భారత్ ఇన్నింగ్స్ పూర్తవగానే లోడ్ షెడ్డింగ్ అయింది. ఇక కరెంటు లేదు. మ్యాచ్ స్కోరు తెలియక రాత్రంతా ఉస్సూరుమని గడిపాను. తెల్లారగానే, మా వాడలోని ఆఖరు ఇంటికి లగెత్తాను. ఆ ఇంటాయన రేడియో వినేవాడు. భారత్ గెలిచిందనీ, అజహర్ పరుగులు సాధించాడనీ విన్నాక కన్నీళ్లు వచ్చాయి. కానీ ఆనాటి ఆ బస్సు ప్రయాణం నా లోకాన్నే మార్చేసింది. అనేక వైవిధ్యాలున్న ఈ భారతదేశంలో క్రికెట్ దేవుడు అధిక సంఖ్యాకుల దేవుడే అనీ, నాలాంటి భక్తురాలు తన భక్తిని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటూ అలిసిపోవలసిందేననీ క్రికెట్ పిచ్చి ఉన్న నాకు మెల్లమెల్లగా అర్ధమైంది.
అది 1999 సంవత్సరం జూన్ నెల. బలవంతంగా సైకిలేసుకుని జోర్ పాక్రీ చేరుకుని, ఆ రోజుకి మొదటిదీ, ఆఖరుదీ ఐన ఆ బస్సెక్కాను. ఆ రోజు బడికి వెళ్లాలనిపించలేదు. కానీ ఇంటి వాళ్ళ ఒత్తిడి వల్ల బయల్దేరాను. ఆ రోజు ప్రపంచ కప్ మ్యాచ్. అదీనూ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. తొమ్మిది ఐదుకి బస్సు కదిలింది. బస్సు కదలగానే రోజువారీ సంభాషణ మొదలైంది. ఆ రోజుల్లో ఎవరి దగ్గరా మొబైళ్ళు గానీ, హెడ్‌ఫోన్‌లు గానీ ఉండేవి కావు. అందుకే రోజువారీ బస్సు ప్రయాణం ప్రయాణీకుల రకరకాల సంభాషణలతో బిజీగా సాగేది. ఒకే ఒక్క బస్సు కనుక రద్దీగా ఉండేది. రోజూ ఎవరి ఒడిలోనో కూర్చోని ప్రయాణించాల్సిందే. కానీ ఆ రోజు మాత్రం సీటులో కూర్చునే భాగ్యం దొరికింది. ఒకటోది వరల్డ్ కప్, ఆపై హై ఓల్టేజీ మ్యాచ్ కావడంతో క్రికెట్‌తోనే ఆ రోజు చర్చ మొదలైంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనే చర్చ జరుగుతోంది. ''ఈ రోజు పాకిస్తాన్‌తో ఆట! అజహర్ (అప్పటి భారత క్రికెట్ జట్టు కెప్టెన్) కావాలనే ఓడిపోతాడు'' కామెంట్ చేసింది ఓ పెద్దమ్మ. నా వైపు తిరిగి, ''ఏం చిట్టెమ్మా, నువ్వు ఈ రోజు పాకిస్తాన్ సపోర్టరువి కదా?'' అంది.
