Nov 18,2023 08:48

పేదరాశి పెద్దమ్మ చుట్టూ చేరి పిల్లలంతా కబుర్లు చెప్పసాగారు. ఇంతలో ఓ పిల్లవాడు వచ్చి 'పెద్దమ్మా పెద్దమ్మా, మా నాన్న నన్ను 'నువ్వెందుకు పనికిరావు' అన్నాడు అని ఏడుస్తూ చెప్పాడు. 'మీరంతా చక్కని పిల్లలు. మీ శక్తి మీకు తెలియదు. ఈ కథ వినండి. మీకే అర్థమౌతుంది' అంటూ చెప్పసాగింది.
పోతనాపల్లి గ్రామంలో చుక్కమ్మ, వీరయ్య దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారు ఇటుక బట్టీలు పెట్టి జీవనం సాగించేవారు. వారికి అబ్బి, సుబ్బి అనే ఇద్దరు పిల్లలు. అబ్బి చాలా తెలివైనవాడు, చురుకైనవాడు. సుబ్బి నెమ్మదస్తుడు. చదువు విషయంలోనూ, పని విషయంలోనూ శ్రద్ధ కనబర్చేవాడు కాదు. పిల్లాడి వైఖరిని చూసి తల్లిదండ్రులు బాధపడేవారు. తండ్రి ఒక రోజు సుబ్బిని పిలిచి 'నువ్వు సగం కాలిన ఇటుక లాంటోడివి దేనికీ పనికి రావు' అని తిట్టాడు.
'అమ్మా, నాన్న నన్ను సగం కాలిన ఇటుక అని తిట్టాడు' అని తల్లి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ చెప్పాడు సుబ్బి. చుక్కమ్మ కొడుకుని దగ్గరగా తీసుకుని 'చూడు నాయనా! ఈ ప్రపంచంలో పనికిరానిదంటూ ఏదీ లేదు. ప్రతి దానికీ ఒక ప్రయోజనం ఉంది. బట్టీ చుట్టూ ఉన్న ఇటుకలు పూర్తిగా కాలవు, అలాగని అవి లేకపోతే లోపల ఉన్న ఇటుకలు ఎర్రగా కాలవు. వాటి ప్రయోజనం వాటికుంది. నువ్వు చాలా తెలివైన వాడివి. నాన్నకి తెలియక అలా అన్నాడు. వెళ్లి ఆడుకో'' అని బుజ్జగించింది.
ఒకరోజు ఒక ఆసామి వీరయ్య దగ్గరకు వచ్చి సగం కాలిన ఇటుకలు ఉన్నాయా? అని అడిగాడు. 'ఉన్నాయి బాబూ. అవి ఎందుకూ పనికిరావని ఒక మూలన గుట్టగా పడేసాము' అన్నాడు. 'మీ ఇంటికి దగ్గరలో రోడ్డుకి ఇరువైపులా మొక్కల చుట్టూ ఇటుకలతో చేసిన రక్షణ గోడ ఎంతో బాగుంది. నేను కూడా అలాగే మొక్కల చుట్టూ పెట్టించాలి అనుకుంటున్నాను. ఈ ఇటుకలైతే తక్కువ ధరకి వస్తాయని అడిగాను. ఎంతో కొంత తీసుకుని ఇటుకలు ఇవ్వు' అన్నాడు ఆసామి. అందుకు 'సరే' నని డబ్బులు తీసుకుని ఇటుకలు ఇచ్చాడు వీరయ్య.
'ఎందుకూ పనికిరావు' అనుకున్న ఇటుకలు అమ్ముడవ్వడంతో ఉబ్బి తబ్బిబ్బు అయిన వీరయ్య ఆనందంతో ఆ సంగతి చుక్కమ్మకు చెప్పాడు. అప్పుడు ఆమె భర్తని తీసుకుని వీధి వైపు నడిచింది. అక్కడ రోడ్డుకి ఇరువైపులా మొక్కల చుట్టూ రంగురంగుల అందమైన ఆకారాలతో రక్షణ గోడలు కనిపించాయి. కాస్త దూరంలో రంగులు వేస్తూ సుబ్బి కనిపించాడు. అప్పుడు అర్థమయ్యింది వీరయ్యకు, సగం కాలిన ఇటుకలు కూడా పనికి వస్తాయని'
''ఇదర్రా పిల్లలూ.. కథ'' అంటూ ముగించింది పెద్దమ్మ.
 

- కాశీ విశ్వనాథం పట్రాయుడు,
94945 24445