Sep 04,2023 07:14

            విమర్శకుడిగా ఆచార్య మేడిపల్లి రవికుమార్‌ గారిది మైక్రోస్కోపిక్‌ దృష్టి. వేదిక ఎక్కాక ఆయన ఉపన్యాసం గాలి వీచినంత సహజంగా అలలా సాగిపోతుంది. చేతిలో ఏ కాగితం లేకుండా మాట్లాడగలగడం, కోట్‌ చేసే కవితల్ని తడుము కోకుండా చెప్పడం, ఏ ప్రక్రియలోనైనా విశ్లేషణ చేయగల శక్తి ... ఆయన ప్రత్యేకత. పరిశోధనా పర్యవేక్షణలో ఆయన చూపు మరీ స్పష్టం. కొన్నిసార్లు కష్టం అనిపించినా, ఆయనేమి మోహమాటానికి పోడు. ఆయన పర్యవేక్షణలో ఉన్న పరిశోధకుడిని సైతం వైవా సమయంలో ఆయన ప్రశ్నలు వేసేవారు. అదిగో, అంత పుటం పెట్టేవారు. ఆయన పర్యవేక్షణలో జరిగిన పరిశోధనలు భీముని భాగం గొప్పవి. సమగ్రాంద్ర సాహిత్య చరిత్ర నిర్మాణంలో ఆరుద్రతో కలిసి పని చేసిన అనుభవం వారిది.
           కేవలం కాలక్షేపం కోసమో, సామాజిక హౌదా కోసమో, బిరుదులు, అవార్డులు పొందడం కోసమో కలం పట్టుకునేవాడు ఆధునిక కవి కాడు అనేది రవికుమార్‌ అభిప్రాయం. సమాజం పట్ల బాధ్యత, విధానాల పట్ల ఒక స్పష్టత కలిగి ఉండడం ఆధునిక కవి ప్రధాన లక్షణం అని ఆయన భావిస్తారు. ఆధునిక, ప్రాచీన కవిత్వాన్ని చాలా ప్రత్యేకమైన చూపుతో అంచనా వేయగలరు. అనేక తూకాలు లోలోపల ఆయనే వేసుకుని ఒక నిర్ధారణ చేస్తారు.
           వస్తు వైవిధ్యం లోతుగాను, శిల్ప వైశిష్ట్యం ఎత్తుగాను ఉండాలని ఆయన ఆశిస్తారు. అంతర్మధనంలో ఒక వస్తువు నలుగుతున్నంతవరకు, అది రూపం సంతరించుకునేంతవరకు స్వీకరించింది, ఏదైనా అది కవి సొంతం. అది ఒక ఆకృతిని పొందాక, కావ్యలోకంలోకి కాలు మోపాక దానిని తర్వాత పాఠకుడు పర్యావలోకిస్తాడు అని గట్టిగా నమ్ముతారు. పూటకో మాట మాట్లాడే, సామాజిక బాధ్యత వహించని కవులను నిర్లక్ష్యం చేయమంటారు. సామాజిక ప్రయోజనాన్ని ఆశించి కలం పట్టిన కవుల్లో వైవిధ్యం ఉండొచ్చు గానీ అంతర్‌ వైరుధ్యాలు ఉండకూడదు అని అంటారు.
అనేక సభల్లోనూ సమావేశాల్లోనూ మానవ సంబంధాల పతనం, సాంస్క ృతిక విధ్వంసం, ఆటపాటలను హైజాక్‌ చేసిన వస్తు సంస్కృతులు, సామ్రాజ్యవాదం, పరాయికరణ గురించి రవికుమార్‌ మాట్లాడారు. ఆ కాలంలో వెలువడ్డ కథల్ని, కవితల్ని, నవలల్ని విశ్లేషిస్తూ ఆయన చేసిన ప్రసంగాలు అద్భుతమైనవి. ప్రపంచీకరణ నేపథ్యంలో 'పొగ చూరిన ఆకాశం - అద్దేపల్లి విజన్‌' అనే 23 పేజీల వ్యాసంలో చాలా కీలకమైన విషయాలు ఆయన చర్చించారు.
            ''మనుషుల కంటే, మానవీయ విలువల కంటే వస్తువులకు, సరుకులకు ప్రాధాన్యం ఇవ్వడం, ఎక్కువగా వాటి మీదనే వ్యామోహం పెంచుకోవడం, మధ్య తరగతి జీవితాల్లో కూడా ఈనాడు ప్రవేశించింది. ఎవరైనా అతిథులు తమ ఇళ్లకు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులను కాక ఇంట్లోని టీవీలను, ఫ్రీజ్‌లను, సోఫాలను, డైనింగ్‌ టేబుళ్లను పరిచయం చేయడం జరుగుతోంది. వస్తు వ్యామోహ సంస్కృతి అంటే ఇదే అని..'' రవికుమార్‌ చాలా సులభంగా ప్రపంచీకరణ పర్యవసనాలను తెలియజేస్తారు.
