
ఒక అడవిలో ఒక రోజు కుందేలుకు దాహంగా ఉంటే నీటిని తాగడానికి చెరువు వద్దకు వెళ్లింది. ఆ చెరువు పక్కనే ఎత్తైన చెట్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఒక శబ్దం వినిపించింది. కుందేలు అటువైపుగా వెళ్లి చూస్తే అక్కడ మనుషులు కనిపించారు. వాళ్ళు చెట్లను నరుకుతూ ఉన్నారు.
వాళ్ల దగ్గర ఆయుధాలు చూసి కుందేలు భయపడింది. పరుగెత్తుకుంటూ వెళ్లి, మృగరాజుకు ఫిర్యాదు చేసింది. ఏమి చేయాలో తెలియక అడవిలోని జంతువులను పిలిచి మృగరాజు సమావేశం నిర్వహించింది.
'ఇలాగే సాగితే, కొంతకాలం తర్వాత మనం ఉండడానికి అడవులు కరువైపోతాయి. ఈ మనుషులు అడవుల్లోకి రాకుండా ఏం చేయాలో ఆలోచించి ఒక నిర్ణయం చెప్పండి' అని సమావేశానికి వచ్చిన జంతువులతో సింహం అన్నది.
అప్పుడు సభలో ఉన్న నెమలి ఒక ఆలోచన చేసింది. 'మనం కూడా మనుషుల్లాగా వాళ్లు ఉన్నచోటికి వెళ్దాం. అలా చేస్తే వాళ్ళు ఇక్కడికి రావడం మానేస్తారు' అన్నది. నెమలి ఆలోచన అన్నిటికీ బాగా నచ్చింది.
మృగరాజు, నక్క, పులి మిగిలిన జంతువులన్నీ ఊరి మీదికి వెళ్లడం ప్రారంభించాయి. వాటిని చూసిన ప్రజలు భయపడ్డారు. ఎప్పుడూ లేనిది జంతువులన్నీ ఊరు మీదికి ఎందుకు వస్తున్నాయో అర్థంకాక గందరగోళపడ్డారు. వెంటనే ఊరి ప్రజలంతా ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.
ఆ ఊరి పెద్ద పెద్దయ్య మాట్లాడుతూ 'మీరు అడవుల్లోకి వెళ్లి చెట్లను నరికేస్తున్నారు. కాబట్టి అవి ఊర్లోకి వస్తున్నాయి. అడవులు మనకు తల్లుల లాంటివి. అక్కడ ఉన్న పండ్లు ఫలాలను మాత్రమే తెచ్చుకోండి. చెట్లను నరకకండి' అని చెప్పారు.
తమ తప్పు తెలుసుకున్న గ్రామస్తులు ఆ రోజు నుండి అడవిలో ఉన్న చెట్లను నరకడం మానేశారు. మనుషులు అడవికి రాకపోవడంతో జంతువులన్నీ చాలా సంతోషించాయి. ఉపాయం ఫలించినందుకు నెమలిని అభినందించాయి.
పత్తెపు సతీష్,
10వ తరగతి,
63053 93291.