
విజయవాడ: రాజ్యాధికారం కోసం కాపులంతా తరలి రావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. విజయవాడలో పర్యటించిన ఆయన.. బందరు రోడ్డులోని వంగవీటి రంగా విగ్రహానికి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగవీటి రంగా ఆత్మ క్షోభిస్తుందన్నారు.. వంగవీటి రంగా గురించి ఆలోచించిన కాపులు ఎవరూ తెలుగుదేశం పార్టీలో ఉండకూడదన్నారు. ప్యాకేజీ స్టార్ (పవన్ కల్యాణ్) కు 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు.. దీంతో, కాపులను టీడీపీకి అమ్మేశారని పేర్కొన్నారు. 2009లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కల్యాణ్.. కాపులను అమ్మేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక, రాజ్యాధికారం కోసం కాపులంతా తరలి రావాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.. 29 శాతం ఉన్న కాపులకు అధికారం రావాలని పేర్కొన్నారు. ''పవన్ కల్యాణ్ వెనుక ఉంటారా? నాతో ఉంటారా? కాపులు తెల్చుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో 30 సీట్లకు 1,500 కోట్ల రూపాయలకు పవన్ కల్యాణ్ అమ్ముడుపోయాడు అని విమర్శించారు. గుండు గీయించుకున్న కాపులు కావాలా..? గుండు గీసే కాపులు కావాలా..? తేల్చుకోవాలన్నారు. మరోవైపు.. వంగవీటి రంగాను చంపిన వారితో ఉంటారా? నాతో ఉంటారో వంగవీటి రాధా తేల్చుకోవాలని సూచించారు. కాగా, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు కేఏ పాల్.. తెలంగాణలో కొన్నిసార్లు.. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొన్నిసార్లు ప్రత్యక్షమై.. సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తుంటారు.. గతంలో మునుగోడు ఉప ఎన్నికలో బరిలోకి దిగిన ఆయన.. ఘోర పరాజయాన్ని ముఠగట్టుకున్న విషయం విదితమే. గతంలో, పవన్ కల్యాణ్ ప్రజాశాంతి పార్టీలో చేరాలని కోరిన ఆయన.. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌పై ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.