Jan 06,2023 23:43

మాట్లాడుతున్న సిఐటియు నేత రాజ్‌కుమార్‌

ప్రజాశక్తి -పిఎం పాలెం :మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు, మినిట్స్‌లో అంగీకరంచిన అంశాలను అమలు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనికి నిరసనగా ఈనెల 9న టోకెన్‌ సమ్మెకు పిలుపునిచ్చినట్లు సిఐటియు జోన్‌ కార్యదర్శి పి.రాజ్‌కుమార్‌ వెల్లడించారు. శుక్రవారం చంద్రపాలెం పాఠశాల వద్ద మున్సిపల్‌ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నేతలు మాట్లాడుతూ కమిషనర్‌, మున్సిపల్‌ రాష్ట్ర అధికారులు సమావేశంలోనూ, పోరాటాల సమయంలో ని ఇచ్చిన హామీలు, చేసుకున్న ఒప్పందాల అమలులో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మరణించిన కార్మికుల వారసులు, అనారోగ్యం వల్ల దీర్ఘకాలంగా సెలవులో ఉన్నవారు, అరవైఏళ్లు నిండి, ఉద్యోగాలు ఆపిన కార్మికుల కుటుంబాలకు చెందిన 482 మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేర్చాలని కోరారు. క్లాప్‌ వెహికల్‌ డ్రైవర్లకు జిఒ7 ప్రకారం రూ.18,500 జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నీటిసరఫరా, విద్యుత్‌, యు జి డి కార్మికులకు రిస్క్‌ అలవెన్స్‌ఇవ్వాలని కోరారు. ఆపకస్‌లో చేరని వారిని చేర్చి, వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీనికి నిరసనగా చేపట్టే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జోన్‌ నాయకులు డి.అప్పలరాజు.జి.కిరణ్‌, కె.నాగరాజు, జి విజరు,బి రాంబాబు,కే ఆర్జునమ్మ, ఎం సుశీలమ్మ,క్లాప్‌ వెహికల్‌ సంఘం జోన్‌ అధ్యక్ష,కార్యదర్శులు కే సన్ని, సొండి చిన్నబాబు పాల్గొన్నారు.