
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : దేశంలో మురుగు కాలవలను శుభ్రం చేసే కార్మికులు (మాన్యువల్ స్కావెంజర్స్) పని ప్రదేశాల్లో మరణిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మురుగు కాల్వలను శుభ్రం చేసే సమయంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. మాన్యువల్ స్కావెంజర్ల మరణాలపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారించిన బెంచి శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. శాశ్వత అంగ వైకల్యం సంభవించిన వారికి కనీస నష్టపరిహారంగా రూ.20 లక్షలు చెల్లించాలని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన బెంచ్ ఆదేశించింది. మాన్యువల్ స్కావెంజింగ్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరింది. ఒకవేళ మురుగును శుభ్రం చేసే సమయంలో ఆ వ్యక్తి ఇతరత్రా వైకల్యం పొందితే రూ.10 లక్షలు చెల్లించాలని జస్టిస్ భట్ తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సంస్థలు సమన్వయంతో వ్యవహరించాలని బెంచ్ ఆదేశించింది. మురుగు కాలవల మరణాలకు సంబంధించిన కేసులను హైకోర్టులు కూడా పర్యవేక్షించవచ్చని తెలిపింది. గత ఐదేళ్లలో దేశంలోని పలు రాష్ట్రాల్లో మురుగు కాల్వలను, సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రం చేస్తూ 347 మంది స్కావెంజర్లు మరణించారు. 2022లో లోక్‌సభలో కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం... ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడులోనే 40 శాతం మరణాలు సంభవించాయి. 2013, 2018లో నిర్వహించిన సర్వేల ప్రకారం దేశంలో 58,098 మంది మురుగు కాలువలను శుభ్రం చేసే పనిలో కొనసాగుతున్నారని కేంద్రప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. మాన్యువల్ స్కావెంజింగ్‌పై నిషేధం ఉన్నందున ఆ వృత్తిలో కొనసాగుతున్న వారికి పునరావాసం కల్పించాలని చట్టం చేశారు. అయినప్పటికీ నేటికీ ఆ వృత్తి కొనసాగుతుండటం, ఏటా వందలాది మంది మరణించడం విషాదం.