అది విన్నాక అలా కాసేపు ఆమెను తదేకంగా చూస్తుండిపోయాను. షేన్ వార్న్ బౌలింగ్ చేసేటప్పుడు వికెట్ పడకుండా వుండాలని మూఢనమ్మకంతో, తలుపు దగ్గర ఓ రకపు భంగిమలో నిలబడి ఉండేదాన్ని. బిగ్ బబుల్ కొనుక్కుంటూ భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల ఫొటోలను సేకరించిన ఓ స్నేహితురాలి నుండి ఫోటో ఒకటి సంపాదించడానికి తెగ ఆశ పడ్డదాన్ని. ఇంట్లో టీవీ లేకపోవడంతో పక్కింటి వాళ్ళ చెక్క గోడ కన్నం లోంచి భారత జట్టు గెలుపును తిలకించడం కోసం గంటల పాటు దోమల కాట్లు భరించినదాన్ని. భారత్ ఓడిపోవడంతో వెక్కి వెక్కి ఏడుస్తూ నిద్రపోయినదాన్ని. ఆ పెద్దావిడ గారి ఈ ఒక్క వ్యాఖ్య నన్ను ధబేల్ మని వాస్తవ ప్రపంచంలోకి తోసేసింది. మిగిలిన దారంతా నేను ఎలాగోలా కన్నీళ్లను ఆపుకుని బడికి చేరుకున్నాను. నాకు రాజకీయాలన్నా, మతమన్నా అంతగా తెలిసే వయసు కాదు. కానీ అజహర్, నేనూ ఒకటేనని ఆనాడు అర్థమైంది. అజహర్ పాకిస్తాన్‌ను గెలిపిస్తాడు, నేనేమో పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తాను! అదన్నమాట! అంతేతప్ప, భారత్ సపోర్టర్‌గా ఉండే హక్కు నాకు లేదా?
రోజూ మ్యాచ్‌కి ముందు ఖుదాను వేడుకునేదాన్ని. దాతాబాబా దర్గాకు పోయి మొక్కుకునేదాన్ని. ఆ రోజు స్కూల్ నుంచి తిరిగి వస్తూ, బస్సులో, ఆ పై వ్యానులో, ఆ తర్వాత సైకిల్‌పై పడమర దిక్కుగా వెళ్తూ మళ్లీ మళ్లీ మనసులో మొక్కుకుంటూనే ఉన్నా. ఎప్పటిలా కాకుండా కొంచెం ఎక్కువ సార్లే మొక్కుకున్నా. ఒకటి, లోడ్‌షెడ్డింగ్ కాకూడదు. మా పేటలో ఒకసారి లోడ్ షెడ్డింగ్ అయితే మళ్లీ రెండు రోజులకి గానీ కరెంటు రాదు. రెండు, టీవీ ఉన్న ఇంటి వారు నన్ను టీవీ చూడనివ్వాలి. మూడు, ఇండియా గెలవాలి. కానీ జూన్ నెలలోని ఆ రోజున అదనంగా మరికొన్ని మొక్కులు మొక్కుకున్నా. భారత్ గెలవాలి, దాంతో పాటుగా అజహర్ తప్పనిసరిగా పరుగులు సాధించాలి. ఇక భారత్ గెలిస్తే దర్గాలో కొవ్వొత్తి వెలిగించి, కొంత డబ్బు ముడుపు కూడా చెల్లిస్తానని ప్రత్యేకంగా మొక్కుకున్నాను. పొద్దుటి పెద్దమ్మ మాటలు గుర్తుకొచ్చి సైకిల్ హ్యాండిల్‌ని చేతులతో గట్టిగా పట్టుకుని నిస్సత్తువగా ఉన్న కాళ్ళతో తొక్కుతూ వచ్చాను. పదే పదే అల్లా నామాన్ని నూట ఒక్క సార్లు తలచుకున్నాను. లెక్క తప్పిందని మళ్ళీ తలచుకున్నాను. ఈ రోజు మ్యాచ్‌లో నేనూ, అజహర్ ఒకవైపైతే ఆ పెద్దమ్మ మాటలు మరో వైపు. భారత్ నా జట్టు అని నిరూపించాలి నేడు. నేను వేరే జట్టుకు చెందినదాన్ని కాదని చాటి చెప్పాలి. ఇది నా విధేయతకు సంబంధించిన సమస్య. నా జీవన్మరణ సమస్య. అయితే అప్పట్లో దేశద్రోహి అనే పదం ఎవరి బుర్రల్లోకీ ఎక్కలేదు. ''దేశ ద్రోహి'' అన్న పదం అప్పటికింకా అంత చౌకబారుది కాలేదు.
