Apr 04,2023 22:40

ప్రజాశక్తి-విజయవాడ రూరల్‌: శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఈ నెల 9న విజయవాడ రూరల్‌ మండలం నున్నలో చిన కంచిగా ప్రసిద్ధి చెందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆలయాన్ని సందర్శించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఇక్కడే బస చేసి, ఆలయంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించి మంగళవారం నున్న చిన కంచి ఆలయంలో ఆలయ ధర్మకర్త మొక్కపాటి శర్మ, విజయవాడ రూరల్‌ మండల మాజీ వైస్‌ ఎంపీపీ జీతం శ్రీనివాసరావు బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ధర్మకర్త మొక్కపాటి శర్మ మాట్లాడుతూ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి విజయయాత్రలో భాగంగా చిన కంచికి వస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 9న స్వామివారు ఆలయాన్ని సందర్శించి సందేశం ఇస్తారని తెలిపారు. అలాగే పదో తేదీన శ్రీ మహా త్రిపుర సుందరి సమేత చంద్ర మౌళీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు భాస్కరశర్మ, ఉమా మహేశ్వరరావు, నున్న ఉప సర్పంచ్‌ కలకోటి బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నాయకులు అంగజాల హనుమా, నారాయణరెడ్డి, నాగిరెడ్డి, ఆర్‌.రామారావు తదితరులు పాల్గొన్నారు.