Aug 09,2023 07:08

              ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సమాఖ్య విధానం పట్ల ఏమాత్రం గౌరవం లేని నిరంకుశ, మితవాద ప్రభుత్వంగా నరేంద్రమోడీ ప్రభుత్వం మరోసారి తన నిజస్వరూపాన్ని చాటుకుంది. తాజాగా పార్లమెంట్‌ ఉభయ సభల ఆమోదం పొందిన ఢిల్లీ పౌరసేవల చట్టం (జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ (సవరణ) చట్టం), వ్యక్తిగత డేటా బిల్లు (డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్‌ - 2023) ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఒక రాష్ట్రం హక్కులు హరిస్తుంటే వ్యతిరేకించాల్సిన రాష్ట్రంలోని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగు ప్రజల ఆత్మగౌరవం పునాదిగా ఏర్పడిన టిడిపి, ఒడిశా అధికార పార్టీ బిజెడి ఈ బిల్లు ఆమోదం పొందడంలో కీలకపాత్ర పోషించడం దారుణం.
           ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని రబ్బరు స్టాంపు, తోలుబొమ్మ స్థాయికి దిగజార్చాలన్న కసి, కుట్ర ఢిల్లీ పౌరసేవల బిల్లులో కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర ప్రభుత్వ హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేసిన నరేంద్రమోడీ ఏలుబడిలోనే ఆ ప్రభుత్వ అధికారాలను హరించడం గమనార్హం. శాంతిభద్రతలు, పోలీసు వ్యవస్థ, భూసంబంధ అంశాల్లో మినహా మిగతా అన్ని విషయాల్లో ప్రజల చేత ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వానికే అధికారం ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం విస్పష్టంగా ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కింది. గత మేలో ఆర్డినెన్స్‌గా, ప్రస్తుతం చట్టంగా ఆమోదం పొందిన ఈ బిల్లు ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని కేంద్రం నియమించిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతిలో తోలుబొమ్మగా మార్చింది. ఈ చట్టం ఢిల్లీ ముఖ్యమంత్రి అధ్యక్షతన నేషనల్‌ క్యాపిటల్‌ సివిల్‌ సర్వీస్‌ అథారిటీని ఏర్పాటుచేస్తోంది. అథారిటీకి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించినప్పటికీ, సీనియర్‌ బ్యూరోక్రాట్లుగా ఉన్న మరో ఇద్దరు అధికార సభ్యులు సిఎం అభిప్రాయాన్ని తోసిపుచ్చవచ్చు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అథారిటీ సిఫార్సులను ఆమోదించాల్సిన అవసరం లేదు. వీటిని బట్టి చూస్తే ఢిల్లీ సిఎం విలువ జీరో. మంత్రిమండలి అభిప్రాయాలను కార్యదర్శులు కూడా అడ్డుకోవచ్చు. పైగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లి, దానిమీద ఆయన నిర్ణయం తీసుకునే వీలు కల్పిస్తుంది. అంటే మంత్రి మండలి నిర్ణయాల చట్టబద్ధతను పరీక్షించే ఇన్విజిలేటర్‌ లేదా ఎగ్జామినర్‌గా కార్యదర్శి మారిపోతాడు. ముఖ్యమంత్రి, మంత్రిమండలి డమ్మీగా మారగా, కేంద్రం చేత నియమితుడైన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సర్వోన్నతంగా మారతారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి, మంత్రి మండలిని డమ్మీగా మార్చేసి, కేంద్రమే పాలన చేస్తే ప్రజాభీష్టానికి, ఎన్నికలకు విలువ ఏముందో మోడీ సర్కారుకే తెలియాలి. ఈ బిల్లుపై అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు మరింత ఘోరంగా ఉన్నాయి. 2015 తరువాత వచ్చిన సిఎంతో సమస్యలు ఉండటం వల్లే తీసుకొచ్చామంటూ పరోక్షంగా ఆప్‌ సిఎం కేజ్రీవాల్‌ను పేర్కొంటూ సమర్ధించుకోవడం ఆయనకే చెల్లింది. ఈ 25 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బిజెపి దొడ్డిదారిన పాలన చేయాలనే ఆత్రమే ఈ చట్టం అన్న విమర్శలకు ఏమని సమాధానం చెప్పగలరు? ప్రజాస్వామ్యమంటే అధికార వికేంద్రీకరణే తప్ప కేంద్రీకరణ కాదన్న స్పృహ కాస్తయినా ఉంటే సమాఖ్య వ్యవస్థ హననానికి కేంద్రప్రభుత్వం పాల్పడి ఉండేది కాదు. తాజాగా రాజ్యసభలో చర్చకు టిడిపి డుమ్మా కొట్టగా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించడం సిగ్గుచేటు. నీతిలేని పాలన నుంచి ఢిల్లీని రక్షించడానికి బిల్లుకు మద్దతు తెలుపుతున్నామని వైసిపి ప్రకటించడం మోడీ సర్కారుకు భజన చేయడమే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి పల్లెత్తు మాట్లాడకుండా, ఢిల్లీ వంటి బిల్లుకు మద్దతు ఇచ్చి కేంద్రీకరణ, నిరంకుశత్వానికి రెండు పార్టీలు కొమ్ముకాయడం సరికాదు.
           డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్‌ 2023పై 2018లో ముసాయిదా రూపొందించి, నివేదిక సమర్పించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఎన్‌ శ్రీకష్ణ తాజా బిల్లు వ్యక్తిగత, ఆంతరంగిక డేటాలో ప్రభుత్వం తలదూర్చడానికి ఎక్కడ లేని అవకాశమిస్తుందని తీవ్ర విమర్శ చేశారు. డేటా గోప్యతకు సంబంధించి వ్యక్తుల స్వేచ్ఛకు, ప్రాథమిక హక్కుకు రక్షణ ఇవ్వడం కంటే ప్రభుత్వ విశంఖల జోక్యానికి, బాధ్యుడైన అధికారి కీలుబొమ్మలా మారేందుకు దోహదం చేస్తోంది. రాజ్యాంగ సమాఖ్య సూత్రాలను ధ్వంసం చేసే కేంద్రం దుర్మార్గాలను జనం తిప్పికొట్టాలి.