Oct 09,2023 08:04

           ఈ ఏడాది నోబెల్‌ సాహిత్య బహుమతి విజేత నార్వే రచయిత జాన్‌ ఫాసే. ఇప్పటివరకూ ఆయన రాసిన నవలలు, కవితలు, పిల్లల కోసం రాసిన పుస్తకాలు, వ్యాసాలు, నాటకాలు- అన్నీ కలిపి 75 వరకూ ఉన్నాయి. హేన్రిక్‌ ఇబ్సన్‌ తర్వాత నార్వేలో రెండవ సుప్రసిద్ధ నాటకకర్తగా ఫాసే కీర్తి పొందాడు. ప్రపంచవ్యాప్తంగా 1000 పైగా వివిధ రంగస్థలాలపై తన నాటకాలు ప్రదర్శితం అయ్యాయి. అలా ఫాసే ప్రపంచ రంగస్థలం మీద ఎక్కువ సార్లు, ఎక్కువ చోట్ల ప్రదర్శించిన నాటకర్తగా గుర్తింపు పొందాడు.
         మినిమలిజం ధోరణిలో లోతుగా ఆత్మావలోకనం చేయిస్తాయి ఫాసే రచనలు. అతడి రచనా శైలి గేయాత్మక వచనం, కవిత్వ పంథాలో ఉంటాయి. ఇబ్సన్‌ ప్రదర్శనా శైలిని, ఆధునిక వర్తమానంలో కొనసాగింపుగా ఫాస్సే నాటక రచనను చెప్పుకోవచ్చు. అందుకే ఫాసేని ఆధునిక ఇబ్సన్‌గా ముద్దుగా పిలుచుకుంటారు. వీరి ప్రదర్శనలను పోస్టు డ్రామెటిక్‌ థియేటర్‌గా విమర్శకులు పేర్కొంటుంటారు. అప్రకటిత మూగ స్వరాలకు ఫాసే తన గొంతును ఎరువిచ్చాడు అంటారు. ఫాస్సే నోబెల్‌ సాహిత్య పురస్కారం పొందిన నాల్గవ నార్వేజియన్‌. ఈ సంవత్సరం నోబెల్‌ బహుమతి విలువ 11 మిలియన్‌ స్వీడిష్‌ క్రోనార్లు. మన రూపాయల్లో రూ.8.35 కోట్లు.
           1995కు ముందే ఫాసే తన మొదటి నాటకం రాశారు. 1995, 1998, 2002, 2004లో నైట్‌ సాంగ్స్‌, డ్రీమ్‌ ఆఫ్‌ ఆటమ్‌, డెత్‌ వేరియేషన్స్‌ మొదలైనవి రాశారు. ఇవి భావోద్వేగపరమైనవిగా, సామాజిక వైచిత్రి, దైవానుభూతి పరమైనవి, అధునాతన కళాత్మక ప్రక్రియల ద్వారా కొత్త రకమైన భాషాభివ్యక్తితో తీర్చిదిద్దబడినవిగా విశ్లేషకులు భావిస్తారు. ఫాసేపై వెస్సాస్‌ బెకెట్‌ బెర్నర్డ్‌ ట్రకేల ప్రభావం ఉందంటారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నాటక సప్తకం 2012లో రాసిన 'ఏ న్యూ నేమ్‌'గా విశ్లేషకులు పేర్కొంటారు. ఈ నాటకాలు ... వయసు పైబడుతున్న ఓ సృజనకారుడు తన లోపలి మనిషితో ముఖాముఖిగానూ, మానవీయ పరిస్థితులతో దైవంతో సంవాదం గానూ ఉంటాయని, అవి జీవితంలో నిర్భీతిని ప్రతిఫలించేవిగా ఉంటాయని చెబుతారు. ఫాసే తన జీవితాన్ని, రచనలను ప్రభావితం చేసిన వారి(టి)లో హాజ్‌, ఫ్రాంజ్‌ కాఫ్కా, విలియం ఫాక్నర్‌, వర్జీనియా ఊఫ్‌తో పాటు చివరగా బైబిల్‌ కూడా అని ఆయన చెబుతారు. ప్రపంచంలో జీవించి ఉన్న మొదటి వందమంది మేధావుల్లో ఫాసే స్థానం 83 అని ఒక సంస్థ పేర్కొంది. 2011లో ఆస్లో నగరంలోని రాయల్‌ ప్యాలెస్‌ ఆవరణ సమీపంలో నార్వే ప్రభుత్వం గ్రోటెన్‌' గౌరవనీయ ఆవాసాన్ని ఫాసేకు కల్పించింది. నార్వేజియన్‌ కళా సంస్క ృతులకు, ఫాస్సే అనుదానాన్ని గుర్తించిన నార్వే రాజు, గ్రోటెన్ని శాశ్వత ఆవాసంగా వినియోగించుకోవడానికి ఫాస్సేకు అనుమతి ఇచ్చాడు. 2015లో తన రచనాత్రయం 'వేక్‌ ఫుల్‌ నెస్‌', 'ఒలావ్స్‌ డ్రీమ్స్‌', 'వీయరినెస్‌'గాను నార్డిక్‌ కౌన్సిల్‌ వారి సాహిత్య బహుమతిని కూడా పొందాడు.
