విద్యారంగ నిపుణులతో చర్చించకుండా, ఉన్నత విద్యామండలి చేస్తున్న ఏకపక్ష నిర్ణయాలు విద్యార్థులకు నష్టాన్ని కలుగచేస్తున్నాయి. యూనివర్శిటీలలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న కామన్ ఎంట్రెన్స్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న 'ఆన్‌లైన్ అడ్మిషన్ల' విధానం వలన పేద విద్యార్థులు నష్టపోతున్నారు. ఇటీవల ఉన్నత విద్యామండలి ఏకపక్షంగా, ఎటువంటి సంసిద్ధత లేకుండా డిగ్రీని నాలుగేళ్ల ఆనర్స్ కోర్సుగా చేయటమే కాకుండా, మూడు సబ్జెక్టుల విధానం రద్దు చేసి, మేజర్/ మైనర్ సబ్జెక్ట్ విధానం ప్రవేశపెట్టింది. అడ్మిషన్లు బాగా తగ్గిపోయాయి. ఉన్నత విద్యామండలి ధోరణి, పని తీరు పూర్తిగా మారాలి.
భారతదేశంలో ఆర్థిక సంస్కరణల తరువాత ఉన్నత విద్యారంగంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉన్నత విద్యారంగంలో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరిగింది. 2022 నాటికి దేశంలో వున్న 950 యూనివర్శిటీలలో 51 శాతం ప్రైవేట్, డీమ్డ్ యూనివర్శిటీలే. విద్యార్థి నమోదు నిష్పత్తి (జి.ఇ.ఆర్) 26 శాతం ఉన్నప్పటికి చైనా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలతో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉన్నది. స్థూల నమోదు నిష్పత్తి దళితులలో 18.5 శాతం, గిరిజనులలో 13.3 శాతం మాత్రమే ఉన్నది. రాష్ట్రాల మధ్య కూడా చాలా తేడాలు ఉన్నాయి. ఉన్నత విద్యలో విస్తరణ - నాణ్యత - సామాజిక న్యాయం మధ్య సమతుల్యత ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ - విశ్వవిద్యాలయాలు
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఆంధ్రా యూనివర్శిటీ 1926లో ఏర్పడి మరో మూడేళ్ళలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నది. జిల్లాకి ఒక యూనివర్శిటీ ఉండాలినే నేపథ్యంలో యోగి వేమన, నన్నయ్య, విక్రమ సింహపురి, రాయలసీమ వంటి యూనివర్శిటీలు ఏర్పడ్డాయి. ఈ యూనివర్శిటీల్లో గత 15 ఏళ్ళుగా రిక్రూట్‌మెంట్ లేకపోవటంతో 'అకడమిక్' క్షీణత ప్రారంభమైంది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు ప్రస్తుతం 4 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. కొన్ని చోట్ల కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిలో అధ్యాపకులు పని చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉన్నది. వైస్ చాన్సలర్లు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల నియామకం పూర్తి రాజకీయ కోణంలోనే జరుగుతూ 'అకడమిక్' నిపుణతకు ప్రాధాన్యత లేకుండా పోయింది.
ప్రైవేట్ యూనివర్సిటీలు
రాష్ట్రంలో బ్రౌన్‌ఫీల్డ్ యూనివర్శిటీల పేరుతో గీతం, కోనేరు లక్ష్మయ్య, విజ్ఞాన్, విట్, ఎస్.ఆర్.ఎమ్, అమృత, మోహన్ బాబు, అపోలో మొదలైన ప్రైవేట్, డీమ్డ్ యూనివర్శిటీలు పనిచేస్తున్నాయి. ఈ యూనివర్శిటీలలో టెక్నాలజీ కోర్సులు మాత్రమే ఉంటాయి. రిజర్వేషన్లు ఉండవు. ఫీజులపై, చేర్చుకునే విద్యార్థుల సంఖ్యపై పరిమితి లేదు. ప్రభుత్వ నియంత్రణ లేదు. రాష్ట్రంలో గల 280 ఇంజనీరింగ్ కాలేజీలు 200 ఎమ్.బి.ఏ, ఎం.సి.ఏ కాలేజీలు, 150 బి-ఫార్మసీ కళాశాలల్లో 90 శాతం ప్రైవేట్ కాలేజీలే. వీటిలో విద్యా ప్రమాణాలపై తనిఖీ యంత్రాంగం లేదు.
