
కార్మికులను విచ్ఛలవిడిగా దోపిడీ చేయడానికి రెండు రకాల మోసకారి పద్ధతులను అవలంబిస్తున్నది. గంగవరం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ పేర కంపెనీ యాక్ట్ క్రింద పోర్టును రిజిస్టర్ చేశారు. కానీ ఉద్యోగ రిక్రూట్ కొరకు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ క్రింద గంగవరం పోర్టు సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో అనుబంధ సంస్థను రిజిస్టర్ చేశారు. వేతనాలన్నీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ క్రింద మాత్రమే చెల్లిస్తారు. కంపెనీ యాక్ట్‌ను అమలు చేయరు. నిర్వాసితులందరిని గంగవరం పోర్టు సర్వీసెస్ కిందే పరిగణిస్తున్నారు. మొత్తం పోర్టు క్రింద 2600 మంది కార్మికులు పనిచేస్తుంటే 1900 మంది పోర్టు సర్వీసెస్ కంపెనీ క్రిందే ఉన్నారు. ఇది చట్టవ్యతిరేకం అన్నా ఈ దోపిడీ పద్ధతినే కొనసాగిస్తున్నది.
గత నెలరోజులగా అదానీ గంగవరం పోర్టులో 516 మంది నిర్వాసిత కార్మికులు వేతనాల పెంపుకోసం, అక్రమంగా తొలగించిన వారిని విధుల్లో తీసుకోవాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో పోరాటం చేస్తున్నారు. నిర్వాసిత కార్మికులంటే గంగవరం పోర్టు నిర్మాణంలో గ్రామాలు, భూములు, జెట్టిని, మత్య్స ఉపాధిని, సముద్ర తీరంపై ఉన్న హక్కులను పోగొట్లుకున్నవారు. నష్ట పరిహారంగా 600మందికి నిర్వాసిత కోటా క్రింద పోర్టులో ఉద్యోగాలిచ్చారు. మొదట్లో 500 మందికి, ఐద్దేళ్ళ క్రితం మరో 100 మందికి పర్మినెంట్ ఉపాధి పేర ఉద్యోగాలు కల్పించారు. పేరుకే పర్మినెంట్ . వేతనాలు చూస్తే అత్యంత ఘోరం. 15 ఏళ్ళ సర్వీసు ఉన్నా యింకా రూ. 3700లే బేసిక్. మొత్తం వీరి జీతాలు చూస్తే 13వేల నుండి 18 వేల వరకు మాత్రమే. 5ఏళ్ళ క్రితం చేరిన నిర్వాసిత కార్మికులకైతే 9వేల రూపాయిలే. వేతన పెంపుపై చర్చలు ఉండవు. పేస్కేళ్ళు, మెడికల్ సౌకర్యం ఉండవు. మొత్తం అదానీ దయాదాక్షణ్యమే.
వేధింపులు, తొలగింపులు అన్నీ యిన్నీ కాదు. యూనియన్ పెట్టినందుకు అధ్యక్ష, కార్యదర్శులను ఉద్యోగాల నుండి తొలగించారు. రూ.50ల విలువ గల రెండు బోల్ట్‌లు తీసుకెళ్ళాడన్న నెపాన్ని మోపి కార్మికుడిని తొలగించారు. డ్యూటీలో నిద్రపోయారని, డ్యూటీ పాయింట్‌లో లేరని, పక్క సెక్షన్‌కి వెళ్ళాడని ఇలా ఏదో ఒక వంకతో పలువురిని తొలగించటం, సస్పెన్షన్ చేయటం, మెమోలివ్వ టం నిత్య కృత్యంగా మారాయి. ఇటీవల కార్మికులను బెదిరిస్తూ యాజమాన్యం వాట్సప్ ద్వారా పంపిన బెదిరింపు నోటీసును ప్రశ్నించినందుకు యూనియన్‌లో చురుగ్గా ఉండే కార్మికుడిని ఉద్యోగం నుండి తొలగించారు. ఇప్పుడు సమ్మెలో ఉన్న ప్రధాన నాయకులను నల్గురిని గురిని తొలగించారు.
