- ఐద్వా ఆల్ ఇండియా అధ్యక్షులు మాలినీ భట్టాచార్య
ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : తొలుత మల్లు స్వరాజ్యం నగర్, మైధిలీ శివరామన్ ప్రాంగణంలో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఐద్వా ఆల్ ఇండియా అధ్యక్షులు మాలినీ భట్టాచార్య జెండాను ఎగురవేశారు. అధ్యక్షవర్గంగా బి.ప్రభావతి, అలివేలు, జ్యోతి, శివకుమారి వ్యవహరిస్తున్నారు. అనంతరం జరిగిన ప్రారంభ సభలో మాలినీ భట్టాచార్య మాట్లాడుతూ పోరాటాల గడ్డ నెల్లూరులో ఐద్వా రాష్ట్ర సభ నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. నెల్లూరులో సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభమై చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. ఆనాడు జరిగిన పోరాటంలో ఎందరో మహిళలు పాల్గొని స్ఫూర్తిగా నిలిచారన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాలు పొదుపు, అక్షరాస్యతా ఉద్యమానికి నాందిపలికాయని తెలిపారు. మైక్రో ఫైనాన్స్ మోసాలకు వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున పోరాడారని అన్నారు. అంతటి ఉద్యమాలు నిర్వహించిన ఎపిలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. చిన్నపిల్లలు డ్రగ్ మాఫియా ఉచ్చులో పడి తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, దీనిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ధరల పెరుగుదలతో కుటుంబాలను నడపడానికి మహిళలు తీవ్ర పడుతున్నారని తెలిపారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ మహిళలపై అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్.పుణ్యవతి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, ఐద్వా నాయకులు స్వరూపరాణి, ఐద్వా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడారు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు పి.శివకుమారి, కార్యదర్శి మస్తాన్‌బీ తదితరులు పాల్గొన్నారు. ఐద్వా కార్యకర్తలు ఆలపించిన విప్లవ గీతాలు ఉర్రుతలూగించాయి.