ఉన్నత విద్యామండలి పనితీరు
రాష్ట్రంలో ఉన్నత విద్యారంగ కార్యకలాపాలను సమన్వయ పరచటానికి, పర్యవేక్షించటానికి ఉన్నత విద్యామండలి ఏర్పడి పని చేస్తున్నది. అయితే, విద్యారంగ నిపుణులతో చర్చించకుండా, ఉన్నత విద్యామండలి చేస్తున్న ఏకపక్ష నిర్ణయాలు విద్యార్థులకు నష్టాన్ని కలుగచేస్తున్నాయి. యూనివర్శిటీలలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న కామన్ ఎంట్రెన్స్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న 'ఆన్‌లైన్ అడ్మిషన్ల' విధానం వలన పేద విద్యార్థులు నష్టపోతున్నారు. ఇటీవల ఉన్నత విద్యామండలి ఏకపక్షంగా, ఎటువంటి సంసిద్ధత లేకుండా డిగ్రీని నాలుగేళ్ల ఆనర్స్ కోర్సుగా చేయటమే కాకుండా, మూడు సబ్జెక్టుల విధానం రద్దు చేసి, మేజర్/ మైనర్ సబ్జెక్ట్ విధానం ప్రవేశపెట్టింది. అడ్మిషన్లు బాగా తగ్గిపోయాయి. ఉన్నత విద్యామండలి ధోరణి, పనితీరు పూర్తిగా మారాలి.
ప్రాధాన్యత కోల్పోతున్న శాస్త్రాలు
ఉన్నత విద్య ద్వారా సమాజానికి అవసరమైన అన్ని శాస్త్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు, జీవ శాస్త్రాలు ప్రాధాన్యత కోల్పోయాయి. కేవలం టెక్నాలజీ కోర్సులకే ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఈ ధోరణిని ప్రోత్సహిస్తున్నాయి. మానవులు కేవలం సాంకేతిక నిపుణులు, వస్తువుల ఉత్పత్తిదార్లు మాత్రమే కాదు. మానవులు చరిత్రను సృష్టించే సామాజిక, చారిత్రక జీవులు కూడా. మానవ సమాజంలోని విలువలు, నాగరికత, సామాజిక సంబంధాల పట్ల మనిషికి అవగాహన అవసరం. ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో విశ్వవిద్యాలయాలలో అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసే విధంగా చర్యలు చేపట్టాలి.
ప్రమాణాలు కోల్పోతున్న డిగ్రీ కళాశాలలు
రాష్ట్రంలో 1353 డిగ్రీ కాలేజీల్లో 1080 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలే. 152 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉండగా అందులో 50 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎంతో చరిత్ర కలిగిన ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు ప్రభుత్వాలు అనుసరించిన విధానం ఫలితంగా గత 2 సంవత్సరాలలో 70 కాలేజీలు అన్-ఎయిడెడ్ కాలేజీలుగా మారాయి. మిగిలిన 50 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలలో కొద్ది సంఖ్యలో మాత్రమే ఎయిడెడ్ సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేయటం, తగిన మౌలిక వసతులు లేకపోవడం వలన చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది.
ఫీజు రీఎంబర్స్‌మెంట్ సమస్యలు
పేద విద్యార్థులు, ముఖ్యంగా దళిత, గిరిజన, బి.సి. విద్యార్థులు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. జీవో నెం 77 జారీ చేసి....డిగ్రీ తరువాత పి.జి కోర్సులు ప్రైవేట్ సంస్థలలో చేస్తే ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ ఉండదు అని ప్రకటించటంతో వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు. జీవో నెం 77 రద్దు చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలలో ఖాళీలన్నింటిని భర్తీ చేయాలి. యూనివర్శిటీలలో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ప్రైవేట్ యూనివర్శిటీలపై నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పరచాలి. డిగ్రీ కళాశాలలను పటిష్ట పరచాలి. జీవో నెం 77 రద్దు చేయాలి. సామాజిక, మానవీయ, జీవ శాస్త్రాలకు ప్రాధాన్యత కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపరచాలి.
(వ్యాసకర్త శాసనమండలి సభ్యులు,
సెల్ : 8309965083) కె.ఎస్.లక్ష్మణరావు