అత్యంత క్రూరమైన స్టాండింగ్ ఆర్డ్‌ర్స్‌ను కార్మికుల పై అమలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్మిక చట్టాలన్నింటిని ఇది ధిక్కరిస్తున్నది. ఏ చిన్న పొరపాటు చేసినా, చేయకపోయినా తొలగించే విధంగా క్లాజు విధించారు. ఉదాహరణకు ఇన్‌ఛార్జీ అనుమతితో ఒకరోజు ఇద్దరు కార్మికులు డ్యూటీ షిప్ట్ మార్చుకున్నారనే కారణంతో ఉద్యోగాల నుండి తొలగించేశారు. పోర్టులో అన్నంతినేటప్పుడు కిందవేసుకొని కూర్చునేందుకు రెండు గోనె సంచులు తీసుకున్నందుకు దొంగతనం మోపి ఉద్యోగం నుండి తొలగించారు. కార్మికులను సస్పెన్షన్ చేసి 24 గంటల్లో సమాధానం యివ్వమని అడుగుతారు. కార్మికుడు ఇచ్చే సమాధానం తీసుకోరు. సమాధానం ఇవ్వలేదని ఉద్యోగం నుండి తీసేస్తున్నారు.
అంతేకాక కార్మికులను విచ్ఛలవిడిగా దోపిడీ చేయడానికి రెండు రకాల మోసకారి పద్ధతులను అవలంబిస్తున్నది. గంగవరం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ పేర కంపెనీ యాక్ట్ క్రింద పోర్టును రిజిస్టర్ చేశారు. కానీ ఉద్యోగ రిక్రూట్ కొరకు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ క్రింద గంగవరం పోర్టు సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో అనుబంధ సంస్థను రిజిస్టర్ చేశారు. వేతనాలన్నీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ క్రింద మాత్రమే చెల్లిస్తారు. కంపెనీ యాక్ట్‌ను అమలు చేయరు. నిర్వాసితులందరిని గంగవరం పోర్టు సర్వీసెస్ కిందే పరిగణిస్తున్నారు. మొత్తం పోర్టు క్రింద 2600 మంది కార్మికులు పనిచేస్తుంటే 1900 మంది పోర్టు సర్వీసెస్ కంపెనీ క్రిందే ఉన్నారు. ఇది చట్టవ్యతిరేకం అన్నా ఈ దోపిడీ పద్ధతినే కొనసాగిస్తున్నది. ఇక కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి అత్యంత ఘోరం.వీరిలో అత్యధిక మంది రోజువారి కూలీలుగా రూ. 200 నుండి 300లకు పనిచేసే వారే.
పోర్టు మొత్తం నిరంతరం పోలీసు నిఘాతో ఉంటుంది. కార్మికులను భయభ్రాంతులను చేయటానికి ఆందోళనలు, పోరాటాలు చేయకుండా నిరోధించటానికి, కార్మిక సంఘంలో ఉండకుండా చేయటానికి పోర్టు యాజమాన్యం ప్రారంభం నుండి మాజీ పోలీసు అధికారులను ఉపయోగిస్తున్నది. డిజిపి, ఐజి, డిఐజి, ఎస్పి, డిఎస్‌పి వంటి హోదాల్లో పని చేసిన అనేక మంది పోలీస్ ఉన్నతాధికారులు నేడు గంగవరం పోర్టులో పనిచేస్తున్నారు. పోర్టు చుట్టూ ఉండే పోలీసు స్టేషన్‌లన్నీ వీరి చేతుల్లోనే ఉంటాయి. కార్మికులు ఆంధోళనయత్నస్తే చేస్తే విశాఖ పోలీసులంతా క్షణాల్లో అదానీ పోర్టు వద్ద ఉంటారు. సంఘంలో చురుగ్గా ఉంటే ఇళ్ళకెళ్ళి బెదిరిస్తారు. వారి ఇళ్ళ వద్ద నిఘా పెడతారు. తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు. ఇన్ని విధాలుగా కార్మికులను అదానీ యాజమాన్యం వేధిస్తున్నది.
చట్టాలను, ఉన్నతాధికారులను ఏ ఒక్కరిని ఆదానీ యాజమాన్యం లెక్కచేయడంలేదు. కార్మికశాఖను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుంది. నిర్వాసిత కార్మికుల సమస్యలపై కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి జీతాలుపెంచాలని ఆదేశిస్తే దానిని పెడచెవిన పెట్టారు.స్థానక ఎంఎల్‌ఎ, పరిశ్రమల మంత్రి చేతులెత్తేశారు.వైసిపి పెద్దలైన వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి గార్లని కలిసి విన్నవిస్తే మేమేం చేయలేం ముఖ్యమంత్రి అదానీ తో మాట్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళినా అదానీని ఒక్కమాట కూడ అనే సాహసం చేయలేకపోతున్నారు. అడుగడుగునా ఈ పార్టీలు అదానీకి లొంగుబాటు ప్రదర్శిస్తూ కార్మికులకు హాని చేస్తూ అదానీ ఎడల తమ ప్రభుభక్తిని చూపుతున్నాయి.
