- ఆపదలో అన్నదాతను ఆదుకోవాల్సిన పథకం ఎత్తివేత
- ఎఎంసిల గోదాములు ప్రైవేటుకు లీజు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఆపద కాలంలో రైతులను ఆదుకోవాల్సిన 'రైతుబంధు' పథకం అడ్రస్ గల్లంతైంది. మార్కెట్‌లో ధరలు పతనమైన విపత్కర సందర్భాల్లో పంటలను నిల్వ పెట్టుకొని తనఖా రుణాలిచ్చే స్కీం 'రైతుబంధు'. వ్యవసాయ మార్కెటింగ్ డిపార్టుమెంట్ క్షేత్ర స్థాయిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఎఎంసి)ల ద్వారా పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. నాలుగేళ్ల నుంచి ఈ స్కీం నిలిచిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా రైతుల పంటలపై ఎఎంసిలు తనఖా రుణాలిచ్చిన దాఖలాల్లేవు. కోవిడ్ వలన రెండేళ్లపాటు మార్కెట్ సదుపాయాల్లేక రైతులు పంటలను వచ్చినకాడికి తెగనమ్ముకొని నష్టపోయారు. కోవిడ్ అనంతరం సైతం రాష్ట్రంలో ఏ పంటకూ ఏ ప్రాంతంలోనూ సరైన రేటు లేదు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) సైతం దక్కట్లేదు. ఎంఎస్‌పి లేని ఉత్పత్తులది మరీ దయనీయం. ఈ పరిస్థితుల్లో 'రైతుబంధు ఉంటే కొంత మంది రైతులకైనా కాస్తంతైనా ఉపశమనం దొరికేది. ఎఎంసిలలో పథకం ఎత్తేయడంతో ఆ మాత్రం ఆసరా సైతం అందక అన్నదాతలు ఆర్థికంగా కుదేలవుతున్నారు.
దశాబ్దాలనాటి సదుపాయం
రైతుల పంటలను తనఖా పెట్టుకొని రుణం ఇచ్చే పథకం దశాబ్దాల నుంచి ఉంది. 1980లో ప్రవేశపెట్టారు. 1995లో 'రైతుబంధు' అన్న పేరు పెట్టారు. రైతులు పంటలను మార్కెట్ యార్డులకు తీసికెళ్లినప్పుడు ధర రానిపక్షంలో అక్కడి గోదాముల్లో దాచుకోవచ్చు. అలా దాచుకున్న పంటను తనఖాగా పెట్టుకొని, పంట విలువలో ఎఎంసిలు 75 శాతం రుణం ఇస్తాయి. ఒక్కో రైతుకు గరిష్టంగా రూ.2 లక్షలు ఇస్తారు. 180 రోజులపాటు రైతు వడ్డీ చెల్లించాల్సినపని లేదు. 'అసలు' చెల్లిస్తే సరిపోతుంది. ఆపైన కూడా గోదాముల్లో దాచుకుంటే నామమాత్రపు రుసుం చెల్లించాలి. ధర లేని సమయాల్లో వ్యాపారులకు పంటలను తెగనమ్ముకోకుండా, ధర వచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటు రైతులకు లభిస్తుంది. మరోవైపు రైతుల చేతి ఖర్చులకు పైకం అందుతుంది. ఈ స్కీం రానురాను నిర్వీర్యమైపోయింది. విభజన తర్వాత 2014-2019 మధ్య ఏటా గరిష్టంగా 5,500 మంది రైతులు లబ్ధి పొందారు. రూ.40 కోట్ల వరకు రుణాలిచ్చారు. వైసిపి సర్కారొచ్చాక 2019-20 నుంచి పథకం మొత్తానికే పడకేసింది.
ఖాళీగా గిడ్డంగులు
ఎపిలోని 218 ఎఎంసిల పరిధిలో 1,069 స్వంత గోదాములున్నాయి. వాటి కెపాసిటీ 9.93 లక్షల టన్నులు. ప్రభుత్వం నిజంగా అన్నదాతలకు ధర ఇప్పించాలనుకుంటే పంటలను ఎఎంసిల గోదాముల్లో నిల్వ చేసి అప్పులివ్వొచ్చు. అకాల వర్షాలు, వరదలతో రైతులకు పంటలను దాచుకునే అవకాశం లేక నీటిపాలవుతున్నాయి. ప్రభుత్వమేమో ఉన్న రైతుబంధు పథకాన్ని ఎత్తేసింది. ఎఎంసిల గోదాములను ప్రైవేటు వ్యాపారులకు సరుకులు నిల్వ చేసుకోడానికి అద్దెకిస్తున్నారు. కొన్ని చోట్ల గృహనిర్మాణశాఖ సిమెంట్, ఇనుము, ఇతర సామగ్రిని స్టోర్ చేస్తోంది. వ్యవసాయశాఖ ఎరువులు, విత్తనాల నిల్వకు వాడుకుంటోంది. మరికొన్ని ప్రభుత్వ డిపార్టుమెంట్లు స్టోరేజి కోసం ఎఎంసి గోదాములను వినియోగిస్తున్నాయి. కొన్ని గోదాములు ఆలనాపాలనా లేక నిరుపయోగంగా పడి ఉన్నాయి. కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి.










