Aug 10,2023 15:05

వాషింగ్టన్‌ : అమెరికాలో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ కలకలం రేపుతోంది. ఇటీవలే పుట్టుకొచ్చిన ఈజీ.5 వేరియంట్‌ దేశంలో కొత్త కరోనా కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఈజీ.5 వేరియొంట్‌ ఒమిక్రాన్‌ జాతికి చెందిన ఎక్స్‌బీబీ 1.9.2 రికాంబినెంట్‌ వైరస్‌ నుంచి పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈజీ.5 వేరియంట్‌ ప్రస్తుతం 17 శాతం కరోనా వైరస్‌ కేసులకు కారణమైందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఈ కొత్త మ్యూటేషన్‌ గతంలో ఇతర కరోనా వేరియంట్లలో కూడా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈజీ.5 వేరియమంట్‌ కన్నా.. ఈజీ.5.1 అని పిలవబడే మరో కొత్త వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఈజీ5.1 వేరియంట్‌ బ్రిటన్‌ని వణికిస్తోంది. ఈ వేరియంట్‌ వ్యాప్తి భారత్‌లో కూడా విజృంభిస్తోందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వేరియంట్‌ కేసులు మహారాష్ట్రలో గణనీయంగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారిలో కనిపించిన వ్యాధి లక్షణాలే.. ఈ కొత్త వేరియంట్‌ సంక్రమించిన వారిలో కూడా కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. సాధారణంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారిలో ముక్కు కారడం, తీవ్రమైన తల నొప్పి, గొంతు నొప్పి, తుమ్ములు, ఆయాసం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని, కొత్త వేరియంట్‌ ఈజీ.5.1 సోకిన వారిలో కూడా ఈ లక్షణాలే కనిపిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు.