
- నాలుగు రాష్ట్రాల్లో వీటి విలువ రూ.37 వేల కోట్లు
- తెలంగాణలో అధికం.. ఛత్తీస్‌గఢ్‌లో అత్యల్పం
షెడ్యూల్ ప్రకారం దేశంలో ఈ ఏడాది చివర్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవటానికి అధికార పార్టీలు, అధికారం సాధించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఎత్తులు పైయెత్తుల్లో తలమునకలై ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకోడానికి తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణాలు, మహిళలకు నగదు పంపిణీ, యువతులకు ఫోన్లు, స్కూటర్లు, తక్కువ ధరలకే గ్యాస్ సిలిండర్లు, ఇండ్ల నిర్మాణం కోసం ఆర్థిక సాయం.. ఇలా ఒకటేమిటీ.. పెద్ద సంఖ్యలో హామీలు, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలతో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయి. ఈ విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో వుంది.
న్యూఢిల్లీ : తెలంగాణతో పాటు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం. ఈశాన్య రాష్ట్రమైన మిజోరం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలు, హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇందుకోసం ఈ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రూ.37,000 కోట్ల వ్యయమయ్యే సంక్షేమ పథకాలను ప్రకటించాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో పథకాలు, కార్యక్రమాల మీద ఖర్చు చేసే విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, ఛత్తీస్‌గఢ్ అట్టడుగున ఉన్నది.
మధ్యప్రదేశ్‌లో మహిళలపై దృష్టి
ఈ ఏడాది జనవరి నుంచి మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బిజెపి సర్కారు రాష్ట్రంలోని మహిళలు, యువత ఓటర్లను ఆకట్టుకోవడానికి పలు పథకాలను ప్రవేశపెట్టింది. లాడ్లీ బెహనా పథకం వీటిలో ముఖ్యమైనది. ప్రస్తుత సంవత్సరంలో ఈ కార్యక్రమానికి కేటాయింపులు రూ.8,000 కోట్లకు పెంచింది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో కనీసం 18 స్థానాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5.4 కోట్ల మంది ఓటర్లలో 2.6 కోట్ల మంది మహిళలు ఉన్నారు. అలాగే, 12వ తరగతి టాపర్‌లకు ఉచిత స్కూటర్లు, స్టైఫండ్‌తో యువకులకు వత్తి శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ కార్యక్రమాల కోసం ప్రభుత్వం వరుసగా రూ.135 కోట్లు, రూ.1,000 కోట్లు కేటాయించింది. వీటితో పాటు ఇతర ఉచిత, సంక్షేమ పథకాలకు అధికార పార్టీ హామీలిచ్చింది.
రాజస్థాన్‌లో ఫోన్‌లు, ఎల్‌పిజి సిలిండర్లు, విద్యుత్
రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ హామీల ప్రకటనతో ముందుకెళ్తున్నది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉచిత మొబైల్ ఫోన్‌ల నుంచి ఎల్‌పిజి, విద్యుత్‌పై సబ్సిడీల వరకు పలు తాయిలాలు ప్రకటించారు. రాష్ట్ర ఖజానాపై రూ. 12,700 కోట్ల భారం పడనున్నదని అంచనా. అదనంగా, రాష్ట్ర బడ్జెట్‌లో విద్యావంతులైన పారిశ్రామికవేత్తలకు వారి వ్యాపారాలను స్థాపించడంలో ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో రూ.100 కోట్లతో యువ ఉద్దం యోజన పథకం ప్రకటించారు.
అత్యధిక వ్యయంతో అగ్రస్థానంలో తెలంగాణ
దేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ సర్కారు అనేక రకాల ఉచితాలు, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. రైతు బంధు ద్వారా రైతులకు, కేసీఆర్ కిట్ ద్వారా తల్లులు, నవజాత శిశువులకు ఆర్థిక సహాయం వంటివి అమలు చేసింది.
నిరుపేదలకు డబుల్‌బెడ్రూమ్ ఇండ్లను ప్రకటించింది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేద కుటుంబాల వధువులకు కానుకలు ఇవ్వనుంది. షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది.ఇక, వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు ఆసరా పెన్షన్ కార్యక్రమం కింద ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది.
2023-24 బడ్జెట్‌లో, రైతు బంధుకు రూ. 15,075 కోట్లు, దళిత బంధు కోసం రూ. 17,700 కోట్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం కోసం రూ. 7,890 కోట్లు కేటాయించింది. ఇక కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లకు రూ.3,210 కోట్లు కేటాయించారు. అదనంగా, పెన్షన్ పంపిణీకి రూ.12,000 కోట్లు, రైతుల రుణమాఫీ కోసం రూ.6,385.20 కోట్లు కేటాయించింది.
అంతేకాదు, మహిళా ఓటర్లు, మైనార్టీ వర్గాలను ఆకట్టుకునేందుకు మూడు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉన్న మతపరమైన మైనారిటీ వర్గాలకు చెందిన కుటుంబాలకు రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించేందుకు రూ.400 కోట్లు కేటాయించింది. సంప్రదాయ చేతివృత్తులకు చెందిన వెనుకబడిన తరగతుల లబ్ధిదారులకు మరో రూ.400 కోట్లు కేటాయింపులు చేసింది. గృహలక్ష్మి పథకం కూడా ప్రకటించింది.
తెలంగాణలో దాదాపు 55 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో దళితులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. 119 అసెంబ్లీ స్థానాల్లో 19 ఎస్సీలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఇక మైనారిటీలు రాష్ట్ర ఓటర్లలో 12.5 శాతం ఉన్నారు. 30 అసెంబ్లీ నియోజకవర్గాలపై వారు ప్రభావం చూపనున్నారు. తెలంగాణ ఓటర్లలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో వెనుకంజ
ఛత్తీస్‌గఢ్ ఈ విషయంలో వెనుకంజలో ఉంది. నిరుద్యోగ భృతి కార్యక్రమంపైనే దృష్టిపెట్టింది. యువతకు నెలకు రూ. 2,500 అందించే ఈ కార్యక్రమానికి బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించింది. కొత్త గృహనిర్మాణ పథకం, గ్రామీణ ఆవాస్ న్యారు యోజన (గ్రామీణ గహనిర్మాణ పథకం) కోసం మరో రూ.100 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద ఇచ్చే సహాయాన్ని రూ.25,000 నుంచి రూ. 50,000కి పెంచింది. రాష్ట్ర ఖజానాపై దీని భారం రూ. 89 కోట్లు. ఇంకా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు నెలవారీ గౌరవ వేతనం రూ.6,500 నుంచి రూ.10 వేలకు, రూ.3,250 నుంచి రూ.5,000లకు పెరిగింది. ఈ మార్పులకు అనుగుణంగా రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగింది.