Oct 29,2023 00:50

సమావేశంలో ఇన్‌ఛార్జి కమిషనర్‌, ఇతర అధికారులు

ప్రజాశక్తి - గుంటూరు : ప్రతి వార్డు సచివాలయం పరిధిలో 'పల్లెకు పోదాం' కార్యక్రమ విజయవంతానికి కార్యదర్శులు భాధ్యత తీసుకోవాలని నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్‌ పివికె భాస్కర్‌ అన్నారు. కార్యక్రమ నిర్వహణపై శనివారం నగరపాలక సంస్థ కాన్ఫెరెన్స్‌ హాలులో సచివాలయ కార్యదర్శులతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 9 నుండి డిసెంబర్‌ 8 వరకు అన్ని వార్డ్‌, గ్రామ సచివాలయాల్లో 'పల్లెకు పోదాం' కార్యక్రమం అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు సచివాలయాల్లో ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, లబ్ధిదారులు, రానున్న పథకాలను స్థానిక ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రజలకు తెలియజేయాలన్నారు. సచివాలయం పరిధిలోని లబ్ధిదారుల వివరాలతో కూడిన డిస్‌ప్లే బోర్డులను పథకాల వారిగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు అర్హత ఉండి ఇంకా ఎవరికైనా అందకుండా ఉంటే వారికి వెంటనే అందించేందుకు 'పల్లెకు పోదాం' కార్యక్రమం ద్వారా దోహదపడుతుందని, కార్యదర్శులు, వాలంటీర్లు కార్యకమం గూర్చి స్థానిక ప్రజలకు తెలియచేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే సచివాలయాల వారిగా నోడల్‌, సూపర్వైజరి అధికారులను నియమించామన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ (ఇన్‌ఛార్జి) సిహెచ్‌.శ్రీనివాస్‌, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకటకృష్ణయ్య, మేనేజర్‌ శివన్నారాయణ, సూపరిండెంట్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.