బాగ్దాద్ (ఇరాక్) : ఇరాక్‌లోని ఓ పెళ్లి వేడుకల్లో ఘోర అగ్నిప్రమాదం మంగళవారం రాత్రి జరిగింది. ఉత్తర ఇరాక్ నెనెవెహ్ ప్రావిన్స్ అల్‌హమ్‌దానియా జిల్లాలో పెళ్లి వేడుక జరుగుతున్న ఓ ఫంక్షన్ హాల్‌లో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో వివాహానికి హాజరైనవారిలో 100 మందికి పైగా సజీవదహనమయ్యారు. వారిలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఉన్నారు. మరో 150 మందికిపైగా అతిథులు గాయపడినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారందరినీ ఆసుపత్రికి తరలించారు. బాణాసంచా కాల్చే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.