లాభాలు చూస్తే భారీగా ఉన్నాయి. అతితక్కువ కాలంలోనే 30 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ స్థాయికి గంగవరం పోర్టు ఎగబాకింది. 3 బెర్త్‌లతో ప్రారంభించి నేడు 10 బెర్త్‌లతో 64 మిలియన్ టన్నుల సామర్థ్యానికి విస్తరించింది. 2021-22లో రూ.1206 కోట్ల టర్నొవర్ సాధించింది. రూ.796 కోట్లు మార్జిన్ లాభాలతో రూ.640 కోట్ల నికర లాభాలు ఆర్జించింది. మొత్తం టర్నొవర్‌లో కార్మికుల జీతాలకు చెల్లించింది మాత్రం కేవలం 6శాతంలోపే. ఎంత తీవ్రస్థాయిలో కార్మికులను అదానీ దోపిడి చేస్తున్నారో ఈలెక్కలు తెలియజేస్తున్నాయి. ఇవి కూడ యాజమాన్యం ప్రకటించినవి మాత్రమే.
గంగవరం పోర్టును విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ నిర్మించి ఉన్నట్లయితే నేడు ఈ దుస్థితి ఉండేదే కాదు. మంచి వేతనాలతో కూడిన ఉపాధి వచ్చేది. కార్గోహ్యాండ్లింగ్ పెరిగే కొద్ది శాశ్విత ఉద్యోగాలు కూడా పెరిగేవి. గాజువాక మరింత అభివృద్ధి అయ్యేది. పోర్టు వల్ల స్టీల్‌ప్లాంట్ ఏడాదికి అదనంగా రూ.500కోట్లకు పైగా లాభాలు అర్జించేది.
కానీ మొదటి నుండి స్టీల్‌ప్లాంట్ కు పాలకులు ద్రోహం చేస్తూనే వస్తున్నారు. గంగవరం పోర్టును స్టీల్‌ప్లాంట్ సొంత నిధులతో శాటిలైట్ పోర్టును నిర్మిస్తామని ఆనాటి తెలుగుదేశం, కేంద్రంతోని బిజెపి ప్రభుత్వం అనుమతి కోరింది. గంగవరం పోర్టును స్టీల్‌ప్లాంట్ నిర్మించటం ద్వారా ఎగుమతులకు ఇబ్బందిలేకుండా ఉంటుందని, ప్లాంట్ విస్తరణకి ఎంతో దోహదపడుతుందని తద్వారా వందలకోట్లు ఆదాయం మిగులుతుందని తెలియజేసింది. అయితే ఆనాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అంగీకరించలేదు. విశాఖపట్నం పోర్టు ట్రస్టు గంగవరం పోర్టును తామే నిర్మిస్తానని ప్రభుత్వాలను కోరింది.ఈ ప్రతిపాదనను కూడా తిరస్కరించారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వమైనా సొంత నిధులతో పోర్టును నిర్మిస్తే ఉపయోగం ఉంటుందని అనేక మంది మేధవులు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సూచించారు. దీనిని పెడచెవి పెట్టారు.
చివరికి డివిఎస్ రాజు అనే ఆయనకు గంగవరం పోర్టును కట్టబెట్టారు. ఈయన సత్యం కంప్యూటర్స్ అధినేత భారీ కుంభకోణానికి పాల్పడిన సత్యం రామలింగరాజు బావ. ఈయన కూడా ఈకుంభకోణంలో పాత్రధారే. అమెరికాలో జరిగిన ఒక కుట్ర కేసులో కొంతకాలం ముద్దాయిగా ఉన్నాడు.
