ఇసి బ్రాండ్ అంబాసిడర్‌గా వికలాంగ గిరిజన మహిళ
నోటితో పెయింటింగ్స్ ప్రత్యేకత చాటుతున్న నర్మదియా
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని దిందోరి జిల్లా కన్నత్ గ్రామానికి చెందిన నర్మదియా అనే ప్రత్యేక ప్రతిభావంతురాలైన గోండు గిరిజన మహిళను ఎన్నికల సంఘం ఓటర్లను చైతన్యపర్చటానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. నర్మదియాకు చేతులు, కాళ్ళు లేవు, అయినప్పటికీ ఆమె నోటితో రంగుల బొమ్మలు వేస్తుంది. 33 ఏళ్ల నర్మదియా ఇప్పటికీ స్నానం, కాలకృత్యాల కోసం పూర్తిగా తన తల్లి ఇద్దరు మేనకోడళ్ళపై ఆధారపడుతోంది. అద్భుతమైన పెయింటిగ్స్ వేస్తూ కళలను నమ్ముకొని జీవినం సాగిస్తున్న నర్మదియా ఎందరికో స్ఫూర్తి అని అందుకే ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశామని దిందోరి జిల్లా కలెక్టర్ వికాశ్ మిశ్రా పేర్కొన్నారు.
మన కోసం మనమే పోరాడాలి..
ఎన్నికల సంఘం తనను అంబాసిడర్ ఎంపిక చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆమె ఓటర్ల సందేహాలను నివృత్తి చేయడంలోనూ ముందుంటున్నారు. 'మన కోసం మనమే కదలాలి. ఓటు హక్కు వినియోగించుకుందాం..' అంటూ ప్రజల్లో పోరాట స్ఫూర్తిని పెంపొందిస్తున్నారు. 'మన హక్కుల కోసం, అస్తిస్వం మనం పోరాడకపోతే ఇంకెవరు మన కోసం పోరాడుతారు' అని నర్మదియా అంటారు. 'నేను పిల్లలతో ఆడలేను కాబట్టి నేను నా నోటితో రంగులతో ఆడటం ప్రారంభించాను. గోండ్ పెయింటింగ్స్ వేస్తూ వాటిని విక్రయించి ఆత్మగౌరవంతో బతుకుతున్నా' అని ఆమె అన్నారు. ఆమె తన ఊరికి సరైన రోడ్డు నిర్మించాలని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కావాలని కోరారు.