
గతంలో సోవియట్ యూనియన్ ఉన్నపుడు దానితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు. కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనే పేరుతో ప్రచ్చన్న యుద్ధం పేరుతో సాగించిన ప్రత్యక్ష ప్రచార దాడిలో భాగంగా సోషలిజం, కమ్యూనిజం వ్యతిరేకతను రెచ్చగొట్టారు. సోషలిజమే మెరుగైనది, పెట్టుబడిదారీ విధానం విఫలమైంది అనే భావన రోజురోజుకీ బలపడుతోంది. అందువలన పాతబడిన కమ్యూనిస్టు వ్యతిరేక అస్త్రాన్ని ప్రధానంగా ప్రయోగించాలని అమెరికా ప్రయత్నిస్తున్నది.
పెట్టుబడిదారీ విధానాన్నే అస్త్రంగా మార్చి అమెరికాను దెబ్బ తీసేందుకు చైనా ఎలా ప్రయత్నిస్తున్నదో చూడండి, మన పెట్టుబడులనే మన నాశనానికి వాడుతున్నది-అంటూ అమెరికాలో విశ్లేషకులు కొందరు అక్కడి పాలక వర్గాన్ని హెచ్చరించారు. ఇది ఒకరిద్దరి అభిప్రాయం అనుకుంటే పొరపాటు. అమెరికాలో పెట్టుబడిదారీ విధానం మీద తలెత్తిన ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు అక్కడి పాలకవర్గ మేధావులు ముందుకు తెచ్చిన సరికొత్త ప్రచారదాడిలో అదొక అస్త్రం. అదే విధంగా అమెరికా స్కూళ్లలో చైనా ప్రవేశించి కమ్యూనిస్టు పాఠాలు చెబుతున్నదని ఆధారంలేని ఆరోపణలతో ఒక నివేదికను విడుదల చేశారు. ఈ రెండూ అక్కడి పాలకవర్గంలో ఉన్న చైనా వ్యతిరేకత, కమ్యూనిస్టు వ్యతిరేకతను జనం మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం కనిపిస్తున్నది.
విశ్లేషకుల కథన సారం ఇలా ఉంది. ''ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి కమ్యూనిస్టు సిద్ధాంత మార్గదర్శకత్వంలో పని చేసే చైనా నుంచి ముప్పు తీవ్రం అవుతున్నది. అందువలన దానితో ఆర్థిక లావాదేవీలను పున: విశ్లేషణ చేసుకోవాల్సిన అత్యవసరం ఎప్పటి కంటే మరింత పెరిగింది. అమెరికా పెట్టుబడులతో అపార సంపదను చైనా పోగేసుకుంది. మన స్వంత పెట్టుబడిదారీ వ్యవస్థను మన వ్యతిరేక ఆయుధంగా మార్చింది. పెన్షన్ నిధులు, ఇతర మార్గాల ద్వారా దాదాపు పది కోట్ల మంది అమెరికన్లు తమకు తెలియకుండానే తమను దెబ్బతీసే ఆర్థిక ప్రత్యర్ధి చైనాలో పెట్టుబడులు పెట్టారు.ప్రపంచాధిపత్యం కోసం చూస్తున్న దాని మిలిటరీ బలపడేందుకు అవకాశం కల్పించారు. ఆర్థిక సరళీకరణను ప్రారంభించిన 1978 నుంచి చైనా ఒక పద్దతి ప్రకారం పశ్చిమ దేశాల పెట్టుబడి మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంది. చైనా కమ్యూనిస్టు పార్టీపై అమెరికా పార్లమెంటు ఏర్పాటు చేసిన సెలెక్ట్ కమిటీ ముందు సాక్ష్యమిచ్చిన పెట్టుబడి మార్కెట్ల భద్రతా కమిషనర్ రోజర్ రాబిన్సన్ మాట్లాడుతూ ''పరాకుగా ఉన్న అమెరికా చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉన్న ఐదు వేల కంపెనీల్లో లక్షల కోట్ల డాలర్లును పెట్టుబడులుగా పెట్టేందుకు సాధారణ అమెరికన్లను అనుమతించింది. ప్రపంచమంతటి నుంచి చైనా వచ్చే పెట్టుబడుల్లో అరవైశాతం డాలర్లు అమెరికా వనరుల నుంచే ఉన్నాయి గనుక అవి నిలిచిపోతే అక్కడి ఆర్థికరంగం పూర్తిగా దెబ్బతిని చైనా ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుంది. పెట్టుబడులు పెట్టినందుకు దోహదం చేసిన బ్లాక్‌రాక్ వంటి అగ్రశ్రేణి ఆస్తుల నిర్వహణ సంస్థలు ఇప్పుడు సాకులు చెబుతున్నాయి.