Sep 09,2023 22:10

కొలంబో: ఆసియా కప్‌ సూపర్‌4లో ఆతిథ్య శ్రీలంక జట్టుకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. బంగ్లాదేశ్‌పై శనివారం తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 257పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన బంగ్లా కెప్టెన్‌ షకిబుల్‌ హసన్‌ ఫీల్డింగ్‌ తీసుకున్నాడు. దాంతో మొదటి ఐదు ఓవర్లలో లంక ఓపెనర్లు దిముత్‌ కరుణరత్నే(18), పథుమ్‌ నిస్సంక(40) ధాటిగా ఆడారు. అయితే.. మహమూద్‌ ఓవర్లో హ్యాట్రిక్‌ బౌండరీలు కొట్టబోయి కరుణరత్నే తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మెండిస్‌, సమరవిక్రమ ధాటిగా ఆడి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. కీలకమైన ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ దసున్‌ శనక(24), చరిత అసలంక(10), ధనంజయ డిసిల్వా(6) ఒకరి వెంట మరొకరు పెవీలియన్‌కు చేరారు. ఆ తర్వాత కుశాల్‌ మెండీస్‌(50), సమరవిక్రమ (93) అర్ధ శతకాలతో రాణించారు. సెంచరీకి చేరువగా వచ్చిన సమరవిక్రమ చివరి ఓవర్లో వరుసగా ఫోర్‌, సిక్స్‌ కొట్టాడు. ఆఖరి బంతికి భారీ షాట్‌ ఆడి హొసేన్‌ చేతికి చిక్కాడు. బంగ్లా బౌలర్లలో హసన్‌ మహమూద్‌కు మూడు, తస్కిన్‌కు మూడేసి, షోరిఫుల్‌ ఇస్లామ్‌కు రెండు వికెట్లు దక్కాయి.