ఆ రోజు మ్యాచ్‌లో ఇండియా తొలుత బ్యాటింగ్ చేసింది. అజహర్ రెండో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడయ్యాడు. పాకిస్తాన్ ఓడిపోయింది. దేవుడు ఆ రోజు నా రెండు విన్నపాలు విన్నాడు. మరో రెంటిని లెక్కచేయలేదు. భారత్ ఇన్నింగ్స్ పూర్తవగానే లోడ్ షెడ్డింగ్ అయింది. ఇక కరెంటు లేదు. మ్యాచ్ స్కోరు తెలియక రాత్రంతా ఉస్సూరుమని గడిపాను. తెల్లారగానే, మా వాడలోని ఆఖరు ఇంటికి లగెత్తాను. ఆ ఇంటాయన రేడియో వినేవాడు. భారత్ గెలిచిందనీ, అజహర్ పరుగులు సాధించాడనీ విన్నాక కన్నీళ్లు వచ్చాయి. కానీ ఆనాటి ఆ బస్సు ప్రయాణం నా లోకాన్నే మార్చేసింది. అనేక వైవిధ్యాలున్న ఈ భారతదేశంలో క్రికెట్ దేవుడు అధిక సంఖ్యాకుల దేవుడే అనీ, నాలాంటి భక్తురాలు తన భక్తిని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటూ అలిసిపోవలసిందేననీ క్రికెట్ పిచ్చి ఉన్న నాకు మెల్లమెల్లగా అర్ధమైంది. ఆ తర్వాత 9/11 సంఘటన! కేవలం పొడుగాటి గడ్డం ఉన్న కారణంగా ఒక ఉపాధ్యాయుడిని చాలా ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం ఒసామా బిన్ లాడెన్ అని ఆటపట్టించడం, ముస్లింలు మాత్రమే ఉగ్రవాదులని వినీ వినీ నేనో తెలివైన నిర్ణయం తీసుకున్నాను. ఏ టీమును సపోర్టు చేస్తే దేశద్రోహి అన్న అపకీర్తి రాదో, ప్రతి రోజూ భక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదో అటువంటి టీమును ఎంచుకున్నాను. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు అభిమానిగా మారిపోయాను. అవును, 2003 ప్రపంచ కప్‌లో జోహన్నెస్ బర్గ్‌లో పాంటింగ్ సెంచరీ దంచేసినప్పుడు, డామియన్ మార్టిన్ అంకితభావంతో కూడిన నావికుడిలా, సాగర సీగల్ పక్షిలా శాంతంగా విక్టరీ ట్రోఫీని ముద్దాడినప్పుడూ నేను ఆస్ట్రేలియన్ సపోర్టరుని. 2011 ప్రపంచకప్‌లో నేను శ్రీలంకకు మద్దతురాలిగా మారాను. ఇండియా గెలుస్తుందని తెలిసి టీవీ ఆఫ్ చేసి నిద్రపోయాను. ఆ తర్వాత ఐపీఎల్ వచ్చింది. ప్రతి ఒక్కరి చేతిలోనూ పెద్ద పెద్ద మొబైల్ ఫోనులు. బంతి బంతికీ జూదం. ఇప్పుడు బెక్హాంకీ, క్రికెట్టు దేవుడికీ మధ్యలో ఆనాటి ఆ బస్సులోని ఆంటీలు అవలీలగా అడ్జస్టు అయిపోగలరు. ఆట మొదలవ్వగానే మార్కెట్‌లోని చీకటి సందుల్లో డబ్బు చేతులు మారిపోయేది. ఇప్పుడు ఆటకు దేవుడు 'పెట్టుబడి' అని తెలిసిపోయింది.
పాఠకులారా ఏమనుకుంటున్నారు? నేను దేశద్రోహినా? ఇప్పుడు నాలాంటి వాళ్లకోసం టక్కున వాడే పదం రెడీగా ఉందని తెలుసు. అందుకే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ చూస్తున్నప్పుడు, పాత అలవాటు ప్రకారం షమీ చేతి నుంచి క్యాచ్ డ్రాప్ కాగానే నా ఛాతీ వణికింది. క్యాచ్ డ్రాప్ అయ్యీ అవ్వంగానే, 'ఇన్ని క్యాచ్‌లు వదిలితే మీరు ఎలా గెలుస్తారు?' అని మా టీచర్ల ఫేస్‌బుక్ గ్రూప్‌లో ఒక 'సేఫ్ సైడ్' పోస్ట్ వచ్చేసింది. మ్యాచ్ ఓడిపోయుంటే బాహాటంగానే-దేశద్రోహి అనీ, పక్క దేశానికి పొమ్మనీ పిలుపునిచ్చేసేవారు.
