Oct 14,2023 10:12

- అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఆమోదం
ముంబయి: 2028 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. ముంబయిలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐఓసి) సమావేశం అనంతరం అధ్యక్షులు థామస్‌ బాచ్‌ మాట్లాడుతూ.. క్రికెట్‌తోపాటు మరో నాలుగు క్రీడాంశాలను 2028 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో చోటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. క్రికెట్‌తోపాటు ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లాక్రోసే, స్క్వాష్‌, బేస్‌బాల్‌-సాఫ్ట్‌బాల్‌ క్రీడలకు లాస్‌ ఏంజిల్స్‌ నిర్వాహకులు ఆమోదించినట్లు తెలిపారు. ఒలింపిక్‌ ప్రోగ్రామ్‌ కమిషన్‌ సమీక్షించి ఓటింగ్‌ ద్వారా ఆమోద ముద్ర వేస్తే అధికారికంగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ చేరిపోతుంది. అదే జరిగే ఇకపై ప్రపంచ కప్‌, ఆసియా కప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ వంటి బహుళ దేశాల టోర్నీలను వీక్షించే అభిమానులకు ఒలింపిక్స్‌ రూపంలో మరో మెగా సంబరం ఆస్వాదించే అవకాశం కలిగినట్టే. అయితే ఇది టి20 ఫార్మాట్‌లోనే జరిగే ఛాన్స్‌ ఉంది. దీంతో 128 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో మళ్లీ క్రికెట్‌ ఆటను మళ్లీ చూడనున్నాము. చివరిసారి 1900 సంవత్సరంలో పారిస్‌లో జరిగిన ఒలింపిక్‌ క్రీడల్లో క్రికెట్‌ ఆడించారు. ఆ ఏడాది ఫైనల్లో ఫ్రాన్స్‌పై బ్రిటన్‌ గెలిచి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఇక ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం ద్వారా భారత్‌లో ప్రసార హక్కుల నుంచి భారీగా సొమ్ము రాబట్టాలని కూడా ఐఓసి భావిస్తోంది. ప్రస్తుతం ఒలింపిక్స్‌ ప్రసార హక్కుల వేలం ద్వారా రూ.158 వేల కోట్ల వరకు ఐఓసి ఆర్జిస్తోంది. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేరిస్తే అదనంగా మరో రూ.15 వేల కోట్లు ప్రసార హక్కుల ద్వారానే రాబట్టాలని భావిస్తోంది.