కళల కాణాచి తెనాలి, వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సంయుక్త నిర్వహణలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మూడవ పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల పోటీలు 2023ః ఈనెల 20 నుంచి 24 వరకూ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుర్రా సుబ్రమణ్య శాస్త్రి, ఏఆర్ కృష్ణ రంగస్థలం పురస్కార ప్రదానం కూడా జరుగుతుంది. 20వ తేదీ సాయంత్రం వీణా అవార్డుల ప్రారంభోత్సవ సభలో ఏఆర్ కృష్ణ జాతీయ రంగస్థలం పురస్కార ప్రదానంబీ ఈసారి ప్రదర్శిస్తున్న నాటికల సంపుటి విపంచి 2023 ఆవిష్కరణ కూడా జరిగాయి. వక్తలు ఏఆర్ కృష్ణ గారి నాటక రంగ సేవలు గుర్తు చేసుకుని నివాళులర్పించారు. పురస్కార గ్రహీత నెమలికంటి తారక రామారావు తనకు కృష్ణ గారితో గల జ్ఞాపకాలను పంచుకున్నారు. కృష్ణ గారి పెద్ద కుమారుడు ఏపీ నీలం కూడా పాల్గొని తన తండ్రి గారి నాటక రంగ నిబద్ధత గురించి మాట్లాడారు. నాటక రంగ ప్రయోజనాలు, శ్రేయస్సు కోసం ఎంతటి స్థాయిలో ఉన్న వారితోనైనా తన అభిప్రాయాన్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడేవారని, తన వద్ద శిక్షణ పొందిన యువ పేద కళాకారులను తర్ఫీదు సమయాన కోపంతో దండించినా, వారి భుక్తి విషయమై శ్రద్ధ పెట్టే వారిని గుర్తు చేసుకున్నారు.
ఏఆర్ కృష్ణ గారి పూర్తి పేరు అడుసుమల్లి రాధాకృష్ణ శాస్త్రి. తెనాలి దగ్గర పెరవలి గ్రామంలో 13 నవంబర్ 1926న జన్మించారు. ఏపీ విద్యుత్ శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. 1952లో గాలి చేపలు ఉత్తమ కథా రచయితగా, దేశం కోసం ఉత్తమ నాటక రచయితగా బహుమతులు పొందారు. ఇండియన్ నేషనల్ థియేటర్, ఏపీ నాట్య సంఘం, భారతీయ నాట్య సంఘం వంటి సంస్థలకు సారథ్యం వహించారు. 1956 నుంచి నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా కార్యక్రమాలను నిర్వహించేవారు. 1962 నుంచి 1972 వరకు నాట్య శిక్షణ విద్యాలయం నిర్వహించారు. ఆంధ్రా, ఉస్మానియా, బరోడా విశ్వవిద్యాలయాలకు ఎగ్జామినర్ గాను, బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ గాను పనిచేశారు.
1960లో థియేటర్ ఆర్ట్స్ చదవడానికి బ్రిటిష్ డ్రామా లీగ్, లండన్‌కు వెళ్లారు. 1962-63 సంవత్సరానికి యూఎస్‌ఏ యంగ్ థియేటర్ డైరెక్టర్‌గా ఫోర్డ్ ఫౌండేషన్ వారి స్కాలర్షిప్‌పై ఆరు నెలలు పని చేసి వచ్చారు. అక్కడ అన్ని రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లను సందర్శించారు. ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్నికై, ప్రతి సంవత్సరం పారిస్‌లో జరిగే సమావేశాలకు వెళ్లి వచ్చేవారు. తోలు బొమ్మలాట బృందాలను ఫ్రాన్స్, ఇతర దేశాలకు తీసుకువెళ్లేవారు. థియేటర్ కాన్ఫరెన్స్‌ల కోసం 20 సార్లకు పైబడి విదేశీ పర్యటన చేశారు.