దేశంలో పోర్టు రంగంలో గుత్తాదిపత్యం సాధించాలనేది అదానీ పథకం. అందులో భాగంగా కేంద్ర బిజెపి ప్రభుత్వ అండతో దేశంలోని ప్రభుత్వ పోర్టులతో పాటు ప్రైవేట్ ప్రాంతీయ పోర్టులన్నింటిని తన వశం చేసుకోవటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతీయ పెట్టుబడి దార్ల అధీనంలో వున్న గంగవరం, కష్ణపట్నం పోర్టులను సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలను ఉపయోగించి బలవంతంగా తన వశం చేసుకున్నారు. ప్రైవేట్ రంగంలో గుజరాత్‌లోని అదానీ ముంద్ర పోర్టు తరువాత అతి పెద్ద పోర్టులు గంగవరం, కష్ణపట్నం పోర్టులు. ఈ రెండు పోర్టులు స్వాధీనం చేసుకోకుండా అదానీ దక్షిణ కోస్తా రాష్ట్రాల సముద్ర వ్యాపారంలో తన ఆధిపత్యాన్ని చెలాయించడం కష్టం. గంగవరం పోర్టును స్వాధీనం చేసుకోవటం ద్వారా విశాఖ పోర్టుపై ఆధిపత్యం చెలాయించడం తో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా కబలిం చొచ్చనేది అదానీ కుట్ర. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా లొంగదిసుకొని గంగవరం పోర్టులో రాష్ట్రానికి వున్న 10.4 శాతం వాటాను కూడా లాగేసు కున్నారు.
ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అస్థిర పాల్జేసే కుట్రలకు మోడీ - అదానీ ద్వయం తెరలేపారు. ప్లాంట్‌కు ఉత్పత్తి కి తీవ్ర ఆటంకాలు సష్టించి దివాలా తీయించే చర్యలకు ఒడిగట్టారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పూర్తిగా అమ్మేయాలని గత రెండున్నరేళ్లగా మోడీ సాగిస్తున్న ప్రయత్నాలు ఉక్కు పరిరక్షణ ఉద్యమం వల్ల ముందుకెళ్లడం లేదు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దొంగ దెబ్బ తీయటానికి పూనుకున్నారు. గత కొన్ని రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ విదేశాలనుండి ఓడల ద్వారా దిగుమతి చేసుకునే బొగ్గును చార్జీల బకాయిల పేర దిగుమతి చేయకుండా తీవ్ర ఆటంకాలు సష్టిస్తున్నారు. మరో రెండేళ్లు పాటు అమల్లో వున్న ఒప్పందాన్ని కూడా ఖాతరు చేయడం లేదు. గంగవరం పోర్టు లో దిగుమతి అయిన బొగ్గును కూడా స్టీల్ ప్లాంట్ లోకి కన్వేయర్ బెల్ట్ ద్వారా సరఫరా కాకుండా ఉత్పత్తిని దెబ్బతీస్తున్నారు. స్టీల్ ఉత్పత్తిలో బొగ్గు చాలా ముఖ్యమైన ముడి పదార్థం. మోడీ - అదానీ కుట్రల వల్ల స్టీల్ ప్లాంట్ నేడు ముడి సరుకు, ఉత్పత్తి సమస్యలతోపాటు తీవ్ర ప్రమాధకర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. విశాఖ పోర్టు కార్గొను కూడా దౌర్జన్యంగా లాగేసుకుంటూ పోర్టుకి నష్టం చేస్తున్నది. గత అనేక ఏళ్ళుగా ఇండియాన్ ఆయిల్ కార్పొరేషన్‌తో విశాఖపట్నం పోర్టు ఒప్పందం చేసుకొని లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి)ను దిగుమతి చేస్తున్నది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వారా ఐఓసి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్రమంగా ఈ కార్గోను అదానీ తన పొర్టుకి మళ్లించుకున్నాడు. ఈవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను, సహజ వనరులను , ఖనిజ సంపదను, కార్మిక శ్రమశక్తిని కార్పొరేట్ శక్తులు కొల్లగొడుతూ అపర కుబేర సంస్థలుగా మారుతున్నాయి. ప్రజల ఆర్థిక స్థితిన్ని దేశాభివృద్ధిన్ని చావుదెబ్బతీస్తున్నాయి. ఈకార్పొరేట్ శక్తులకు, వాటితో మిలాఖత్ అయిన పాలక పార్టీల నుండి దేశాన్ని విముక్తి చేస్తేనే దేశానికి, ప్రజలకు భవిష్యత్ ఉంటుంది.
/ వ్యాసకర్త సెల్ : 9490098792 /
డా|| బి.గంగారావు