Sep 04,2023 07:07

             ప్రముఖ ద్విభాషా కవి, సాహితీవేత్త జయంత మహాపాత్ర 2023 ఆగస్టు 27న ఒడిశాలోని కటక్‌లోని ఒక ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 95. జయంత మహాపాత్ర ఆంగ్ల కవిత్వానికి సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ కవి. అతనికి 2009లో పద్మశ్రీ కూడా లభించింది. దేశంలో పెరుగుతున్న అసహనానికి నిరసనగా 2015లో ఆయన దానిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చాడు.
ఆధునిక భారతీయ ఆంగ్ల సాహిత్యంలో క్లాసిక్‌లుగా పరిగణించబడే 'ఇండియన్‌ సమ్మర్‌', 'హంగర్‌' వంటి పద్యాలను రచించినందుకు ఆయన బాగా పేరు పొందాడు. ఆయన ఇతర ప్రముఖ రచనల్లో 'రిలేషన్‌ షిప్‌', 'బేర్‌ ఫేస్‌', 'షాడో స్పేస్‌' కూడా ఉన్నాయి. మొత్తంగా మహాపాత్ర 27 కవితా సంపుటాలు వెలువ రించారు. వాటిలో ఏడు ఒరియా కాగా, మిగిలి నవి ఆంగ్లంలో ఉన్నాయి. 1981లో ఆయన రాసిన 'రిలేషన్‌ షిప్‌' పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
           మహాపాత్ర గద్యంతో కూడా ప్రయోగాలు చేశాడు. 'గ్రీన్‌ గార్డనర్‌' పేరిట చిన్న కథల సంపుటి, 'డోర్‌ ఆఫ్‌ పేపర్‌' పేరిట వ్యాసాల సంపుటి వెలువరించారు. డోర్‌ ఆఫ్‌ పేపర్‌ నిజంగా ప్రత్యేకమైన పుస్తకం. ఇది ఆయన కవిత్వ సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుంది.
         అక్టోబరు 22, 1928న కటక్‌లో ప్రముఖ ఒడియా క్రైస్తవ కుటుంబంలో జన్మించిన మహాపాత్ర కటక్‌లోని స్టీవర్ట్‌ పాఠశాలలో చదివి పాట్నా విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో మాస్టర్స్‌ పూర్తి చేశారు. ఒడిశాలోని వివిధ ప్రభుత్వ కళాశాలల్లో భౌతికశస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. తన అరవైల చివరలో రచనా జీవితాన్ని ప్రారంభించాడు. ప్రారంభంలో ఆయన రాసిన చిన్న కథలు, కవితలు ప్రచురణకర్తల తిరస్కారానికి గురయ్యాయి. ఆయన కవితలు అంతర్జాతీయ సాహిత్య పత్రికల్లో ప్రచురించబడే వరకూ స్థానికంగా గుర్తింపు రాలేదు.
          సార్క్‌ రచయితల సదస్సుల్లో కొన్నిసార్లు, పాండిచ్చేరి యూనివర్శిటీలో ఒకసారి ఆయన్ని కలిసాను. సింపుల్‌ లివింగ్‌ అండ్‌ హై థింకింగ్‌ కల సహృదయుడు ఆయన. ఆయన మాటలు వినడం అందరికీ ఇష్టం. జయంత మహాపాత్రతో కలిసి నా పద్యాన్ని చదవడం, నా పక్కనే ఆయన కూర్చొని, నా కవితపై శ్రద్ధ పెట్టడం నాకు ఒక రివార్డింగ్‌ అనుభవం! 'క్లోజ్‌ ది స్కై' (1971)తో ప్రారంభించి, 95 సంవత్సరాల వయసులో 'మధ్యాహ్నం: కొత్త, ఎంపిక చేసిన పద్యాలు' (2023)తో తన రచనా రచనా ప్రస్థానాన్ని ముగించిన మహాపాత్ర భారతీయ ఆంగ్ల కవిత్వంలో ఆధునికతకు కొత్త పునాదిని నిర్మించారు. ఆయన కవిత్వ లోకంలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

- డాక్టర్‌ పెరుగు రామకృష్ణ
98492 30443