అమెరికా పర్యావరణ, సామాజిక, పాలన ప్రమాణాలను పక్కన పెట్టి పెట్టుబడులు పెట్టాయి. ఇలాంటి కంపెనీలు వాటిని గట్టిగా పాటించి ఉంటే చైనా కంపెనీలకు పెట్టుబడులు వెళ్లేవి కాదు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ పెట్టనన్ని పెట్టుబడులను బ్లాక్‌రాక్ కంపెనీ సిఇఓ లారీ ఫింక్ ప్రవహింపచేశాడు. పెట్టుబడి సంస్థలు చైనాలో పెట్టుబడులు పెడితే సంభవించే ఆపదల గురించి పట్టించుకోకపోగా పైకి కనిపించినంత చెడ్డగా చైనా సంస్థలు లేవని యుబిఎస్ గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ వంటివి చెప్పాయి. చైనా మీద ఆధారపడితే తలెత్తే ముప్పును తొలగించుకొనేందుకు, నూతన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు జి7 దేశాల కూటమి పూనుకుంది. అంతేకాదు అమెరికా స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లలో ఉన్న చైనా కంపెనీలను జాబితా నుంచి తొలగించాలి, రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి.చైనా కంపెనీలకు రుణాలు ఇచ్చే సంస్థలను నిషేధించాలి'' అని అన్నారు. డాలర్ల రూపంలో ఇస్తున్న చైనా ప్రభుత్వ బాండ్ల మీద నిషేధం విధించాలి. గతంలో సోవియట్ ముప్పును వమ్ము చేసేందుకు అనుసరించిన ఆర్థిక పద్దతులను ఇప్పుడు చైనా మీద ప్రయోగించాలి. మనం దీర్ఘకాలంగా ప్రేక్షకుల మాదిరి ఉన్నాం, మన పెట్టుబడిదారీ వ్యవస్థను నియంత్రించేందుకు ఇది సరైన తరుణం. ''
అమెరికా గడ్డ మీద, వెలుపలా చైనా నిరంతర నిఘాను ఉపేక్షించరాదని ఆగస్టు మొదటి వారంలో జరిగిన పార్లమెంటు సెలెక్ట్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన రిపబ్లికన్ పార్టీ ఎంపీ మైక్ గాలఘర్ డిమాండ్ చేశాడు. ఇప్పుడే మేల్కొన్నామని కూడా అన్నాడు. దానిలో భాగంగా ప్రపంచమంతటా రహస్య పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసిందని ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.చైనాలో ప్రైవేటు కంపెనీలంటూ లేవు, ప్రతి ఒక్కరూ, ప్రతిదీ, ప్రతి సంస్థ సీ జిన్‌పింగ్ కోరుకున్నదాని ప్రకారమే ఉంటుందని గాలఘర్ ఆరోపించాడు.చైనాలో పెట్టుబడులపై పరిమితులను మరింతగా విస్తరించాలని జో బైడెన్‌ను గాలఘర్ కోరాడు. ఉత్తరువుల ద్వారా వాటిని వెంటనే అమల్లోకి తేవాలంటూ ఒక లేఖను కూడా రాశాడు. ప్రభుత్వ పెట్టుబడులకే పరిమితం గాకుండా ప్రైవేటు పెట్టుబడుల మీద ఆంక్షలు విధించాలని కోరాడు. చైనా మిలిటరీ కంపెనీలకు మన పెట్టుబడులు తరలటం అంటే మన నాశనానికి మనమే సహకరించినట్లు అవుతుందన్నాడు. చైనా బాండ్లు, కంపెనీల వాటాల్లో 1.1లక్షల కోట్ల డాలర్లు, ప్రైవేటు పెట్టుబడిదారులు 20 వేలకోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు. దీనిలో ఎక్కువ భాగం చైనా మిలిటరీతో సంబంధాలున్న కంపెనీలలో ఉందని ఆరోపించాడు. చైనాతో ఘర్షణకు దిగాల్సి వస్తే మనం భూమ్యాకాశాలను కదిలించాల్సి ఉంటుందని,ఎంతో వినాశకరంగా ఉంటుందని అన్నాడు.అమెరికా నిషేధిత జాబితాలో ఉంచిన చైనా కంపెనీల్లో పెట్టుబడులు ఎందుకు పెట్టారంటూ బ్లాక్‌రాక్, ఎంఎస్‌సిఐ కంపెనీలకు సెలెక్ట్ కమిటీ అడిగిన సంజాయిషీకి తాము చట్ట ప్రకారమే తమ వాణిజ్య పద్దతుల్లో భాగంగానే పెట్టుబడులు పెట్టినట్లు ఆ కంపెనీలు చెప్పాయి.
