రాజంపేట అర్బన్ : క్విట్ ఇండియా స్పూర్తితో మోడీని గద్దె దింపి దేశాన్ని కాపాడుకుందాం అన్న నినాదంతో ఈ నెల 9వ తేదీన చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేమయాలని సిఐటియు, ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్, ఎమ్మెస్ రాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఎఐటియుసి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మిక వర్గ సమస్యలు 9 ఏళ్ల మోడీ పరిపాలనలో పరిష్కారం కాలేదన్నారు. కనీస వేతనం రూ.26 వేలుకు పెంచాలన్న డిమాండ్‌నుపెడచెవిన పెట్టిందన్నారు. స్కీం వర్కర్ల శ్రమను దోచుకోవటం తప్ప వారిని పర్మినెంట్ చెయ్యటం లేదని తెలిపారు. కీలక రంగాలతో సహా ప్రతి ప్రభుత్వం రంగ సంస్థను ప్రైవేటీకరిస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ ప్రభుత్వం కొనసాగితే కార్మికులకే కాక రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివత్తిదారులు, తదితర శ్రామికులందరికీ తీవ్రమైన నష్టం వస్తుందని తెలిపారు. కార్మికుల మద్దతుతో చేసిన రైతుల పోరాటానికి తలొగ్గి నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ, రైతులకు మోడీ చేసిన వాగ్దానాలు ఇంత వరకు నెరవేరలేదన్నారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం విద్యుత్, మున్సిపల్, సహకార, విద్య, రవాణా తదితర రంగాల్లో అమలు చేస్తూ ప్రజలపై తీవ్రమైన భారాలు వేస్తోందన్నారు. పాలక వైసిపి, ప్రతిపక్ష టిడిపి ఎంపీలు పార్లమెంట్‌లో రైతు వ్యతిరేక చట్టాలను, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను బలపరచాలని తెలిపారు. మైనార్టీలపై, సామాజిక తరగతులపై సంఘపరివారం చేస్తున్న దాడులపై వైసిపి, టిడిపి, జనసేనలు నోరు విప్పటంలేదన్నారు. ఎఐటియుసి పట్టణ కార్యదర్శి సికిందర్, నాయకులు నాగేశ్వరావు, ఎల్లారెడ్డి, వెంకటేశు పాల్గొన్నారు.