            ''మన ఎన్నుకున్న నాయకులు మన ప్రజాస్వామ్య దేశాన్ని పరిపాలిస్తున్నారని మనం అనుకుంటాం. కానీ వీళ్లంతా సామ్రాజ్యవాదం గుప్పెట్లో పెట్టుకున్న కీలుబొమ్మలు మాత్రమే! మనం కేవలం ప్రేక్షకులం. ఈ విషయం తెలియకుండా ఉంచడమే ప్రపంచీకరణ ప్రధాన లక్షణం. ప్రజల్ని కుహనా సంస్కరణ భ్రమల్లో ముంచి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ ప్రపంచీకరణ విధానాల అసలు రంగు సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు. లాభాలను కూడపెట్టుకునే వారికి తెలిసినా తెలియనట్లు నటించొచ్చు. కానీ, మేధావులైన కవులు, కళాకారులు, రచయితలు ఈ పరిణామాలన్నిటినీ గమనిస్తూ దేశ ప్రజలను జాగృతం చేయాలి.'' అని రవికుమార్‌ అనేక సభల్లో పిలుపునిచ్చారు.
          'ఈనాటి సినిమా పాట స్వభావాలు -ప్రభావాలు' (ప్రజాసాహితి- జూన్‌-2006) అనే వ్యాసంలో సినిమా కళ కూడా పాలకవర్గాలకు, పెట్టుబడిదారీ వర్గాలకు అనుకూలంగానూ, ప్రజా వ్యతిరేక కళారూపంగానూ మారడం ప్రపంచీకరణలో భాగమే అని వివరించారు. ప్రపంచీకరణ ప్రభావం సినిమా రంగంపై ఎలా పడిందో సోదాహరణంగా వివరించారు. సర్దార్‌ పాపారాయుడు సినిమాలోని '1980 వరకు ఇట్లాంటి ఒక పిల్ల నా కంట పడలేదు' అనే పాట, 2002లో జూనియర్‌ ఎన్టీఆర్‌ 'రెండు వేల రెండు వరకు చూడలేదే ఇంత సరుకు' అని మారింది. అక్కడి పిల్ల ఇక్కడ సరుకు కావడమే ప్రపంచీకరణ' అని నివ్వెరపోయే స్టేట్మెంట్‌ ఇస్తారు రవికుమార్‌. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాలోని అబ్బనీ తీయని దెబ్బ అనే పాటలో పురుషాదిక్యపు భావజాలం ఎలా ఉందో చూపుతారు. నరసింహ నాయుడు సినిమాలోని 'లక్స్‌ పాపా లక్స పాపా లంచ్‌ కొస్తావా' అనే పాటలో 'నీ సోకులన్నీ లీజు కిస్తావా' అని అడగడం.. లీజ్‌ అనేది వ్యాపార సంస్కృతికి చెందిన మాటని వివరిస్తారు. వ్యాపార సంబంధాలు పెనవేసుకొని పోవడం ప్రపంచీకరణ భావజాలంలోని పరాకాష్ట దశగా చూడాలని ఆయన చెప్పారు.
సాహితీ స్రవంతి ప్రచురించిన 'గమనం' సాహిత్య ప్రత్యేక సంచికలో ఆయన 'తెలుగు కవిత్వంలో మిథోపోయి' అనే వ్యాసంలో చాలా సమగ్రమైన విశ్లేషణ చేశారు. మైథాలజీ గాథలకి, మిథోపోయికి ఉండే భేదాన్ని స్పష్టంగా చెప్పారు. తెలుగు కవిత్వ ఉద్యమాల్లో మిథో పోయి పద్ధతి ఎలా ఉందో ఉదాహరణలు చూపారు. అంబేద్కర్‌ దళిత తాత్వికతను గురించి ఆయన అనేక సందర్భాల్లో మంచి వ్యాఖ్యానాలు చేశారు. ''కులరహిత సమాజం గురించి అంబేద్కర్‌ చేసిన హితబోధ దళిత వర్గాల్లో మాత్రం కొంత చైతన్యం కలిగించింది. ఇతరులు అంబేద్కరుని ఇంకా అందుకోలేదు. విద్యావంతుల కొందరు గుర్తించినా అంబేద్కర్‌ను దళితోద్ధారకుడిగానే పరిగణిస్తున్నారు. ఏ సంస్కృతి దళిత జాతిని వివక్షకు గురి చేస్తూ ఉందో ఆ సంస్కృతిలో ఉన్నంతకాలం దళిత జాతి వివక్ష నుంచి విముక్తి కాలేదన్నది అంబేద్కర్‌ ఆలోచన. అందుకే ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించుకోవాలని అంబేద్కర్‌ సూచన. ఈ తాత్విక అంశాన్ని దళిత కవిత్వం రాసే కవులు గుర్తించాలని రవికుమార్‌ అంటారు.
