ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ (పల్నాడు) : పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడు సమీపంలో ఆదివారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పాకాలపాడు సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను, లారీ వెనుక నుండి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్రోసూరు మండలం 88 తాళ్ళూరు కు చెందిన మలిశెట్ట సలోమి (38) అక్కడికక్కడే మృతి చెందగా మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. క్రోసూరు మండలం 88 తాళ్ళూరుకు చెందిన 10మంది గుంటూరు సమీపంలో ఉన్న దాసరిపాలెంలో జరిగిన చర్చి ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఆటోలో బయలుదేరి వెళ్లారు. చర్చి ప్రారంభం అనంతరం ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో పాకాలపాడు సమీపంలో ఆటో డ్రైవర్ యోహానుకు ఫోన్ రావటంతో ఆటోను రోడ్డు పక్కన ఆపి మాట్లాడుతున్నాడు. ఈక్రమంలో సత్తెనపల్లి వైపునుండి క్రోసూరుకు వెళుతున్న టిప్పరు లారీ వెనకనుండి వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ సలోమితో పాటు మరో 8మంది గాయపడ్డాడు. క్షతగాత్రులను 108వాహనం ద్వారా సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. విషయం తెలుసుకున్న సత్తెనపల్లి రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