ఇప్పుడు షమీ గౌరవగాథను చూసి ఆనందిస్తున్న ప్రజలు రేపు ఆయన్ను గెస్టపో దళాల నుండి రక్షిస్తారా? అయితే, ఇక్కడ గెస్టపోకు బదులు వేరే కొత్త పదం రావచ్చు. ఉదాహరణకు, అలీగఢ్‌ను హరిగఢ్‌గా మార్చినట్టు. షమీ కోసం మరో వేరియన్ ఫ్రై (యూదులు కొందరిని కాపాడిన అమెరికన్ జర్నలిస్టు-అనువాదకుడు) వస్తుందా? నమ్మకం లేదు. భారతదేశంలో ఫాసిజం పెరుగుదల సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయని చోమ్‌స్కీ నుండి అభిజిత్ వినాయక్ బెనర్జీ వరకు అందరూ అంటున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో కేవలం పాలస్తీనాకు మద్దతుగా వాట్సాప్ స్టేటస్ పోస్ట్ చేసినందుకు ఇద్దరు ముస్లిం స్కాలర్ల కోసం పోలీసులు వెతుకుతున్నారు. కానీ అదే ఉత్తరప్రదేశ్‌లో బజరంగ్ దళం ఎలాంటి ప్రభుత్వ అవరోధం లేకుండా ఇజ్రాయిల్‌కు మద్దతుగా నిర్భయంగా కవాతు చేసింది. పాలస్తీనాకు మద్దతుగా పోస్ట్ చేసినందుకు యోగి రాష్ట్రమే కాదు, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కూడా ఆలం నవాజ్ అనే ప్రభుత్వ ఉద్యోగి అరెస్టయ్యారు. గాజాలో ఇజ్రాయిల్ మారణహోమం గురించి ఏదైనా పోస్ట్ చేస్తే ట్రోలింగ్ ప్రారంభమవుతుంది. తాజా వార్తల ప్రకారం, కాశ్మీర్‌లోని జామా మసీదులో శుక్రవారం ప్రార్థనలకు అనుమతి ఇవ్వడం లేదు. పాలస్తీనాకు మద్దతుగా మసీదుల్లో ప్రార్థనలు చేయకుండా ఢిల్లీలోని మసీదు ఇమామ్‌లపై నిషేధం విధిస్తున్నట్లు మక్తూబ్ మీడియా పేర్కొంది !
కాబట్టి ఇక నమ్మకం లేదు. షమీ ప్రతి రోజూ నిరూపించుకోవాలి. ప్రపంచ కప్ ఫైనల్లోనూ దేశభక్తి నిరూపించుకోవాలి. బహుశా టోర్నమెంటులో బంగారు కప్ గెలిచాక కూడా నిరూపించుకుంటూ ఉండాల్సిందే. పేరు భారం అనేది చాలా గొప్ప భారం. ఒక నిర్దిష్ట మతానికి చెందిన వ్యక్తులు ఈ భారానికి బాధితులు. వారు ఎంత ప్రయత్నించినా, మెజారిటీ ప్రధాన స్రవంతి వెలుపలే వారి స్థానం. మోడీ హయాంలో ఇప్పుడు ఒక సంచలన పదం ఉంది 'దేశద్రోహి' అన్నది! కానీ విని వినీ ఒకనాటికి అలవాటైపోతుంది తమ్ముళ్ళూ. మీకు ఇష్టమొచ్చినన్ని సార్లు అనుకోండి!
(మౌమితా ఆలం పశ్చిమ బెంగాల్, జల్పాయిగురి జిల్లాకు చెందిన కవయిత్రి, ఉపాధ్యాయురాలు. 'గ్రౌండ్ జీరో' పత్రిక సౌజన్యంతో స్వేచ్ఛానువాదం: బాలాజీ (కోల్‌కొతా)
మౌమితా ఆలం