నటుడిగా- వీలునామా నాటకంలో ధర్మారావుగా, కన్యాశుల్కంలో రామప్ప పంతులుగా, మృచ్ఛకటికంలో చారుదత్తుడిగా, ప్రతాపరుద్రీయంలో ప్రతాపరుద్రుడు, చాకలి పేరిగాడుగా నటించారు. రచయితగా- నిచ్చెనలు, అరగంటలో అదృష్టం, దేశం కోసం, దాగని సత్యం, ఆదర్శమూర్తి, అబ్బాయీ.. నీ ఖరీదు ఎంత? వీధి, వీర భోజ వసుంధర మొదలైన రచనలు చేశారు. మహా మంత్రి మాదన్న, సంరక్షకుడు అనువాద నాటకాలు రచించి నటించారు. మృణాల్ సేన్ ఒక ఊరి కథ, శ్యామ్ బెనగల్ అనుగ్రహం సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. దర్శకుడు, ప్రయోక్తగా రావిశాస్త్రి గారి నిజం, అధికారి, వీలునామా, ఇంకా జీవీ కృష్ణారావు గారి కీలుబొమ్మలు సంరక్షకుడు, పెద్ద మనుషులు ఆదర్శమూర్తి మొదలైన నాటకాలను ప్రదర్శించారు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లిని జీవనాటకంగా తయారు చేశారు. హైదరాబాద్‌లో 12 వేదికలపై, కనీసం నూరు ప్రదేశాల్లో అలాంటి ప్రదర్శనలు కావించారు. నాట్య బృందం గోరా శాస్త్రి గారి ఆశ ఖరీదు అణా, మా నాన్న కావాలి, శాకుంతలం మొదలైన ప్రదర్శనలు ఇవ్వగా, కృష్ణ రాయబారం, సతీదాన శూరం యక్షగాన వీధిగా నాటకాల పద్ధతిలో ప్రదర్శించారు.
1969 నవంబరు ఒకటో తేదీన నాటక కళాకారుల ఊరేగింపులో అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారితో కలిసి నాటక ప్రదర్శనకు నడిపించుకుని తీసుకువచ్చారు. నాటక ప్రదర్శనలకు వినోద పన్నును రద్దు చేయించారు. 1970లో రంగస్థలం- ఒకటి, రెండు భాగాలు పాఠ్య పుస్తకంగా తెలుగు అకాడమీ ప్రచురించింది. ఆయన రచన, సంపాదకత్వంలో ఇది జరిగింది. 1980 జూలై 6న శ్రీ కళానికేతన్ హైదరాబాదు వారు బంగారు పతకం, నగదుతో సత్కరించారు. 1981 ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సలహాదారుగా, ఆంధ్రప్రదేశ్ థియేటర్ అండ్ రిపర్టరీకి కులపతి గాను పనిచేశారు. 1992లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 1992 నవంబరు 10న ఏఆర్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. 1993లో ఏఆర్ క్రిష్ణ మెమోరియల్ ట్రస్టు ఏర్పాటైంది. దర్శకులకు దర్శకుడు ఏఆర్ కృష్ణ. డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్ అనే ఈ మూడు ముఖాలుగా, ప్రమాణాలతో ఆయన కృషి చేశారు.
ఈ సంవత్సరం ఏఆర్ కృష్ణ రంగస్థల అవార్డు గ్రహీత నెమలికంటి తారక రామారావు... అమరావతి మండలంలోని నెమలికల్లులో ఆగస్టు 7, 1939లో పుట్టారు. ఎం.ఏబీ బిఇడి చదివారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి పీజీ డిప్లమో ఇన్ యాక్టింగ్‌లో, ఎన్సీఈఆర్టీ న్యూఢిల్లీ వారి ఎడ్యుకేషనల్ టెక్నాలజీలో శిక్షణ పొందారు. డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో సహాయ సంచాలకుడిగా ఉద్యోగ విరమణ చేశారు. వందకు పైగా కథలు రాశారు. చివరకు మిగలనిది, అర్ధానుస్వారం పేరిట కథా సంపుటాలు వెలువరించారు. ఆంతర్యాలు- అనుబంధాలు, కన్నె మనసులు అనే నవలలు ప్రచురించారు. బకాసుర, జనమేజయం, క్షమాయ ధరిత్రి వంటి పలు ప్రయోగాత్మక నాటకాలు రాసి ప్రదర్శించారు. ఆయన రాసిన వరుడు కావాలి నాటిక ఆ రోజుల్లో చాలా కళాశాలల్లో ప్రదర్శితమై, ఒక ట్రెండీ ప్లేగా పేరొందింది. శరణం గచ్ఛామి నాటకం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా ప్రదర్శితమైంది. శ్రీ కళానికేతన్ సంస్థను స్థాపించి ఆ సంస్థ తరఫున నాటక నాటికలను ప్రదర్శిస్తున్నారు.
- మల్లేశ్వర రావు ఆకుల, 79818 72655