
భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ఇకలేరన్న వార్త యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పేదల ఆకలిదప్పులు తెలిసిన మహానీయుడు, రైతుబాంధవుడు, మహిళా అభ్యున్నతికి పాటుపడిన కృషీవలుడు దూరమయ్యారని తెలిసి నేలతల్లి సైతం కంటతడి పెట్టిందన్న భావోద్వేగ వర్ణనలు అతిశయోక్తులు కావు. దేశాన్ని 'ప్రపంచ బెగ్గింగ్ బౌల్' వంటి అవమానకర పరిస్థితుల నుంచి 'ప్రపంచ బ్రెడ్‌బాస్కెట్'గా తీర్చిదిద్దడంలో స్వామినాథన్ కృషి ఎంతో శ్లాఘనీయం. 1943 నాటి బెంగాల్ డొక్కల కరువు పరిస్థితులకు స్వామినాథన్ చలించిపోయారు. ఆయన కుటుంబమంతా వైద్య వృత్తిలో స్థిరపడినా..వ్యవసాయ పరిశోధనలపై దృష్టి సారించి ప్రపంచ ప్రఖ్యాత అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాంగ్‌తో కలిసి భారత్ పరిస్థితులకు, వాతావరణానికి అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాల సృష్టిలో అమోఘమైన పాత్ర పోషించారు. ఆహార కొరతతో తల్లడిల్లిన పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించి ఆహార స్వయం సమృద్ధి, నిల్వ, ధాన్యాల ఎగుమతి చేసే దిశగా పట్టాలెక్కించారు. ఇదే మన దేశంలో హరిత విప్లవానికి పునాది వేసింది.
పొలాల్లో అధిక దిగుబడులను సాధించడానికి మాత్రమే ఆయన కృషిని పరిమితం చేయలేదు.. ప్రపంచ పేదల ఆకలి గిన్నెల నిండా ఆహారం నింపాలని సంకల్పించిన మహనీయుడు స్వామినాథన్. ఆ తపనే ఆయనను గొప్ప శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, దౌత్యవేత్తగా, పర్యావరణవేత్తగా అన్నింటికి మించి గొప్ప మానవతావాదిగా తీర్చిదిద్దింది. భారత్‌లోనే కాకుండా ప్రపంచ జనుల ఆకలి తీర్చడంలోనూ శ్లాఘనీయమైన పాత్ర పోషించినందుకు 1987లో తొలి ప్రపంచ ఆహార పురస్కారం ఆయను వెత్కుకుంటూ వచ్చింది. ఈ బహుమతి కింద లభించిన దాదాపు రూ.1.67 కోట్ల (2 లక్షల డాలర్లు) మొత్తంతో భావి తరాలకు పరిశోధనల ఫలాలను అందించాలనే తలంపుతో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్) నెలకొల్పడం ఆయన నిస్వార్థతకు అద్దం పడుతుంది. 'పర్యావరణ హితం, పేదల అభ్యున్నతి, మహిళాభ్యున్నతి' లక్ష్యాలతో గ్రామీణాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి విధానాలకు రూపకల్పన చేయడంలో ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్ ఎనలేని సేవలందిస్తూ దేశంలోనే అగ్రగామి పరిశోధన సంస్థగా నేడు పరిఢవిల్లుతోంది. ప్రఖ్యాత టైమ్స్ పత్రిక '20 శతాబ్దిలో ఆసియాలో అత్యంత ప్రభావశీలుర జాబితా'లో భారత్ నుంచి మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ టాగుర్‌తో పాటు స్వామినాథన్‌కు మాత్రమే చోటు దక్కింది. మరో రెండేళ్లలో నిండు నూరేళ్లు పూర్తి చేసుకోనున్న ఆయన జీవితాంతం వ్యవసాయ పరిశోధనలు, ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణ, రైతులు, పేదలు, మహిళల జీవితాలను మెరుగుపర్చేందుకే పరితపించారు.
శాస్త్రవేత్తలు, పాలకులు, రైతుల మధ్య సమర్థవంతమైన సమన్వయంతోనే వ్యవసాయాభివృద్ధి సాధ్యపడుతుందని స్వామినాథన్ నిర్దేశించారు. వ్యవసాయ రంగ సంక్షోభం, రైతు ఆత్మహత్యలపై అధ్యయనం కోసం 2004లో నియమించిన జాతీయ వ్యవసాయ కమిషన్‌కు నేతృత్వం వహించిన ఆయన రెండో హరిత విప్లవానికి అసరమైన ప్రతిపాదనలు సమర్పించారు. వ్యవసాయోత్పత్తుల నిల్వ, మార్కెట్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడంతో పాటు నీటి పారుదల, సాగు పెట్టుబడులు, పంటల బీమా, రుణ సహాయం వంటివి విస్తరింపజేయాలని సూచించారు. ప్రధానంగా రైతు కుటుంబ శ్రమ విలువను జత చేసి సమగ్ర సాగు ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి (సి2+50) కనీస మద్దతు ధర పంటలకు అందిస్తేనే రైతన్న మనుగడ సాధ్యమని ఘోషించారు. ప్రస్తుతం కేరళలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి ప్రభుత్వం.. గతంలో త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లోని వామపక్ష ప్రభుత్వాలు మాత్రమే వ్యవసాయాభివృద్ధికి స్వామినాథన్ మార్గంలో కృషి చేశాయి. కానీ స్వామినాథన్ సూచించిన ఫార్ములాతోనే కనీస మద్దతు ధర కల్పిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన బిజెపి అన్నదాతలను నిలువునా వచించింది. చరిత్రాత్మక రైతు మహోద్యమంలోనూ చట్టబద్ధమైన ఎంఎస్‌పి కల్పనే ప్రధాన డిమాండ్‌గా ముందుకొచ్చింది. చట్టబద్ధమైన ఎంఎస్‌పి సాధించడంతో పాటు పర్యావరణహితమైన, ప్రజానుకూల విధానాలతో వ్యవసాయాభివృద్ధికి కృషి చేయడమే స్వామినాథన్‌కు ఘనమైన నివాళి. ప్రజాహితం కోసం జీవితాన్ని అంకింతం చేసిన మానవతామూర్తికి అక్షరాంజలి.