           కొన్ని కథలు, నవలలకు తాను రాసిన ముందుమాటల్లో కథ, నవల నిర్మాణం గురించి రవికుమార్‌ కొన్ని మంచి ప్రతిపాదనలు చేశారు. విఆర్‌ రాసాని 'చీకటి ముడులు' నవలకు ముందుమాట రాస్తూ- ''శాస్త్రీయత వాస్తవికత వంటి అంశాలు ఏ రచనకైనా దాని ఆయువు పట్టుకు ప్రమాణాలు. నవల, కథానిక వంటి కల్పనా సాహిత్యంలో శాస్త్రీయత కోసం అన్వేషించడం అత్యాశ అవుతుంది. అయితే వాస్తవికత అనేది మాత్రం ఈ ప్రక్రియలకు ప్రాణవాయువు వంటిద'ని అన్నారు. వడ్డెర చండీదాస్‌ నవల అనుక్షణికం గురించి ప్రజాసాహితి మే 2005లో రాసిన వ్యాసంలో - చండీదాస్‌ నిజమైన అస్తిత్వవాద రచయిత ఎందుకు కాలేకపోయాడో చర్చించారు. 'ప్రయోగం కోసం ప్రయోగం చేయకూడదు. అలా చేసిన రచనలు నిర్జీవ ప్రతిమల్లా సాహిత్య మ్యూజియాలకు పరిమితం అవుతాయి. ప్రయోగం కోసమే ప్రయోగాత్మకంగా చేసిన రచనలు తెలుగులో కొన్ని వెలుబడ్డాయి. చండీదాస్‌ అనుక్షణికం కూడా ఈ కోవకు చెందిందే. సామాజిక జీవితానికి దూరంగా ఉండేవాడు అస్తిత్వవాద రచయిత కాలేడు'' అని రవికుమార్‌ పేర్కొన్నారు. జాతశ్రీ 'కుట్ర' కథాసంపుటికి, శిరంశెట్టి కాంతారావు 'కంచి మేకలు' కథా సంపుటికి రాసిన ముందుమాటల్లోనూ, వివిధ సందర్భాల్లో కథల మీద ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు లోతైన చూపుతో చర్చించారు. ''రచయితను కుదిపిన ప్రతి అంశమూ కథా వస్తువు కాలేదు. వస్తు స్వభావాన్ని బట్టి అది తాను ఇమిడిపోయే ప్రక్రియను నిర్ణయించుకుంటుంది. రచయితలు తమ రచనల ద్వారా పాఠకుల్లో ఉండే సెంటిమెంట్లను, మూఢ విశ్వాసాలను, బలహీనతలను బలహీనం చేయాలి గాని వాటికి బలం పెంచకూడదు. సాధారణంగా కథను ఒక ఊపులో చదవగలగాలి. భాష విషయంలో కథా రచయిత లోభివాడిలాగా వ్యవహరించాలి. ప్రచురణకర్తలు పొరపాటున ఒక్క మాటను అచ్చు వేయకపోయినా పాఠకుడికి ఆ కథ అర్థం కాకూడదు. కథలో కూర్పు అంత చిక్కగా ఉండాలి.'' అని కథ గురించి చక్కని అవగాహన ఇచ్చారు. అరసం ప్రచురించిన హిమాయత్‌ గారి కథా సంపుటికి ముందుమాట రాస్తూ, ఇలా అన్నారు : ''కుల పీడన, ఆర్థిక దోపిడీ అనేవి ఈనాటి వర్గ శత్రువుకున్న రెండు ప్రధాన లక్షణాలు. ఏ ఒక్కదానితోనో పోరాడితే అది తాత్కాలిక విజయమో, పాక్షిక విజయమో అవుతుంది. ఏకకాలంలో ఈ రెంటిపైనా యుద్ధం ప్రకటిస్తేనే సంపూర్ణ విజయాన్ని సాధించగలం.''
          రవికుమార్‌కి ఏ అంశం ఇచ్చినా అందులో ఎవరూ చూడని ప్రత్యేక కోణం చూస్తారు. ఆయన విశ్లేషణ, విమర్శ విన్నాక ఈ కోణంలో మనమెందుకు ఆలోచించలేకపోయామని అనుకుంటాం. రవికుమార్‌ మాట్లాడడానికి చూపేంత ఉత్సాహం ఎందుకనో రాయడానికి చూపరు. అందువల్లనే ఆయన వివిధ సమావేశాల్లో, సభల్లో, సదస్సులో చేసిన ప్రతిపాదనలు, లోతైన కోణాలు చాలావరకు గాలిలో కలిసిపోయాయి. ఇప్పటికైనా అందుబాటులో ఉన్న ఆయన ముందుమాటలు, వ్యాసాలు, ఆన్‌లైన్‌ ప్రసంగాలను ప్రచురణ రూపంలోకి తీసుకురావడం ఉపయోగకరమని సాహితీ ప్రియుల అభిలాష.

(ఈనెల 9న ఆచార్య మేడిపల్లి రవికుమార్‌ గారికి కాకినాడలో అద్దేపల్లి విమర్శక పురస్కారం అంద్సిఉ్తన్న సందర్భంగా)
- డాక్టర్‌ సుంకర గోపాల్‌
94926 38547