Aug 21,2023 07:36

పాటే వినబడుతుంది
యేడ జూసిన
పాటే కనబడుతుంది
యే జాడనెతికిన

ప్రతి పల్లె వాడ ఇల్లిల్లూ
కడుపుగట్టి సాదుకున్న పాట
హౌలే హౌలో రేలారే... ఏ... ఏ...
నగినానో సాగనో సాగా.... హాప్‌ అంటూ
ఆకాశమంత రాగమై గానమై
గజ్జెగట్టి దుంకుతున్న గద్దరన్న పాట

ప్రతి కొడుకు నోట
లచ్చుమమ్మ పాట
ప్రతి అన్న/ తమ్ముడి నోట
చెల్లెమ్మ పాట - ఆడపిల్ల పాట
పొడుస్తున్న పొద్దు నోట
పొద్దు తిరుగుడు పువ్వు పాట
ఇంతదాకా ఏ కవి రాయని
చెత్తకుండీ పాయఖానా పాట

దగాపడ్డ తెలంగాణ
గుండె చప్పుడు పాట
కారంచేడును కత్తిగ మల్చిన
దళిత పులుల పాట
పాలక వర్గాల నిలదీసిన
ప్రజా చైతన్య పాట
ఎర్ర జెండానెగరేసి ముద్దాడిన
లాల్‌ సలాం పాట

యుద్ధభూమికి నడిపించిన
ప్రజా యుద్దనౌక పాట
నేల కొరకు నేలకొరిగిన
అమరుల త్యాగాల పాట
మరణమెరగని పాట
మరింత శక్తివంతమైన పాట
మరో ప్రపంచం కొరకు
మళ్ళీ పుడుతున్న పాట!
 

- అమృతరాజ్‌