         ఫాసే రచనలను పర్షియన్‌ భాషలోకి మొహమ్మద్‌ హమీద్‌ ద్వారా అనువదించగా, తెహరాన్‌లోని ప్రధానమైన రంగస్థల వేదికలపై నాటకాలు ప్రదర్శింపబడ్డాయి. ఫాసే నాటకాలను సారా కెమెరాన్‌ సండ్‌ ఇంగ్లీషులోకి అనువదించారు. అవి న్యూయార్క్‌, పిట్స్‌బర్గ్‌లోని కళావేదికలపై ప్రదర్శింపబడ్డాయి.
           2022లో ఫాస్సే నవల- అతడి రచనా సప్తకంలో 6, 7 భాగాలను డామియోన్‌ సీర్ల్స్‌ ఆంగ్లంలోకి అనువదించారు. 'న్యూ నేమ్‌' పుస్తకం 2023 నేషనల్‌ బుక్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డు (ఫిక్షన్‌ విభాగం) తుది ఎంపికలో ఉంది.'ఐ యామ్‌ ద విండ్‌' అనే అస్తిత్వవాద నాటకంలో- ప్రధానంగా ఒక చేపల పడవలోని ఇద్దరి మధ్యే కథ నడుస్తుంది. ఫాసే పాత్రలు, సాధారణ ప్రజానీకం, సామాజిక జీవితానికి వెలిగా ఉండే వారికి.. నిత్యజీవితంలో ఎదురయ్యే సవాళ్లను కష్టాలను ఎదిరించగల ధైర్యాన్ని ఇస్తాయి. రచయితకు, పాత్రలకు మధ్య, వెచ్చని అనుబంధం కొనసాగుతూ వారిలోని మానవత్వాన్ని ఎత్తిచూపుతాయి. 'ఇతివృత్తాల కోసం అయితే నా రచనలు చదవనవసరం లేదు' అనే ఫాసే - 1983లో సాహిత్యంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. తరువాత మొట్టమొదటి నవల 'రెడ్‌ అండ్‌ బ్లాక్‌' రాశాడు. తరువాత మూడు సంపుటాల్లో 1250 పేజీలతో సాగింది. ఒక్కచోట కూడా విరామ చిహ్నం లేకుండా సాగిపోతుంది.
           ఫాసే ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న 1990 ప్రాంతాల్లో ఎవరో, ''నువ్వు నాటకాలు ఎందుకు రాయకూడదు?'' అని అన్నారట. ''అప్పుడే తెలుసుకున్నాను- నాటక రచన నా కోసమే వేచి ఉంది.'' అని ఫాసే ఇప్పుడు ఆరోజును గుర్తు చేసుకుంటారు. ఆ తరువాత నుంచి నాటకాలు రాయడం మొదలు పెట్టాడు. తన వచనం, రచనా శైలి, ప్రదర్శన పోకడలతో ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక ప్రదర్శనలు ఇచ్చిన నాటక రచయితగా నిలిచాడు. తను ఒక ప్రయాణంలో ఉండగా, నోబెల్‌ అకాడమీ బాధ్యుడు ఒకరు ఫోన్‌ చేసి బహుమతి విషయం చెప్పగానే ''అయితే, నేను ఇంకా జాగ్రత్తగా డ్రైవ్‌ చేసుకుంటూ ఇంటికి వెళ్తాను'' అన్నాడట. నోబెల్‌ బహుమతి తనకు వస్తుందని ఎన్నోసార్లు అనుకున్నా, నిజంగా ఆ వార్త విన్నప్పుడు మాత్రం సరికొత్తగా ఆశ్చర్యపోయాడట !
            భాష విషయానికి వస్తే ... డెన్మార్కులో 400 ఏళ్లుగా ఉన్న భాషలో కాకుండా, నార్వే జనాభాలో 10 శాతం మంది మాత్రమే మాట్లాడే నార్వే పశ్చిమ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంత మాండలిక భాష తనది. అందువల్లనే తన నాటక ప్రదర్శనలు వేయి విధాలుగా రంగస్థలానువాదాలుగా ప్రాచుర్యం పొందాయి'' అని అభిప్రాయపడతాడు.
            చిన్నప్పుడు కలిగిన ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడిన తర్వాత రాక్‌ బ్యాండ్‌ని ఇష్టపడ్డ ఫోసే, చావు బతుకుల మధ్య కొట్లాడి బయటపడ్డాక, రచనా వ్యాసాంగంపై దృష్టి నిలిపాడు. ఇప్పటికీ వివిధ ప్రక్రియల్లో 75 పైగా రచనలు చేసినా, అందులో సగభాగం నాటక రచనలే ఉంటాయి. ''పరిస్థితులు అంధకార బంధురంగా, చీకట్ల గుయ్యారంగా ఉన్నప్పుడే నువ్వు వెలుగును చూడగలవు'' అన్నట్లు తన రచనా సప్తకంలో ఒక్క వాక్యానికి కూడా విరామం ఇవ్వకుండా పాఠకుడ్ని తన ఆలోచనా భావధార వెంట ఈడ్చుకుపోతాడు ఫాసే. ఈ ఏకవాక్య, ఏకపాత్ర (మోనోలాగ్‌)- ''కళ, దైవత్వం మధ్య సాగే ఆనందోద్వేగాల ఉద్గారం'' అనొచ్చు. ఫ్రెంచ్‌ దినపత్రిక 'లే మోండే' ఫాస్సేని 21వ శతాబ్దపు బెకెట్‌ అంటే, కెనడా పత్రిక 'గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌' - సమకాలీన నాటక రంగంలో అత్యంత ఎక్కువగా రెచ్చగొట్టే, ఉసిగొలిపే కలం గాలి అని అభివర్ణించింది ఫాసేని.
 

- మల్లేశ్వరరావు ఆకుల
79818 72655