ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : ఆగస్టు 9 ప్రపంచ (ఆదివాసీ దినోత్సవం) ఆదివాసీ హక్కుల దినంగా జరుపుకోవాలని ఆదివాసీ హక్కుల వేదిక ప్రతినిధులు నిర్ణయించారు. గుమ్మలక్ష్మీపురంలోని ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయంలో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన ఆదివాసి హక్కులు, చట్టాలు, గిరిజనులపై భౌతిక దాడులు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మతం, కులం పేరుతో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి గిరిజన మహిళలకు మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని నాయకులు వాపోయారు. ఇందుకు ఉదాహరణయే మణిపూర్‌లో గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో గిరిజనులపై దాడులు చేయిస్తుందన్నారు. గిరిజనులంతా ఐక్యంగా ఉండి హక్కులు, చట్టాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహించి సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసి జెఎసి నాయకులు కె.లక్ష్మణమూర్తి, కె.అవినాష్, పి.సత్యనారాయణ, ఎన్.కృష్ణబాబు, ఎన్.సింహాచలం, ఎం.రమణ, టి.సూర్యనారాయణ, పి.సుదర్శనరావు, వై.సూర్యనారా యణ, పత్తిక లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.










