
సూర్యోదయం చీకటిగానూ
చీకటి పండువెన్నెలగానూ
వెన్నెలకాంతులు శూన్యమై
ఎడతెరపిలేని జడివానలా కురుస్తున్నాయి
వొక యుగారంభ భ్రాంతి
ఆశయాల పొరల్ని చీల్చుకొస్తుంది
మూగరోదనెల్నో ఆకాశం నిండా పరచుకున్నాయి
ఎన్నో జలపాతాల్ని వొక్కబిందువుగా చేసి
గుండెనిండా నింపుకున్నాను.
కాంతిపొరలు రెటీనాలా తనువును కప్పి
అగ్నిపర్వతపు లావా లాంటి
ఉద్వేగాల్ని ప్రవహింపజేస్తున్నాయి
నిజాల నిప్పుల నడకే కదా జీవితమంటే..!
అబద్ధాల అద్దాల మేడల్లో
జీవనచిత్రాలన్నీ మసకబారుతున్నాయి.
ఆయువును బంధించి ఆశల ఆలింగనాల్ని
గాలి చొరబడనంతా చేసుకుందామంటే
తడారని సప్తవర్ణఛాయలు వెక్కిరిస్తున్నాయి.
మనోనేత్రం నిండా ఉషస్సుల్లాంటి వెలుగుల జిలుగులు
దేహం నిండా ఆవరించాయి.
వాలిచేసిన మోసం
శంభూకుడెందుకు చేయలేదో!
ఇప్పటికీ మనసులో ప్రవల్లికగానే
మిగిలి ముద్రితమైంది.
విధిరాత తలరాత లాంటి అశాస్త్రీయ విభజనరేఖలు
ప్రయాణం నిండా కంటకాలై పరచుకున్నాయి..
నిట్టూర్పు కొన్నిసార్లు
మధురంగానూ ఉంటుంది.
మది తేలిక పడే కొద్ది
సంక్లిష్టతలూ తేలికయ్యాయి..
కాలం ఎన్ని దోబూచులాడినా
రెప్పలసవ్వడి హెచ్చరిస్తూనే వుంటుంది.
అందుకే క్షణక్షణం పునీతమవ్వడానికి సంసిద్దుడౌతూనే వుంటాను..
- కెంగార మోహన్