Aug 27,2023 21:56

సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగునాయుడు

ప్రజాశక్తి - బెలగాం : రాష్ట్ర ప్రభుత్వం 9/77 అసైన్డ్‌ చట్టాన్ని సవరించి 20ఏళ్లు దాటిన డి-పట్టా భూములను అమ్ముకోవచ్చని జీవో చేసిందని, ఈ జీవో వల్ల జిల్లాలోని గిరిజనులు, దళితులు, పేదల వద్ద ఉన్న భూమి పెద్దల చేతుల్లోకి వెళ్లిపోతుందని కావున ఈ సవరణనకు వెనక్కి తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగనాయుడు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవన్లో ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే గత 40, 50 ఏళ్ల క్రితం ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి వలస వచ్చిన పెత్తందారులు సాలూరు, పాచిపెంట, మక్కువ, పార్వతీపురం, కొమరాడ మండలాల్లో వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారని, అందులో డి-పట్టాలు కూడా ఉన్నాయన్నారు. ఇందులో కొంత భూమిని కొనుగోలు చేసి కొంత భూమిని దురాక్రమణ చేశారని అన్నారు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి తెచ్చిన ఈ జీవోతో అక్రమంగా ఉన్న అసైన్డ్‌ భూములన్నీ మన్యం ప్రాంతంలో సక్రమంగా మారిపోతున్నాయన్నారు. దీనివల్ల గిరిజనులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కావున తక్షణమే 9/77 అసైన్డ్‌ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలని కోరారు. అలాగే ఈనెల 31లోపు సచివాలయాల్లో డి-పట్టా సాగుదారులు, హక్కుదారులు పేర్లు నమోదు చేసి బహిరంగంగా జాబితా పెట్టాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ జిల్లాలో ఎక్కడా అధికారులు విచారణ చేయలేదన్నారు. దీంతో ఏ సచివాలయంలోనూ డి-పట్టా జాబితాలు పెట్టలేదని, వెంటనే కలెక్టర్‌, తహశీల్దార్లు జోక్యం చేసుకొని వాస్తవ డిపట్టాదారులు, సాగుదారుల జాబితాను సచివాలయాల్లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. అలాగే అన్యాక్రాంతమైన డి-పట్టా భూములన్నీ తిరిగి పట్టాదారులకు అప్పజెప్పాలన్నారు. లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున గిరిజనులను, దళితులను, పేదలను కదిలించి భూ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి ఈశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు పి.రాము, బి.మోహన్‌రావు, గరుగుబిల్లి శ్రీనివాసరావు, దుర్గారావు, శివున్నాయుడు పాల్గొన్నారు.