ఇలా సాగిన విశ్లేషణలు, పార్లమెంటరీ కమిటీ చైనా మీద చేసిన విచారణ అంతా అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు, రాజకీయంగా ప్రపంచంలో తింటున్న ఎదురుదెబ్బలకు కారణం చైనా అని తమ జనాన్ని నమ్మించేయత్నం తప్ప మరొకటి కాదు. గతంలో సోవియట్ యూనియన్ ఉన్నపుడు దానితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు. కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనే పేరుతో ప్రచ్చన్న యుద్ధం పేరుతో సాగించిన ప్రత్యక్ష ప్రచార దాడిలో భాగంగా సోషలిజం, కమ్యూనిజం వ్యతిరేకతను రెచ్చగొట్టారు. సోషలిజమే మెరుగైనది, పెట్టుబడిదారీ విధానం విఫలమైంది అనే భావన రోజురోజుకీ బలపడుతోంది. అందువలన పాతబడిన కమ్యూనిస్టు వ్యతిరేక అస్త్రాన్ని ప్రధానంగా ప్రయోగించాలని అమెరికా ప్రయత్నిస్తున్నది.
అమెరికా స్కూళ్లలో పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్న చైనా వాటిని కమ్యూనిస్టు ప్రచారానికి అడ్డాలుగా మారుస్తున్నదని విద్యా పరిరక్షక తలిదండ్రుల కమిటీ(పిడిఇ) పేరుతో ఉన్న సంస్థ తాజాగా ఒక నివేదికలో ఆరోపించింది. అమెరికాలో స్కూళ్లు పన్నెండవ తరగతి(మన దగ్గర ఇంటర్ మీడియెట్) వరకు బోధిస్తాయి. తమ దేశ తత్వవేత్త కన్ఫ్యూసియస్ పేరుతో వందకు పైగా కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో తరగతులను నిర్వహించేందుకు అమెరికా ప్రభుత్వ అనుమతుల మేరకే చైనా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నది. అయితే అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరించేందుకు, తమకు ఏజంట్లుగా పనిచేసే వారిని ఎంచుకొనే కేంద్రాలుగా మార్చుతున్నదంటూ ఆరోపిస్తూ ఇటీవల అమెరికా ఎఫ్‌బిఐ ఒక నివేదికను వెల్లడించింది. చైనా జాతీయ ఇంటెలిజెన్స్ చట్టంలో చైనా పౌరులు ఎక్కడ నివశిస్తున్నప్పటికీ తమ మాతృభూమి కోసం కళ్లు, చెవులుగా పని చేయాలని చెప్పిందని, అందువలన అమెరికాతో సహా విదేశాల్లో ఉన్న చైనా జాతీయులందరూ గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ గతేడాది సిఐఏ మాజీ అధికారి శామ్ ఫడీస్ ఒక తర్కాన్ని ముందుకు తెచ్చాడు. ఇదంతా తప్పుడు ప్రచారంలో భాగమే అన్నది స్పష్టం. అదే సూత్రం ప్రతి దేశ పౌరులకు వర్తిస్తుంది. అందరినీ అలాగే చూసేట్లైతే ఎవరూ వేరే దేశానికి వెళ్లే అవకాశం ఉండదు.
అలాంటి కేంద్రాలన్నీ గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు అమెరికా చేసే వాదన అవాస్తమే అయినప్పటికీ మాటవరసకు నిజమే అనుకుందాం. అలాంటప్పుడు అమెరికా సర్కార్ లేదా అక్కడి సంస్థలు మన దేశంతో సహా ప్రపంచంలో అనేక చోట్ల విద్యా సంస్థలతో సంబంధాలు, అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి, వారాలు , నెలల తరబడి మన వారిని అమెరికా ఆహ్వానిస్తున్నాయి. వాటన్నింటినీ సిఐఏ గూఢచార కేంద్రాలుగా పరిగణించాలా ?
ఎం. కోటేశ్వరరావు