిసిన వారి చుట్టూ పరిభ్రమించిన, విగత జీవులు లేదా బతికి బట్ట కట్టిన వారిగురించో, చదివిన పాఠకులు ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత, సామాజిక జీవితంలోకి తొంగిచూసుకొనేటట్లు చేస్తుంది ఈ నవల. కరోనా సంక్రమించినప్పటి నుంచి శ్మశాన భూమికి తరలింపబడే వరకు సాగిన ఆనాటి భీతావహ పరిస్థితులను కళ్లకు కట్టారు రచయిత. హాస్పిటల్స్‌లో బెడ్ల కొరత, ఆక్సిజన్‌ కొరత ఒక పక్కన; ప్రభుత్వం ఉదారంగా కోవిడ్‌ చికిత్సా కేంద్రాలను నెలకొల్పి సమర్ధవంతంగా నిర్వహించిన తీరును, ఆనాటి కర్ఫ్యూ వాతావరణం, గృహ నిర్బంధం, బారికేడ్లు, వీధుల్ని మూసేయడం, నిత్య అవసరాల లభ్యత, వాటిని పరిశుభ్రం చేసుకున్న తీరు, ప్రయాణ అవరోధాలు, ఆసుపత్రుల దారుణ దోపిడీ; శవాలను తాకకుండా, పూర్తిగా చూడకుండా, ముఖం చూపించి కవర్‌ జిప్‌ లాగేసి, పూడ్చివేసే లేదా దహనం చేసే సందర్భాలూ ... ఇలా ఎలాంటి అమానవీయ పరిస్థితులు నెలకొని ఉన్నవో వివరించారు. ఈ పరిస్థితి రోగులు, రోగి కుటుంబీకులు, బంధుమిత్రులు ఎలా మానసికంగా కుంగిపోయేలా, హడలెత్తిపోయేలా చేసిందో... ఆర్ధ్రంగా చిత్రీకరించారు.
             అలాంటి పరిస్థితుల్లో కూడా రచయిత కుటుంబం ఉదారంగా, సౌజన్య మనస్కతతో వ్యవహరించిన తీరు ప్రశంసనీయం. కుటుంబ కేంద్రంగానే కాక, స్నేహ బంధు వర్గంతో తన దైనందిన జీవితాన్ని ముడి వేసుకున్న కృష్ణమూర్తి గారి జీవిత డైరీలోని సజీవ స్పందన కలిగిన అక్షర వాక్య సమూహం.. ఈ నవల. జన సమూహ జ్ఞాపకశక్తి, వ్యక్తి జ్ఞాపకశక్తి, దాని ప్రభావాన్ని బట్టి త్వరగానో, ఆలస్యంగానో మరుపుకు గురిచేస్తుంది కానీ, చరిత్రలో ఒక విషాద ఘట్టాన్ని మరల పునస్సమీక్షించుకుంటే కృష్ణమూర్తి గారికి కలిగిన భావాలు, అక్షరబద్ధం చేసిన సంఘటనల సందోహం, కొద్ది సంవత్సరాల క్రితమే జరిగినదైన ఈ సంఘటనను, ఇప్పటి తరం వారందరూ ప్రత్యక్షంగా, స్వయంగా అనుభవించిన దుర్దినాలే అవి. దాదాపు ప్రతి కుటుంబంలోని ఒకరు కరోనాకు బలి కావడం, గురికావడం కానీ, దాని కోరల నుంచి బయటపడిన వారు కావడమో జరిగినదే కాబట్టి, మొత్తమ్మీద ఈ నవల పాఠకులందరినీ వారి వారి జీవితాలపై లోతుగానో తేలికగానో ప్రభావితం చేసిన తీరును గుర్తుచేస్తుంది. అదే ఈ నవలను చరిత్రలో నిలుపుతుంది.
            ఈ రకమైన కథలు, కవితలు, మరెన్నో సాహిత్య ప్రక్రియల్లో వచ్చినా.. నవలగా దీని స్థానం దీనిదే. ఆ విధంగా టీఎస్‌ఏకె రచనా కేతనం సదా రెపరెపలాడుతూనే ఉంటుంది. భవిష్యత్తులో రచయితలకు ఒక నమూనాగా నిలుస్తుంది. ప్రతి శతాబ్దంలో లేదా అర్ధ శతాబ్దానికో సంభవించే ఇలాంటి ప్రాకృతిక విపత్తుల గురించి మానవాళికి ఒక గుణపాఠం నేర్పుతుంది ఈ నవల సారాంశం. ఈ మహమ్మారికి ఎన్నో రూపాలు, కోణాలు ఉండి ఉండవచ్చు, ఖచ్చితంగా ఉంటాయి కూడా. ఇది ఒక రచయితగా కృష్ణమూర్తి గారి జీవిత నేపథ్యం నుండి, ఆయనకు కూసు విద్యైన సాహిత్య ప్రక్రియలో చేసిన అభివ్యక్తి, పాఠకులతో పంచుకున్న పునరుక్తి. పుసకం కోసం రచయితను (మొబైల్‌ నెంబర్‌ : 93472 98942) సంప్రదించొచ్చు.
 

- మల్లేశ్వరరావు ఆకుల
79818 72656