Oct 25,2023 09:30

కైరో : అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను నిరంతరంగా పెంచడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈజిప్ట్‌ ఆర్థికవేత్త ఒకరు వ్యాఖ్యానించారు. మరీ ముఖ్యంగా వర్ధమాన దేశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. గతేడాది మార్చి నుండి వరుసగా 11సార్లు ఫెడ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను పెంచింది. 5.25శాతం నుండి 5.50శాతం మధ్య ఈ పెంపు వుంది. దీంతో 22ఏళ్ళలో ఎన్నడూ లేనంత అధిక స్థాయికి వడ్డీ రేట్లు వెళ్ళిపోయాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలనే లక్ష్యంతో పెంచుతున్నామని చెబుతున్నప్పటికీ వార్షిక ద్రవ్యోల్బణం రేటు సెప్టెంబరులో 3.7శాతంగా వుంది. ఫెడ్‌బ్యాంక్‌ పెట్టుకున్న లక్ష్యం 2శాతమే. 'అమెరికా ఇలా వరుసగా వడ్డీరేట్లు పెంచడం వల్ల వర్ధమాన దేశాలు ఇబ్బందుల్లో పడతాయని, మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని ఈజిప్టియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ పొలిటికల్‌ ఎకానమీకి చెందిన సభ్యుడు వలీద్‌ గబల్లా వ్యాఖ్యానించారు.