Sep 15,2023 10:18
  • దొనకొండ వద్ద పరిశ్రమల కేంద్రం తీరు
  • తొమ్మిదేళ్లుగా పరిశ్రమల స్థాపన ఎండమావి

ప్రజాశక్తి - ఒంగోలు బ్యూరో : ఒక బోర్డు.. ఒక రోడ్డు.. దొనకొండ పరిశ్రమల కేంద్రంలో ఇప్పుడు ఇవే మిగిలాయి. ఇక్కడ పరిశ్రమల కేంద్రం ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ తొమ్మిదేళ్లు గడిచినా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఒక్కరికీ ఉపాధి లభించలేదు. పరిశ్రమలు ఎండమావిగా మారాయి. ఇక్కడ రాజధాని పెట్టాలని శ్రీకృష్ణ కమిషన్‌ కూడా ఈ ప్రాంతంలో పర్యటించింది. రాజధానికి అనుకూలమంటూ సిఫార్సు కూడా చేసింది. అయితే అమరావతిని రాజధానిగా ప్రకటించిన తెలుగుదేశం ప్రభుత్వం దొనకొండను భారీ పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఐదేళ్లూ ప్రకటనలతోనే సరిపెట్టింది. అప్పుడు మంత్రిగా ఉన్న శిద్దారాఘవరావు ఇక్కడ పరిశ్రమల కోసం కొంత ప్రయత్నం చేశారు. కనీస సౌకర్యాల దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. నీరు, కరెంటు ఏర్పాటు చేయడం, పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీలతో ఒప్పందాలు, ప్రోత్సాహకాలు వంటివి ఏమీ లేవు. కొందరు ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చినా ఆచరణలో అవేవీ జరగలేదు. దీంతో దొనకొండ పరిశ్రమల కేంద్రం కాగితాలపైనే ఉంది. ప్రచారం తప్ప ఆచరణలో పరిశ్రమల స్థాపనకు ఒక్క అడుగు కూడా పడలేదు.
 

                                                                  భారీగా ప్రభుత్వ భూములు

ఒక దొనకొండ మండలంలోనే అదీ రెండు మూడు గ్రామాల పరిధిలో 25 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ పరిశ్రమలకు ఏటువంటి ఇబ్బందులు లేవు. గుంటూరు-గుంతకల్లు రైల్వేలైను, రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి ఎయిర్‌పోర్టు కూడా ఉంది. పరిశ్రమలకు ముడిసరుకు తెచ్చుకోవడంతో పాటు ఉత్పత్తులను ఇక్కడి నుంచి సులువుగా తరలించడానికి అన్ని రకాలుగా రవాణా మార్గం ఉంది. ఇన్ని అనుకూలతలున్నా ఇక్కడ పరిశ్రమలపై కేంద్రం గానీ, రాష్ట్రం గానీ పెద్దగా దృష్టి పెట్టలేదు.
 

                                                               విదేశీ కంపెనీల ప్రతినిధులు వచ్చినా..

గత ప్రభుత్వ హయాంలో కొన్ని కంపెనీల ప్రతినిధులు ఇక్కడ భూములను చూసేందుకు వచ్చారు. హెలికాప్టర్ల విడిభాగాల తయారీ కేంద్రం పెడతామని ఉక్రెయిన్‌ దేశ ప్రతినిధులు విచ్చేశారు. వారికి అధికారులు దగ్గరుండి మరీ భూములను చూపించారు. మల్లంపేట, కొచ్చర్లకోట గ్రామాల్లో భూములను చూసి వెళ్లారు. అయితే ఆ కంపెనీతో ఒప్పందాలు గానీ, చర్చలు గానీ మళ్లీ జరపలేదు. రుద్రసముద్రం వద్ద ప్రభుత్వ రంగంలోనే 1000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ తయారీ కేంద్రాన్ని పెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం రెండు వేల ఎకరాలు భూమి కేటాయించాలని నిర్ణయించారు. అయితే భూపట్టాలు ఇవ్వకపోయినా ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న ఈ భూములను సాగు చేసుకుంటున్న రైతులు అడ్డుకున్నారు. వారికి ఏదో రూపంలో కొంత సాయం చేసి ఒప్పించే చర్యలు తీసుకోలేదు. దీంతో సోలార్‌ పరిశ్రమ కూడా అట్టకెక్కింది.
 

                                                                 43 ఎకరాల్లో ఎపిఐఐసి ప్లాట్లు

ఇక్కడ మొత్తం 25 వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములున్నాయి. ఎపిఐఐసికి 1450 ఎకరాలు అప్పటి ప్రభుత్వం అప్పగించింది. ఈ భూములలో కేవలం 43 ఎకరాల్లో ఒక రోడ్డు వేశారు. కొన్ని అడ్డరోడ్లు వేసి ప్లాట్లుగా విభజించారు. చిన్నచిన్న పరిశ్రమలు ఎవరైనా పెట్టుకునేందుకు ముందుకు వస్తే వాటిని కేటాయిస్తామని అధికారులు చెప్పారు. గ్యాస్‌ సిలిండర్లు తయారుచేసేందుకు ఓ కంపెనీ రాగా.. వీరికి 45 ఎకరాలు కేటాయించారు. ఈ భూములను చదునుచేసుకున్నారు. అంతటితో వదిలేశారు. గ్యాస్‌ సిలిండర్ల తయారీ పరిశ్రమ కూడా రాలేదు. వైసిపి ప్రభుత్వం వచ్చాక దొనకొండ సంగతే మరిచింది. దీనిపై చర్చ ముందుకు వస్తే తామేమీ అక్కడ పరిశ్రమలు పెడతామని ఎన్నికల్లో చెప్పలేదని వైసిపి నేతలు అంటున్నారు. అసెంబ్లీలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ కూడా దీనిపై మాట్లాడారు. దొనకొండను పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో ఆయన కూడా మనకెందుకులే అన్నట్లుగా వదిలేశారు.